Brahmamudi October 11th Episode: దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టను... కావ్య ఫైనల్ డెసిషన్, షాక్‌లో రాజ్
Photo Courtesy: JioHotstar
కావ్య - రాజ్‌ల జీవితాలు ఏమైపోతాయోనని అప్పూ బాధపడుతుండగా కళ్యాణ్ జ్యూస్ తీసుకుని వస్తాడు. నువ్వు జ్యూస్ తాగకపోతే మా అమ్మ మళ్లీ గొడవ చేస్తుంది.. అసలు ఇంట్లో ఇంత పెద్ద రచ్చ జరగడానికి కారణం నువ్వేనని అంటాడు. నువ్వే కనుక టైంకి భోజనం చేసుంటే పరిస్ధితి ఇక్కడి వరకు వచ్చేది కాదని చెబుతాడు. ఏం జరిగినా రాజ్ నిజం చెప్పకపోవడంతో కావ్య లెటర్ రాసి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఉదయాన్నే కావ్య రాసిన లెటర్ చూసిన అపర్ణ తన కొడుకుపై రంకెలు వేస్తుంది. కావ్య ప్రాణాలతోనే ఉందా? లేకపోతే ఏదైనా అఘాయిత్యం చేసుకుందా? అని రుద్రాణి అనడంతో ఇంట్లో వాళ్లు మండిపడతారు. కావ్య సూట్‌కేస్ తీసుకుని నేరుగా పుట్టింటికి రావడంతో కనకం, కృష్ణమూర్తిలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్11వ తేదీ ఎపిసోడ్ 849లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కూతురు సడెన్‌గా ఇంటికి రావడంతో ఏం జరిగిందో కనుక్కోమని అపర్ణకి ఫోన్ చేయమని కనకానికి చెబుతాడు కృష్ణమూర్తి. కనకం ఫోన్ చేస్తుండగా.. ఫోన్ లాక్కుంటుంది కావ్య. నాకు బాగా ఆకలి వేస్తుంది.. నీకు అర్జెంట్‌గా ఏ ఫోన్ రాదు, నువ్వు ఎవరికి చేయొద్దని తల్లికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇంతలో కనకానికి అపర్ణ ఫోన్ చేస్తుండగా కావ్య లిఫ్ట్ చేయదు. ఒకవేళ కావ్య అక్కడికి వెళ్లిఉంటే ఈపాటికే నీకు ఫోన్ చేసేదని చెబుతుంది రుద్రాణి. అలా చేయలేదంటే కావ్య వెళ్లిపోయిన విషయం కనకానికి తెలియదని అంటుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ముందు కావ్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం మంచిదని చెబుతుంది రుద్రాణి.
నీకు సంతోషంగా ఉందా? నువ్వు అనుకున్నది సాధించావు కదా? అని కొడుకుపై మండిపడుతుంది అపర్ణ. నీ మొండితనంతో నీ భార్య మీద నువ్వు పైచేయి సాధించావు, వెళ్లి నా భార్యపై గెలిచానని చాటింపు వేసుకోమ్మని అంటుంది. ఒక ఆడదాని కన్నీటికి లంకా దహనమే జరిగింది, ఇంకో ఆడదాని కన్నీటికి కురుక్షేత్రమే జరిగిందని, ఈరోజు నా మనవరాలి కన్నీటికి నువ్వు కారణం అయ్యావని మండిపడుతుంది ఇందిర. తనకి ఏదైనా జరిగితే ఈ దుగ్గిరాల కుటుంబానికి పతనం మొదలైనట్లేనని అంటుంది. అలా జరిగే రోజు ఎప్పటికీ రాదని, కళావతి ఎక్కడికి వెళ్లిందో నాకు బాగా తెలుసని, ఎలా వెళ్లిందో అలాగే తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెబుతాడు.
కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి అప్పూ కంగారు పడుతుంది. నువ్వు టెన్షన్ పడొద్దు, వదినకు ఏం కాదు.. అన్నయ్య తీసుకురావడానికి వెళ్లాడని భార్యకు ధైర్యం చెబుతాడు కళ్యాణ్. అక్క ఎక్కడుందో తెలియదు? ఏమైందో తెలియదు? అడ్రస్ తెలియని మనిషిని ఎక్కడని వెతుకుతాడు? ఎలా తీసుకొస్తాడు? అని ప్రశ్నిస్తుంది అప్పూ. ఆ రోజు డాక్టర్ గారు విషయం చెప్పిన వెంటనే అక్కకి విషయం చెప్పి ఉంటే పరిస్ధితి ఇక్కడి దాకా వచ్చేది కాదని బాధపడుతుంది. అనవసరంగా బావగారికి చెప్పి మనం తప్పు చేశామని అంటుంది అప్పూ. అప్పుడు వదినతో చెప్పే ధైర్యం లేకనే కదా? విషయం అన్నయ్యకి చెప్పామని అంటాడు కళ్యాణ్.
ఆయనకి చెప్పడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ జరుగుతున్నాయని.. బావగారు అబార్షన్ చేయించుకోవడానికి కారణం చెప్పకపోవడం వల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయని బాధపడుతుంది అప్పూ. ఈ గొడవలకి కారణం తనే అనుకుని అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని బాధపడుతుంది. ఇలాంటిది జరుగుతుందని తెలిసే అక్కకి నిజం చెబుతానని అన్నానని, కానీ నువ్వే నా మాట వినలేదని అప్పూ అంటుంది. బిడ్డను కనేంత వరకు తన అడ్రస్ తెలియనివ్వదని, కానీ బిడ్డను కంటే అక్క చచ్చిపోతుందని బాధపడుతుంది అప్పూ. వదినకి పుట్టినిల్లు, మెట్టినిల్లు తప్పించి ఇంకో ప్రపంచం తెలియదని, ఖచ్చితంగా మీ ఇంటికే వెళ్లి ఉంటుందని అంటాడు కళ్యాణ్.
ఎప్పుడూ లేనిది అమ్మాయి ఇంత కోపంగా ఉందని కృష్ణమూర్తి అడగ్గా... నేను కనుక్కుంటానని చెబుతుంది కనకం. ఏం జరిగిందంటే చెప్పవు? ఎందుకొచ్చావంటే చెప్పవు? కనీసం నువ్వు వచ్చిన విషయం మీ ఇంట్లో అయినా తెలుసా? అని కావ్యని ప్రశ్నిస్తుంది కనకం. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. మా గురించి అంత ఆలోచించేదే అయితే ఇలా చెప్పాపెట్టకుండా మీ ఇంటికి ఎందుకు వస్తుందని అడుగుతాడు రాజ్. నేనేమీ చెప్పాపెట్టకుండా రాలేదు.... లెటర్ రాసే వచ్చానని అంటుంది కావ్య. నువ్విలా వచ్చేస్తే ఇంట్లో అంతా ఎలా కంగారు పడతారో ఆలోచించావా? అని రాజ్ మండిపడతాడు. సడెన్‌గా కనిపించకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని రాజ్ అడుగుతాడు. మీ వల్ల నేను రోజు టెన్షన్ పడుతున్నానని.... ఆ విషయం మీరు అర్ధం చేసుకోవడం లేదని అంటుంది కావ్య.
ఆ విషయంలో నా నిర్ణయం మార్చుకోనని అంటాడు రాజ్. చేయలేనివి, చేయకూడని పనులు చెబితే ఏ భార్యా ఒప్పుకోదని మండిపడుతుంది కావ్య. అల్లుడు గారు ఏ పని చేసినా బాగా ఆలోచించే చేస్తారని, ఆయన చెప్పినట్లు చేస్తే నీకొచ్చే నష్టం ఏంటీ? అని కనకం ప్రశ్నిస్తుంది. అనవసరంగా గొడవ పెద్దది చేయొద్దని, ఇప్పటికి చేసింది చాలని ఇంటికి వెళ్దామని అడుగుతాడు రాజ్. నేను మీతో పాటు ఇంటికి రావాలంటే... మీ నిర్ణయమైనా మార్చుకోండి, లేదంటే నాకు కారణమైనా చెప్పమని అంటుంది కావ్య. అల్లుడుగారితో అలాగేనా మాట్లాడేది? అని కనకం అడగ్గా... నువ్వు మా విషయం కలగజేసుకోవద్దని తల్లికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఏం జరిగిందో చెప్పమని రాజ్‌ని కనకం అడగ్గా.... మీ కూతురినే అడగమని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. కావ్య - రాజ్ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని కనకం, కృష్ణమూర్తి అనుకుంటారు.
అక్క ఫోటో చూసుకుంటూ అప్పూ బాధపడుతుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి వదిన మీ ఇంట్లోనే ఉందని చెబుతాడు. ఇంతలో అప్పూకి కనకం ఫోన్ చేయగా... ఆమె ఫోన్ సైలెంట్‌లో పెట్టి నిద్రపోతుంది. దాంతో కనకం, కృష్ణమూర్తిలు ఇంకా టెన్షన్ పడతారు. రాజ్, కావ్యల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఎదురుచూస్తుంటుంది.. ఇంతలో రాజ్ ఒక్కడే రావడంతో కావ్య ఎక్కడ అని అపర్ణ ప్రశ్నిస్తుంది. తను వాళ్ల పుట్టింటిలోనే ఉందని, అడిగినా రాను అని చెప్పిందని అంటాడు రాజ్. అది రాను అంటే ఒప్పించాలని, నీ చేత తాళి కట్టించుకుని, ఏడడుగులు నడించిందని, అలాంటి తనని అలా ఎలా వదిలేసి వస్తావని అడుగుతుంది అపర్ణ.
ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలియగానే భర్తగా వెతకడానికి వెళ్లాను, తిరిగి ఇంటికి రమ్మని బతిమలాడాను అని అంటాడు. కానీ బిడ్డను వద్దు అనడానికి కారణం చెబితేనే వస్తానని మొండికేసిందని, అలాంటి తనని ఎలా తీసుకురమ్మంటావని రాజ్ ప్రశ్నిస్తాడు. భార్యాభర్తలంటే ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదని ఆ ఈశ్వరుడే అర్ధనారీశ్వరుడిగా మారాడు.... అలాంటిది పెళ్లాం కాళ్లు పట్టుకోవడంలో తప్పేముందని అడుగుతుంది ఇందిర. అబార్షన్ చేయించుకోమని గొడవలు పెట్టుకోవడం వల్లే కావ్య ఇల్లు వదిలి వెళ్లిపోయిందని మండిపడుతుంది అపర్ణ. అసలు కావ్యది తప్పే లేదా అని రుద్రాణి అడుగుతుంది. కావ్య కోసం ఊరంతా వెతికి తన ఆచూకి తెలుసుకున్నాడని, బాధ్యత లేకుండా ప్రవర్తించింది ఆ కావ్యేనని అంటుంది.
కడుపుతో ఉన్నానన్న ఇంగితం కూడా లేకుండా కావ్యే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మండిపడుతుంది అపర్ణ. దాంతో ఇందిర వార్నింగ్ ఇస్తుంది. ఈ ప్రపంచంలో కలహాలు లేని కాపురాలు ఉండవని.... అంతేకానీ పంతానికి పోయి కాపురాలు కూల్చుకోవద్దని చెబుతుంది ఇందిర. నువ్వేం చేస్తావో? దానిని ఎలా ఒప్పిస్తావో? నాకు తెలియదు... నా కోడలు నా ఇంట్లో ఉండాలని అపర్ణ డెడ్‌లైన్ పెడుతుంది. భర్తగా నా ప్రయత్నాలు నేను చేశాను.... భార్యకి తనకి రావాలనిపిస్తే వస్తుంది, లేదంటే లేదని తేల్చేస్తాడు రాజ్. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. పంతానికి పోతే వీడికంటే మొండిదని భయపడుతుంది అపర్ణ. విడాకుల లాగానే ఇది కూడా డ్రామా అయ్యుంటుందని మనమే వెళ్లి మాట్లాడదామని అంటుంది ఇందిర. ఇంతలో స్వప్నకి కనకం ఫోన్ చేయగా రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










