twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వామ్మో..వెంకటేశ(రివ్యూ)

    By Srikanya
    |
    Namo Venkatesa
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నటీనటులు: వెంకటేష్‌, త్రిష, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ,
    జయప్రకాష్‌ రెడ్డి, సుధ, సురేఖావాణి, భరత్‌ తదితరులు.
    కథ: గోపీమోహన్
    ఆర్ట్: ఆనంద సాయి
    కెమెరా: ప్రసాద్ మురెళ్ళ
    ఎడిటింగ్: ఎమ్.ఆర్.వర్మ
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
    మాటలు: చింతపల్లి రమణ
    సమర్పణ: డి.సురేష్‌ బాబు
    నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల
    రిలీజ్ డేట్: జనవరి 14, 2010

    షి ఈజ్ హాట్..హీ ఈజ్ కూల్..మధ్యలో ఫూల్ అని నమో వెంకటేశ పోస్టర్స్ పై పెద్దగా వేసి పబ్లిసిటీ చేసారు. ఆ వాక్యంలో హాట్ ..కూల్ అంటే హీరో, హీరోయిన్స్ అని అందరికీ అర్దమైంది. అయితే మధ్యలో ఫూల్ ఎవరనేది మాత్రం సినిమా చూస్తే స్పష్టంగా అర్ధమైంది. పోస్టర్స్, కాంబినేషన్(శ్రీనువైట్ల, వెంకటేష్, త్రిష) చూసి ఏదేదో ఊహించుకుని పరెగెత్తుకుని ధియోటర్ కి వచ్చిన ప్రేక్షకుడే ఆ ఫూల్. కామిడీలో ఇప్పటికే పండిపోయిన వెంకటేష్,శ్రీను వైట్ల తొలి కాంబినేషన్ అంటే ఏదో అధ్దిరిపోయే కామిడీ వస్తుందని వెళ్తే అక్కడ వ్వె..వ్వె..మీకంత సీన్ లేదు..అని వెక్కిరించినట్లయింది. ఏదో క్రేజీ కాంబినేషన్ కుదిరింది కదా అని అర్జెంటుగా రీళ్ళు చుట్టేసాం...అలవాటులో పొరపాటుగా అక్కడక్కడా కామిడీ పడింది..అది మీ అదృష్టం అని దర్శకుడు క్లారిటీగా చెప్పినట్లుంది.

    ఏజ్ బారైన పర్వతనేని వెంకటరమణ (వెంకటేష్‌) కొంచెం అమాయికత్వం,మరికొంత మంచితనం ఉన్న వ్యక్తి. అతను వెంట్రిక్వాలిజం చేసి బ్రతుకు నెడుతూంటాడు. అలాగే అతని ఏకైక జీవితాశయం తన డ్రీమ్ గర్ల్ ని కలుసుకోవటం. అయితే ఆ అవకాశం వెంకీ కి ప్యారిస్ ట్రిప్ లో వచ్చింది. అక్కడి తెలుగు వారి ఆహ్వానంతో ప్రదర్శనలు ఇవ్వటానికి వెళితే అక్కడ త్రిష పరిచయమైంది. ఆమె ఆ పోగ్రాం ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్(బ్రహ్మానందం) మేనకోడలు. వెంటెనే ఆమెతో ప్రేమలో పడి ప్రొసీడైపోదామని డిసైడ్ అవుతాడు. అయితే ప్రసాద్ సామాన్యుడు కాదు. అతనకి (హిందీ భేజా ఫ్రై సినిమాలోలాగ) కళాకారులును ఏడ్పించి ఆనందించే శాడిజం ఉంది. దాంతో తన మేనకోడలుతో లవ్ లో పడ్డ వెంకీని ఒక ఆట ఆడించాలనకుంటాడు. దాంతో త్రిషను కూడా కలుపుకుని ఆమె నిన్ను ప్రేమిస్తోందని చెప్పి వెంకీని తిప్పలు పెడుతూంటాడు. ఈలోగా త్రిష తాతయ్య (జయ ప్రకాష్ రెడ్డి) కు సీరియస్ గా ఉందని ఇండియాకు రమ్మని ఫోన్ వస్తుంది. రెగ్యులర్ గానే ఆమె అక్కడకు వెళ్ళగానే రెడీగా ఉన్న (విలన్) సుబ్బరాజుతో మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. ఆ ఫ్యాక్షన్ ఏరియానుంచి పారిపోవాలని త్రిష ట్రై చేసినా కుదరదు. అప్పుడు మళ్ళీ వెర్రిబాగుల వెంకినే అడ్డం పెట్టుకుని ఆ ప్రమాదం నుంచి బయిటపడాలని ప్లాన్ చేస్తారు. దాంతో వెంకీ ఆమె ఇంటికి వచ్చి మకాం వేసి తన ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అంతా సవ్యంగా జరుగుతుందనగా వెంకికి మరో ఊహించని నిజం తెలుస్తుంది. అప్పుడు వెంకీ ఏం చేస్తాడు..ఏమిటా ట్విస్టు లాంటి నిజం అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    వెంకటేష్ వి ఎన్నో సినిమాల్లో చూపిన రెగ్యులర్ ఎక్సప్రెషన్స్, శ్రీను వైట్లవి తన సినిమాల్లోంచే పుట్టిన రిపీట్ సన్నివేశాలు. దాంతో ఇది పాత కథను పాతగానే చూసిన ఫీలింగ్ ఏర్పడింది. ఇక కథకు కొత్తగా అనుకు్న బ్రహ్మానందం, వెంకటేష్ క్యారెక్టర్స్ హిందీ భేజా ప్రై నుంచి ఎత్తుకున్నా వాటిని సరిగా ఆసక్తిగా మలచుకుని కథలో వేడి పుట్టించలేకపోవటం మెయిన్ మైనస్. ఎందుకంటే వెంకటేష్ క్యారెక్టర్ లోనే క్లారిటీ లేదు. కాస్సేపు వెర్రిబాగులవాడిలా ఉంటాడు..ఆ తర్వాత తెలివైన హీరోలా ప్లాన్ లు గీస్తూంటాడు. అలాగే వెంకి పాత్రకు బ్రహ్మానందం ఆడిస్తున్న డ్రామా, శాడిజం ప్రి క్లైమాక్స్ వరకూ తెలియదు. దాంతో వెంకి ఎక్కడా తిరిగి బ్రహ్మానందాన్ని ఇరుకున పెట్టే అవకాశం లేకుండా పోయింది. పోనీ బ్రహ్మానందం చేసే పనులు తెలియకపోయినా తన మంచితనం,అమాయికత్వంతో నైనా వెంకీ..బ్రహ్మానందాన్ని ఇరికిస్తే నవ్వులు గ్యారింటీగా పండేవి. అదీ జరగలేదు. దాంతో కేవలం డైలాగ్ కామిడీ వచ్చినప్పుడే ప్రేక్షకులు నవ్వాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

    ఇక నటీనటులు వద్దకు వస్తే వెంకటేష్ తన వయస్సును ఈ సినిమాలో కప్పిపుచ్చలేకపోయారు. త్రిష కేవలం గ్లామర్ డాల్ గానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆమె సినిమా మొదటనుంచి చివరదాకా వెంకటేష్ ను మోసం చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్ తోనే ఉంటుంది. దాంతో ఎక్కడా లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కుదరలేదు.బ్రహ్మానందం విషయానికి వస్తే ఎప్పటిలాగానే బాగా చేసారు. అయితే ఆయన రెచ్చిపోయి చేయటానికి సరైన సన్నివేశాలే లేవు. అలీ పాత్ర ఉన్నా లేనట్లే..పెద్దగా ఉపయోగం లేదు. అలాగే తెలంగాణ శకుంతల,కోట వంటి సీనియర్స్ ని కరివేపాకులా వాడుకున్నారు..కానీ కీలకమైన సీన్స్ కు వారు లేరు. సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ లో నమో వెంకటేశ అనే టైటిల్ సాంగ్ బాగుంది..మంచి రెస్పాన్స్ వచ్చింది. మిగతా పాటలు పెద్దగా వర్కవుట్ కాలేదు. కెమెరా, ఎడిటింగ్ క్వాలిటీగా ఉన్నాయి. డైలాగులు ఓకే అనిపించుకున్నాయి...ఎందుకంటే గత శ్రీను వైట్ల చిత్రాల రేంజిలో మాత్రం లేవు.

    ఇక ఈ చిత్రం పైనల్ గా వెంకటేష్ కి చింతకాయల రవి చిత్రం రేంజ్ అయితే శ్రీను వైట్లుకు కింగ్ లాంటి సినిమా. ఏదైమైనా శ్రీనువైట్ల స్క్రిప్టు సరిగా చూసుకుంటే ఇంతకన్నా మంచి సినిమా వచ్చేది ఖాయం. అలాగే వెంకటేష్ కి ఫ్యామిలీలే అండ..అలాగని వారు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్, కథని ఎంతకాలం భరిస్తారు..అదే హీరోతో అదే కథ మళ్ళీ..మళ్ళీ అంటే కష్టమేగా..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X