Brahmamudi October 10th Episode: ఇల్లు వదిలి వెళ్లిపోయిన కావ్య... రాజ్ మొండితనంతో కాపురం ముక్కలు
Photo Courtesy: JioHotstar
రాజ్‌కి డాక్టర్ ఫోన్ చేసి అబార్షన్ చేయించడం ఇంకా ఆలస్యమైతే కావ్య ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తుంది. ఇంట్లో గొడవల గురించి కావ్యతో మాట్లాడటానికి వెళ్తుండగా అప్పూని ధాన్యలక్ష్మీ ఆపుతుంది. ధాన్యానికి రుద్రాణి ఎదురై నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నీ కోడలి పరిస్ధితి దారుణంగా మారుతుందని వార్నింగ్ ఇస్తుంది. దాంతో రగిలిపోయిన ధాన్యలక్ష్మీ ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. ఇంట్లో జరుగుతున్న గొడవలకి రాజ్- కావ్యలే కారణమని వీళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సరే లేకపోతే నా భర్తని, కొడుకుని, కోడలిని తీసుకుని బయటికి వెళ్లిపోతానని రాజ్‌కి వార్నింగ్ ఇస్తుంది ధాన్యం.
మీ నిర్ణయం అదే అయితే నేను మిమ్మల్ని ఆపనని రాజ్ అనడంతో సీతారామయ్య వచ్చి మనవడిని లాగిపెట్టి కొడతాడు. వాళ్లని బయటికి వెళ్లిపోమంటావా? కుటుంబాన్ని ముక్కలు చేస్తావా? అని మండిపడతాడు. ఏం జరిగినా సరే కళావతి కడుపులో బిడ్డ నాకు అక్కర్లేదని తేల్చి చెబుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ 848లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్ తనకు బిడ్డ వద్దని చెప్పేశాడని, ఇక ఆలోచించుకోవాల్సింది నువ్వేనని కావ్యపై సీరియస్ అవుతుంది ధాన్యలక్ష్మీ. నువ్వు రాజ్ చెప్పినట్లు చేయాలని నీకు చెప్పే హక్కు నాకు లేదు.. కానీ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెబుతుంది ధాన్యం. దాని కోసం నువ్వేం చేస్తావో? నీ బిడ్డను ఎలా ఒప్పిస్తావో? నీ ఇష్టమని చెప్పి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. ఆమె మాటలతో కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. వాడు మారాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఇలా జరిగిందేంటీ? అని ఇందిరను అడుగుతుంది అపర్ణ. వాడు మారడు, అలా అని నా మనవరాలికి బిడ్డను దూరం చేసుకోమ్మని చెప్పలేనన అంటుంది ఇందిర.
నేను ఏం జరగాలని కోరుకున్నానో? అదే జరిగిందని రుద్రాణి సంబరపడిపోతుంది. ధాన్యలక్ష్మీకి చిన్న నిప్పు పెట్టగానే కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేసిందని, ఇప్పుడు రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలని అనుకుంటుంది. కావ్య- రాజ్‌ల గురించి బాధపడుతున్న అప్పూని కళ్యాణ్ ఓదారుస్తాడు. అత్తయ్య ఎంత గొడవ చేసిందో, మా అక్కని ఎన్ని మాటలు అన్నదో నువ్వు కూడా చూశావు కదా అని చెబుతుంది. ఇంట్లో గొడవలకి మా అక్కే కారణం అన్నట్లుగా అత్తయ్య అంటుందని, అసలు అక్క చేసిన తప్పేంటీ? అని ప్రశ్నిస్తుంది అప్పూ. కారణం చెప్పకుండా ఒక భర్త భార్యను అబార్షన్ చేయించుకోమంటే ఏ భార్య అయినా అలాగే రియాక్ట్ అవుతుంది కదా అని చెబుతుంది.
అక్కకి నిజం చెప్పకుండా దాచి అందరినీ బాధపెడుతున్నది బావగారని, తప్పు చేసింది ఆయనైతే శిక్ష మా అక్కకా? అని మండిపడుతుంది అప్పూ. ఇక్కడ తప్పు అన్నయ్యదో, వదినదో కాదని అసలు తప్పంతా నీది అని అంటాడు కళ్యాణ్. అసలు నువ్వు టైంకి ఫుడ్ తీసుకుని, టైంకి రెస్ట్ తీసుకుని ఉంటే ఈ పరిస్ధితి వచ్చేదా? అమ్మ అంత గొడవ చేయడానికి కారణం నువ్వే కదా అని చెబుతాడు కళ్యాణ్. నీ ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో? దాని వల్ల నీ కడుపులోని బిడ్డకు ఏమవుతుందో అన్న టెన్షన్‌తోనే కదా అమ్మ అంత గొడవ చేసిందని అంటాడు. ఒకరకంగా ఈ గొడవకి కారణం నువ్వే కదా? అని చెబుతాడు. వదినకి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నీకే కాదు.. మాకు ఉందని, కానీ ప్రతిక్షణం ఏడుస్తుంటే ప్రాబ్లం సాల్వ్ కాదని అంటాడు కళ్యాణ్.
బావగారు అక్కకి నిజం చెప్పరని క్లియర్‌గా అర్థమైందని, ఇంకా దీనిని ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంట్లో గొడవలు పెద్దవి కావడం తప్పించి ఎలాంటి ఉపయోగం లేదని చెబుతుంది అప్పూ. ఏదైతే అదే అవుతుంది.. అక్కకి నేనే నిజం చెబుతానని అంటుంది. దాంతో అప్పూని కళ్యాణ్ ఆపి, వదినకి నిజం తెలిస్తే తట్టుకోలేదనే కదా అన్నయ్య ఆ నిజం దాచి ఇన్ని అవమానాలు భరిస్తున్నాడని అంటాడు. వదిన నీకు అక్క మాత్రమే, అన్నయ్యకి జీవితాన్ని పంచుకున్న భార్య.. ఆమె పట్ల అన్నయ్యకి ఇంకెంత బాధ్యత ఉంటుందో ఆలోచించావా? అని చెబుతాడు. ఒకరకంగా అన్నయ్య నిర్ణయమే కరెక్ట్ అని, వదినకు తెలియకుండా అబార్షన్ చేయించాలని చూస్తున్నాడని అంటాడు కళ్యాణ్. వదినకి మనమంతా ఉన్నాం.. కానీ నువ్వు ఈ జ్యూస్ తాగకపోతే మాత్రం ఖచ్చితంగా గొడవ జరుగుతుందని వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్. దాంతో జ్యూస్ తాగడానికి ఓకే చెబుతుంది అప్పూ.
ఇంట్లో జరిగిన గొడవ గురించి కావ్య బాధపడుతూ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కావ్య. ఉదయాన్నే పనిమనిషి శాంత గది ఊడుస్తుండగా లెటర్ వచ్చి అపర్ణ కాళ్ల దగ్గర పడటంతో ఆమె చదివి షాకవుతుంది. వెంటనే కొడుకుపై రంకెలు వేస్తుంది. నువ్వు లేచి నిర్వాకం వల్ల కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్లే బాధపడి, తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెబుతుంది అపర్ణ. మనం ఎన్నోసార్లు తన మనసుని గాయపరిచామని, ఎంతగానో అవమానించాం.. కానీ ఏ రోజు తను ఇల్లు వదిలి వెళ్లిపోలేదని చెబుతుంది ఇందిర. ఈ ఇల్లే తన ప్రపంచం అనుకుందని, కానీ ఈరోజు ఈ నిర్ణయం తీసుకుందంటే తనని నువ్వు ఎంత బాధపెట్టావో? అని మండిపడుతుంది.
రాజ్ ఒక్కడి వల్లే కావ్య వెళ్లిపోలేదని, నిన్న ధాన్యలక్ష్మీ చేసిన గొడవకి హర్ట్ అయి వెళ్లిపోయిందని అంటుంది రుద్రాణి. ఇంట్లో గొడవలు జరగొద్దని చెప్పాను కానీ, కావ్యని నేను ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పానా? అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. నేరుగా చెప్పాల్సిన అవసరం లేదని, నిన్న నువ్వు చేసిన గొడవకి అర్ధం అదేనని చెబుతుంది ఇందిర. గొడవలు జరిగితే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బెదిరించావ్.. తన వల్ల ఇంకొరు కష్టపడటం ఇష్టం లేక తనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అంటుంది. రాజ్ - కావ్యల మధ్య జరుగుతున్న గొడవలకి ఏదైనా పరిష్కారం చూపించి ఉంటే ఇలా జరిగేదా? అని నిలదీస్తుంది ధాన్యం. కావ్య మాట రాజ్ వినుంటే ఇలా జరిగేదా? అని ప్రశ్నిస్తుంది.
నేను చెప్పినట్లు కావ్య వినుంటే ఇలా వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదని అంటాడు రాజ్. నువ్వు అడుగుతున్నది ఏమైనా చిన్న విషయమా? ఒక ఆడది తల్లి అవ్వడం అనేది తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం, దానిని నువ్వు దూరం చేసుకోమంటే ఏ ఆడదైనా ఎందుకు వింటుంది అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ముందు కావ్య సంగతి ఆలోచించండి, కావ్య ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటో అని రుద్రాణి అనడంతో అందరూ షాక్ అవుతారు. ఆ మాటలతో సుభాష్ గడ్డిపెడతాడు. రాజ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చెప్పుంటే కావ్య ఇంట్లోనే ఉండేదని రుద్రాణి అనడంతో నా కారణాలు నాకున్నాయని అంటాడు రాజ్.
ఈ ఇంటి కోడల్ని కూడా దూరం చేసుకునేంత గొప్ప కారణమా? అని నిలదీస్తుంది ఇందిర. తనతో కలిసి సంతోషంగా గడపాలని అన్నావ్? ఇప్పుడు తనే లేదు, ఇప్పుడు నీ కారణాలతో నువ్వేం చేసుకుంటావని ప్రశ్నిస్తాడు సుభాష్. నీ కోపంతో, నీ మొండితనంతో నువ్వు సాధిస్తున్నదేంటీ అని మండిపడతాడు ప్రకాశం. కావ్య ఎక్కడికి వెళ్లిందో మనమే వెతుకుదామని అంటుంది ఇందిర. ఎక్కడని వెతుకుదాం.. రైలు పట్టాల మీద, లేక హుస్సేన్ సాగర్ మీద అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నాకు తెలిసి కావ్య తన పుట్టింటికి వెళ్లి ఉంటుందని, కనకానికి ఫోన్ చేయమని అపర్ణకి చెబుతాడు సుభాష్. టిఫిన్ గురించి కృష్ణమూర్తి- కనకంలు గొడవ పడుతుండగా కావ్య సూట్‌కేస్ తీసుకుని రావడంతో దంపతులిద్దరూ సంబరపడిపోతారు.
ఒక్కదానివే వస్తున్నావ్? అల్లుడుగారు ఎక్కడ? అని అడుగుతుంది కనకం. మీ అల్లుడు గారు రాకపోతే నేను రాకూడదా? అని కావ్య ప్రశ్నిస్తుంది. నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా? కనీసం తోడుగా అయినా వచ్చి ఉంటారు కదా? అని అంటుంది కనకం. నాకు ఏ తోడు అక్కర్లేదని, నేను ఒంటరిగా రాగలను, వెళ్లగలను అని చెబుతుంది కావ్య. ఇంట్లో మీరిద్దరూ ఏదైనా మాటమాటా అనుకున్నారా? అని ప్రశ్నిస్తుంది కనకం. పుట్టింటికి రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలా? నేను ఈ ఇంటికి స్వేచ్చగా వచ్చే హక్కు కూడా లేదా అని కావ్య అడుగుతుంది. దాంతో కృష్ణమూర్తి- కనకంలు టెన్షన్ పడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










