twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వి(న్)నాయకుడు(రివ్యూ)

    By Staff
    |

    Vinayakudu
    -సూర్య ప్రకాష్ జోశ్యుల

    బ్యానర్:ప్రేమ్ మూవీస్
    తారాగణం:కృష్ణుడు,సోనియా,పూనమ్ కౌర్,సూర్య తేజ్,
    జ్యోతి,ఆదర్శ్,మురళీకృష్ణ,ప్రేమ కుమార్ పత్రా,సామ్రాట్,
    తులసి తదితరులు
    కెమెరా:పి.జి.విందా
    సంగీతం:సామ్ ప్రసేన్
    ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్
    కధ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సాయి కిరణ్ అడవి
    నిర్మాత:సరిత పట్రా
    విడుదల:నవంబర్ 21న ఓవర్‌సీస్‌లో. 22న ఆంధ్రప్రదేశ్‌లో...

    ఈ సినిమాను మన రెగ్యులర్ డైరక్టర్స్ చేసుంటే గ్యారింటీగా ఏ 'బండోడి ప్రేమ' అనే టైటిల్ పెట్టి అంతే మోటుగా సినిమా చుట్టేసేవారు. అంతేగాక ఒబిసిటిపై రకరకాల డైలాగులు,ఘోరంగా జోకులు వేసి చివరలో "అలా అనకూడదు..వాళ్ళు మనలాంటి వారే..గుర్తించండి" అని అధ్బుతమైన మెసేజ్ చెప్పేసి ఎంత గొప్ప పని చేసేమో అన్నట్లు మనవంక చూసేవారు. ఈ కొత్త డైరక్టర్ అలా పాత రూటులోకి వెళ్ళి అతి చేయ్యకపోవటమే ఈ సినిమా గొప్పతనం . నేరేషన్ స్లోగా ఉందనిపించినా, మరింత కామిడీ కిక్ కావాలి అనిపించినా,శేఖర్ కమ్ములని అనుకరించాడనిపించినా ఓ.కె అనిపించటానికి కారణం అదే. ఓ చక్కటి సాయిత్రాన్ని మరీ డ్రైగా మార్చకుండా,డబ్బు ఒట్టినే ఖర్చయిందే అనిపించకుండా చూడచ్చు అనే ఈ సినిమా మల్టిఫ్లెక్స్ లు దాటితే నిజమైన విజయం సాధించినట్లు.

    భారీకాయం గల కార్తీక్(కృష్ణుడు) సిటీకి జాబ్ కోసం వచ్చిన కుర్రాడు. నాజూగ్గా ఉన్న కల్పన(సోనియా) అక్కడే ఆల్రెడీ జాబ్ చేస్తున్న మోడ్రన్ సిటీ గర్ల్. ఆమెకు జూనియర్ గా కార్తీక్ చేరుతాడు. మొదటి చూపులోనే కార్తీక్ కి ఆమెపై మనస్సు కలిగితే,కల్పనకి అతనంటే ఏహ్య భావం కలుగుతుంది. ఇది చాలదన్నట్లు మరో ప్రక్క కల్పనకు ఆమె ఇంట్లో వాళ్ళు ఓ అందమైన సాఫ్ట్ వేర్ కుర్రాడితో మ్యారేజ్ ప్రపోజల్ పెడతారు. ఇలా ఈ ఇద్దరి మధ్య ప్రేమ,పెళ్ళి వంటివి అసాధ్యం అనుకున్న స్ధితిలో వాళ్లు ప్రేమికులు ఎట్లా అయ్యారు అంటే...సినిమా చూడాల్సిందే.

    నిజానికి సాధారణ ప్రేక్షకుడు సైతం 'వినాయుడు' టైటిల్,పోస్టర్ చూసి కథ చెప్పేయగలడనటం అతిశయోక్తి కాదు. అలాగే కాన్సెప్టు సైతం ఇలాగే ఉంటుందని మూడవ తరగతి కుర్రాడు సైతం ఊహించేయగలడు. ఇక కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్నవాడైతే ఆ హీరోయిన్ కి మొదటే ఎంగేజ్ మెంట్ అయ్యుంటుంది అని మరో మెలిక కూడా విప్పేయగలడు.ఇవన్నీ ఆలోచించే దర్శకుడు కూడా పాపం అంతలా ఫిక్స్ అయి వచ్చిన వారిని నిరాశపరచటమెందుకు అనే ఆలోచించే కాబోలు అదే కాన్సెప్టుతో అలాగే సినిమా తీసాడు.

    మరి ఇంతలా తెలిసిపోతున్న ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే..అంత ధిన్ లైన్ ని అంత పెద్ద ప్యాట్ స్టోరీగా మార్చి రెండు గంటలు ఎలా నడిపాడా అనే క్యూరియాసిటే ఫస్ట్ రీజన్. ఆ కోణంలో నిరాశపరచడు. ష్యూర్. అలాగే ఒబిసిటి మీద సబ్జెక్టు కదా అని 'కితకితలు' సినిమాలా కుళ్ళు కామెడీని మనమీదకు విసరకుండా క్లాస్ గా(క్లాస్ కూడా పీకకుండా) తీయటం మరో కారణం. అన్నిటినీ మించి కొత్త దర్శకుడైనా అనుకున్న పాయింట్ ని ఎక్కడా తడపడకుండా,ప్రక్కకు వెళ్ళకుండా జాగ్రత్తగా సీన్స్ తయారు చేసుకున్నందుకు మెచ్చుకోవటానికైనా చూడాలి. ఇక ప్రి క్లైమాక్స్ లో ఇద్దరూ విడిపోయే కారణం బాగా దర్శకుడు ఎస్టాబ్లిష్ చేసాడు. కానీ ఆ సన్నివేశం 'ఆనంద్' లోని ప్రి క్లైమాక్స్ లీడ్ సీన్ గుర్తుకు తెస్తుంది.అలాగే పెళ్ళికి ముందు సెక్స్ గురించి డైలాగులు చెప్పే దగ్గర మంచి స్పందన వచ్చింది. అంతేగాక కళ్ళు మూసుకుంటే ఏ కలర్ కనపడుతుందో దాన్నిబట్టి మన మనస్సు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నట్లు అనే పాయింట్ ని సినిమాలో డీల్ చేయటం బాగుంటుంది.

    అయితే ఈ సినిమాలో లోపాలు లేవా అంటే హీరో,హీరోయిన్స్ మద్య పడాల్సిన కామెడీ మెలిక(కాంఫ్లిక్ట్ కాదు)మరింత బలంగా పడాలని అర్ధమవుతుంది.షాల్లో హాల్ లో ఎంత బావుంటుంది. అప్పుడు మరింత నవ్వులు గ్యారింటీగా పూసేవి. అలాగే కధనంలో ఊహించని మలుపులు తీసుకుని జస్టిఫై చేస్తే ప్రెడిక్టిబులటి(ఊహకందటం) కాస్త తగ్గి మరింత ఆసక్తి పెరిగేది. ఎంతసేపు కార్తీక్ పాత్ర ఒబిసెటీ ప్లాబ్లం ఉందని,అతనిది గోల్డెన్ హార్ట్ అని విపరీతంగా చూపెట్టడమే సరిపోయింది. దాంతో కార్తీక్ పాత్ర ప్రేమని మనస్సుల్లోనే దాచుకున్నాడు అన్నది ఎక్కువ రిజిస్టర్ చేయలేకపోయారు. అతని ఎమోషన్స్ ని ఆ కోణంలోనూ కాప్చర్ చేస్తే బావుండేది. అలా కాకుండా ఏదో ఒకటి రెండు డైలాగులుతో చెప్పి జాలి పుట్టించాలని ట్రై చేసారు.నిర్మాత ఓ ప్రత్యేకమైన పాత్రలో ఏ ఎమోషన్స్ ముఖంపై చూపని మనుషులు ఎలా ఉంటారో చూపిస్తూ నటించాడు.సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ లాగే ఛాలా బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా డైలాగుల్లో కాస్త ఇంగ్లీష్ తగ్గిస్తే మరింత బాగా అర్ధమయ్యేదనిపిస్తుంది. అయితే డైరక్టర్ నా సినిమా మల్టిప్లెక్స్ ప్రేక్షకులకే అని ఫిక్స్ అయితే చేసేందేం లేదు.

    నటీనటుల్లో ...కృష్ణుడు,సోనియా చక్కగా సరిపోయారు. అయితే వీళ్ళిద్దరు కన్నా సోనియా ప్రెండ్ గా వేసిన దీప్తి బాగా చేసింది.ఇక దర్శకుడుగా సాయి సక్సెస్ అయ్యాడు. టేకింగ్ నీటుగా ఉంది. అయితే ఎడిటింగ్,సంగీతం మరింత జాగ్రత్తగా చూసుకుంటే బాగుండును అనిపిస్తుంది.కెమెరా వర్క్ మెచ్చుకోతగిన రీతిలో ఉంది.

    ట్విస్టులు,టెన్షన్ లు ఉన్న సినిమాలు ఇష్టపడేవారికి ఈ వినాయుకుడు బిగ్ బోర్ స్టోరీగా మిగులుతుంది. అలా కాకుండా ఓ హాలీవుడ్ తరహా రొమాంటిక్ కామెడీ చూడబోతున్నాం...ఇందులో బ్రహ్మానందం,వేణుమాధవ్ వంటి వారి కామెడీ ట్రాకులు ఉండవు. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ సీక్వెన్స్,హీరోయిన్ డ్రీమ్ సాంగ్స్ అస్సలు ఉండే అవకాశం లేదు..అని చక్కగా ఫిక్స్ అయి వెళితే బావుందే...అనిపిస్తుంది.అధ్బుతం అని అనటం కష్టం.అయితే ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఒళ్ళు తగ్గించుకోకపోయినా ఫరవాలేదు. గోల్డెన్ హార్ట్ (అఫ్ కోర్స్ గోల్డ్ కూడా)ఉంటే చాలు.అమ్మాయిలు ఒక నిముషం లేటయినా లైనవుతారని ధైర్యం చెబుతుందీ సినిమా.కాబట్టి ఒబిసిటీ ఉంటే మీ గర్ల్ ఆర్ బాయ్ ప్రెండ్స్ ని (టిక్కట్ మీరే తీసి) ఈ సినిమాకు పంపితే వర్కవుట్ అయ్యే అవకాశాలు మెరుగవతాయి. ట్రై చేయండి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X