»   » పాపం..మన హీరోలను పట్టించుకోవటం లేదు (ఫొటో ఫీచర్)

పాపం..మన హీరోలను పట్టించుకోవటం లేదు (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ చిత్ర పరిశ్రమకు, తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. ఇక్కడి కథలు అక్కడ, అక్కడవి ఇక్కడ అంటూ అలనాటి నుంచి మార్పిడి కొనసాగుతూనే ఉంది. ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌, ఎన్‌టీఆర్‌, ఏఎన్నార్‌ కాలంలో ఆయా స్టార్లు మాతృభాషకే పరిమితం కాగా.. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, నాగార్జున తరంలో పరిస్థితి మారిపోయింది.

కథల మార్పిడికన్నా.. అనువాద రూపంలో తమిళ స్టార్లు తెలుగులోనూ, తెలుగు స్టార్లు తమిళంలోనూ పరిచయం అయ్యారు. ఇక్కడ విజయవంతమైన హీరోలుగా కోలీవుడ్‌ స్టార్లే నిలిచారు. రజనీకాంత్‌తో పాటు కమల్‌హాసన్‌ నేటితరం సూర్య, విక్రమ్‌, విజయ్‌ తెలుగులో మంచి మార్కెట్‌ను దక్కించుకుంటే.. అడపాదడపా హిట్లు తప్పించి కోలీవుడ్‌లో స్థిరమైన మార్కెట్‌ను దక్కించుకున్న టాలీవుడ్‌ హీరోలు లేరు. ఇటీవల కొందరు తెలుగు కుర్రహీరోలు కోలీవుడ్‌లో చాలా నమ్మకంతోనే అడుగుపెట్టారు.

మురిపిస్తారని ఎదురుచూసినా.. కాలం కలిసిరాక.. వారు కూడా ఒకట్రెండు సినిమాలతోనే సరిపెట్టుకున్నారు. మరో తెలుగు హీరో త్వరలోనే తమిళ చిత్ర సీమకు పరిచయం కానున్నారు. ఆయనే నవీన్‌చంద్ర. ఫలితం ఏమేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.

ఆర్యన్ రాజేష్

ఆర్యన్ రాజేష్

ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్‌రాజేష్‌ను నేరు తమిళ హీరోగా కోలీవుడ్‌కు పరిచయం చేశారు. అప్పటికే 'సొంతం'తో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి మరికొన్ని చిత్రాల్లో నటించారాయన. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్‌లో కూడా రాణిస్తారని అందరూ ఎదురుచూశారు. అందుకు తగినట్టుగానే ఈ చిత్రంలోని పాటలు విజయంతం కాగా.. ప్రచారం కూడా బాగానే కల్పించి అంచనాలు పెంచారు. విడుదలయ్యాక చిత్రం కాస్తా బాక్సాఫీసు వద్ద బోల్తాపడటంతో ఆర్యన్‌కు మళ్లీ చిత్రాలంటూ లేని పరిస్థితి తలెత్తింది.

అల్లరి నరేష్

అల్లరి నరేష్

ఆర్యన్‌ రాజేష్‌ సోదరుడు అల్లరి నరేష్‌ కూడా ఇలాంటి అంచనాలే రేకెత్తించినా.. వాటిని నిలుపుకోలేకపోయారు. తొలి చిత్రం 'అల్లరి'ని 'కురుంబు' పేరుతో తమిళంలోకి తీసుకొచ్చారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా అది ఫర్వాలేదనిపించినా... నరేష్‌కు ఇక్కడ కూడా అవకాశాలు వచ్చాయి. తెలుగులో బిజీగా ఉన్న నరేష్‌ వెంటనే తమిళ చిత్రాలను అంగీకరించలేకపోయారు. మధ్యలో సముద్రకని దర్శకత్వంలో శశికుమార్‌తో కలిసి 'పోరాళి'లో నటించారు. నటన పరంగా మంచి మార్కులే పొందినా... చిత్ర పరాజయంతో తన అల్లరిని టాలీవుడ్‌కే పరిమితం చేశారు.

నాని

నాని

ఈ జాబితాలోని మరో హీరో నాని. తెలుగులో చక్కని గుర్తింపు తెచ్చుకున్న నాని.. 'వెప్పం' అనే తమిళ చిత్రంలో నటించారు. తెలుగులో 'స్నేహితుడా', 'అష్టాచమ్మా', 'రైడ్‌', 'పిల్ల జమిందారు' అంటూ వరుస హిట్ల నేపథ్యంలో వచ్చిన 'వెప్పం' విజయవంతంపై అందరూ విశ్వాసంతో ఉండగా.. షరా మాములుగానే అది పరాజయం పాలైంది. ఆపై అలాంటి మార్కెట్‌ను నాని దక్కించుకోకపోయినా.. గుర్తింపును మాత్రం దక్కించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రంలో ప్రేమికుడి పాత్రకు చక్కని స్పందన తెచ్చుకున్న నాని ఇటీవల నటించిన 'ఆహా కల్యాణం' ద్వారా చెప్పుకోదగిన ఓపెనింగ్‌ వసూళ్లు సాధించుకున్నారు.

శర్వానంద్

శర్వానంద్

నాని తర్వాత శర్వానంద్‌ కూడా కొంతమేర ఫర్వాలేదనపించారు. శరవణన్‌ దర్శకత్వంలో 'ఎంగేయుం ఎప్పోదుం'లో నటించిన శర్వానంద్‌ ఆ చిత్రం ఘన విజయంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చేరన్‌ దర్శకత్వంలో నటించిన 'జేకే ఎనుం నన్బనిన్‌ వాళ్కై' విడుదల కావాల్సి ఉంది.

అల్లు శిరీష్

అల్లు శిరీష్

అంచనాల నడుమ ఘోరంగా నిరాశపర్చిన యంగ్‌ హీరో అల్లు శిరీష్‌. తమిళంలో అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాధామోహన్‌ దర్శకత్వంలో 'గౌరవం' చిత్రంలో నటించారాయన. ఆయనికిదే తొలి చిత్రం. ద్విభాషా చిత్రమైనా.. తమిళంలోనూ నేరు చిత్రంగానే రూపొందించారు. ముఖ్యంగా ధర్మపురి తదితర జిల్లాల్లో అప్పట్లో హెచ్చుగా చోటుచేసుకున్న పరువు హత్యల నేపథ్యంలో కథ నడిపారు. మెగా ఫ్యామిలీ హీరో కావటం, కథపై నమ్మకం, రాధామోహన్‌ దర్శకత్వం తదితర అంశాల ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని అందరూ ఎదురుచూశారు. అయితే కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ ఈ చిత్రం ఘోరంగా విఫలమైంది.

తరుణ్

తరుణ్

కెరీర్‌ ప్రారంభంలోనే కాకుండా.. తెలుగులో పరిచయమైన కొంతకాలానికి తమిళంపై దృష్టి సారించి విఫలమైన హీరోగా తరుణ్‌ నిలిచారు. తెలుగులో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' చిత్రంతో తమిళంలో 'ఉనక్కు18 ఎనక్కు20'గా పరిచయమయ్యారు. ఫలితం నిరాశే. అనంతరం 'పున్నగై దేశం'లో మనోజ్‌తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నా.. ఆయనా ఇక్కడ నిలదొక్కులేకపోయారు.

నవీన్‌ చంద్ర..

నవీన్‌ చంద్ర..

ఇలా ఇప్పటివరకు కోలీవుడ్‌లో అడుగుపెట్టిన టాలీవుడ్‌ కుర్రహీరోలంతా మిశ్రమ ఫలితాలు అందుకున్న నేపథ్యంలో తాజాగా మరో టాలీవుడ్‌ హీరో తమిళ వెండితెరపై తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. 'అందాల రాక్షసి'లో ఆకట్టుకున్న నవీన్‌చంద్ర 'శరభం'తో తమిళ తెరకు పరిచయం కానున్నారు. పరభాషల్లోనూ గుర్తింపు తెచ్చుకోవటం ద్వారా తమ మార్కెట్‌ను పెంచుకోవాలని కుర్ర హీరోలు ప్రయత్నిస్తున్నారు. మరి నవీన్‌చంద్ర ఎంతవరకు ఈ విషయంలో విజయం సాధిస్తారో.. వేచిచూద్దాం!

English summary
Mass formula for Tamil and Telugu films is the same, with the larger-than-life action hero, who dances like a dream and fights superbly on screen. So telugu Hero's want to grab Kollywood Market.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu