For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'యాక్షన్‌ కింగ్‌' కుమార్తె హీరోయిన్... వావ్ (ఫోటోలతో..)

  By Srikanya
  |

  చెన్నై: మా పల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు, జెంటిల్‌మేన్‌, ఒకే ఒక్కడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో అర్జున్‌. ఇప్పుడాయన పెద్ద కుమార్తె హీరోయిన్ గా కెమెరా ముందుకు రాబోతున్నారు. ఆ అమ్మాయి పేరు... ఐశ్వర్య. విశాల్‌ హీరోగా 'పట్టత్తు యానై' అనే చిత్రం మొదలైంది.

  ఈ చిత్రంలో ప్లస్‌టూ చదివే విద్యార్థినిగా ఆమె పాత్ర ఉంటుంది. ఐశ్వర్య ప్రస్తుతం విజువల్‌ కమ్యూనికేషన్స్‌కి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్నారు. విశాల్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని భూపతి పాండ్యన్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి 'పట్టత్తు యానై' అనే పేరు ఖరారు చేశారు.

  ఇటీవలే చిత్రీకరణ ఏవీఎం కాలనీలో ప్రారంభమైంది. గ్లోబల్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానరుపై మైఖేల్‌ రాయప్పన్‌ నిర్మిస్తున్నారు. అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య కథానాయికగా నటిచంటం చిత్రానికి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు.

  'యాక్షన్‌ కింగ్‌'గా వెండితెరపై ప్రత్యేకస్థానం సంపాదించుకున్న నటుడు అర్జున్‌. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకున్నాడు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకు వస్తోంది ఆయన తనయ ఐశ్వర్య. విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'పట్టనత్తు యానై'లో కథానాయికగా తెరంగేట్రం చేస్తోంది. భూపతి పాండియన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కళామతల్లి ముంగిట అడుగుపెడుతున్న తన కుమార్తెను అర్జున్‌ పరిచయం చేశారు.

  అర్జున్ మాట్లాడుతూు... నా కుమార్తె ఐశ్వర్యను తెరపైకి తీసుకొస్తున్నాననే విషయం తెలుసుకుని చాలామంది మిత్రులు, బంధువులు, సినీవర్గ ప్రముఖులు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సంతోషం పంచుకున్నారు. 'అమ్మాయి కదా.. నాయికగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందా?' అని మరికొందరు స్నేహితులు అడిగారు. ప్రతి రంగంలోనూ మంచి చెడులున్నాయి. మనం నడుచుకునే తీరును బట్టే అవి మనల్ని ప్రభావితం చేస్తాయి. సినీ పరిశ్రమ నా ఇల్లు. నా ఇంట్లో నా కుమార్తెను తిప్పేందుకు భయపడితే పొరుగువారు ఎలా ఆలోచించాలి? వాస్తవంగా చెప్పాలంటే ఐశ్వర్యను నేను అబ్బాయిగానే పెంచా. తనకు ధైర్యమెక్కువ. మిగిలిన వారు ఎలా ఆలోచిస్తారన్నది నాకు ముఖ్యం కాదు. తనను తెరకు పరిచయం చేస్తుండటం నిజంగానే సంతోషంగా ఉంది.

  స్టెల్లా మేరీస్‌ కళాశాలలో ఐశ్వర్య బీ.కాం చదువుకుంది. ఆ తర్వాత లండన్‌లో మేనేజ్‌మెంట్‌ ఫ్యాషన్‌ కోర్సు చేసింది. ఆ సమయంలోనే చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగు, కన్నడంలో నటించమని చాలా మంది అడిగారు. అప్పుడు తనకు ఆ ఆలోచనే లేదు. ఆ మధ్య నిర్మాత జీకే రెడ్డి నాతో మాట్లాడారు. 'విశాల్‌ ప్రధానపాత్రధారిగా మంచి కథ ఉంది. అందులో ఐశ్వర్యను నటింపజేస్తే బాగుంటుంద'ని అడిగారు. తను సరేనంటే నాకెలాంటి అభ్యంతరం లేదన్నాను. ఇదే విషయమై ఐశ్వర్యను అడిగా. కథ విన్నాక నచ్చడంతో నటిస్తానని చెప్పింది. నేను చేసిన 'గిరి' సినిమాకి భూపతి పాండియన్‌ కథ సమకూర్చారు. ఇప్పుడాయన దర్శకుడిగా మంచి విజయాలు సొంతం చేసుకుంటున్నారు. నా కుమార్తె తొలి చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తుండటం సంతోషంగా ఉంది.

  నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 30 సంవత్సరాలైంది. నా అనుభవంలో తెలుసుకున్న అంశం ఏమిటంటే కాంబినేషన్‌ చాలా ముఖ్యం. ఆ కోవలో చూస్తే నా కథానాయకుడు విశాల్‌కు జంటగా ఐశ్వర్య అవకాశం దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. విశాల్‌ను నా హీరో అని ఎందుకు అంటున్నానంటే.. నేను 'వేదం' తెరకెక్కించేటప్పుడు విశాల్‌ సహాయ దర్శకుడిగా చేరాడు. అప్పుడు కొన్ని సంభాషణల్ని సహాయకుల దగ్గర కూడా చెప్పించే వాడిని. అప్పుడు విశాల్‌ చెప్పే తీరును చూసి ఆశ్చర్యపోయా. 'నువ్వు దర్శకుడివిగా కాదు. కథానాయకుడిగా మారితే తిరుగుండదు' అని చెప్పా. అదే విషయాన్ని విశాల్‌ నాన్న జీకే రెడ్డికి కూడా తెలిపా. ఇప్పుడతను అగ్రనటుల్లో ఒకడిగా హవా చాటుతుండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఐశ్వర్యను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ముగించాడు.

  ఐశ్వర్య మాట్లాడుతూ.... ప్రారంభంలో అసలు నటించాలనే కోరికే లేదు. 'పట్టనత్తు యానై' కథ విన్నాక నటించాలనిపించింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇదంతా చూస్తుంటే 'యాక్షన్‌ కింగ్‌'గా నాన్న పేరును నిలబెట్టాలనే తపన పెరిగింది. తప్పకుండా అందరిలోనూ 'యాక్షన్‌ క్వీన్‌'గా పేరు సంపాదించుకుంటా అంది.

  English summary
  Pattathu Yaanai Press Meet held at Chennai. Arjun Sarja, Aishwarya Arjun, Vishal and Others were present at a event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X