Brahmamudi October 20th Episode: కూతురి కోసం కనకం స్కెచ్... కావ్య బిడ్డను చంపేలా రుద్రాణి దారుణమైన ప్లాన్
Photo Courtesy: JioHotstar
అన్ని సుఖాలను వదులుకుని తన కోసం నిరాహారదీక్ష చేస్తున్న భర్తను చూసి కావ్య బాధపడుతుంది. కూతురిని చూసిన కనకం.. నువ్వు బాధపడి కరిగిపోతే అల్లుడుగారిలో మార్పు రాదని కాస్త కఠినంగానే ఉండాలని చెబుతుంది. తల్లి మాటలతో కావ్య సరేనని అంటుంది. భర్త ముందు కాఫీ తాగుతూ, యాపిల్ తింటూ రెచ్చగొడుతుంది. ఇంతలో అక్కడికి ఓ తాగుబోతు వచ్చి... నీ దీక్ష గురించి ప్రపంచానికి చెబుతానని చెప్పి మీడియాని పిలిపిస్తాడు. మీడియాను చూసిన రాజ్ కంగారు పడుతుంటాడు.
తాగుబోతు కారణంగా లేనిపోని ఇబ్బందులు వచ్చేలా ఉండటంతో కావ్య రంగంలోకి దిగుతుంది. మా ఇంటిలోనూ, మా భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని నన్ను ఆటపట్టించడానికి మా వారు ఇలా చేస్తున్నాడని చెబుతుంది కావ్య. ఇంత జరిగినా రాజ్‌లో మార్పు రాకపోగా.. తిరిగి నిరాహారదీక్షలో కూర్చొంటాడు. దాంతో కావ్య భర్తను ఊరించడానికి నాటుకోడి కూరతో భోజనం చేస్తుంది. గతంలో సంక్రాంతి పండక్కి అత్తగారు వండిన వంటలు గుర్తొచ్చి రాజ్‌కి నోరూరుతుంది. రాజ్ గురించి అపర్ణ బెంగపడుతుంది.. ఇప్పుడే నీ కొడుకు దారిలోకి వస్తున్నాడని కోడలికి నచ్చచెబుతుంది ఇందిర. రాజ్ ఆకలితో అల్లాడిపోవడం చూసిన కావ్య.. వెంటనే భోజనాన్ని కృష్ణమూర్తికి ఇచ్చి పంపిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 20వ తేదీ ఎపిసోడ్ 856లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌కి భోజనం ఇవ్వమని తండ్రికి చెబుతుంది కావ్య. నన్ను తీసుకెళ్లడానికి నిరాహారదీక్ష చేసేంత ప్రేమ ఉన్నప్పుడు నా బిడ్డను వద్దు అనడానికి కారణం ఎందుకు చెప్పలేకపోతున్నారో అడగమని తండ్రికి చెబుతుంది. ఇంతలో అనవసరంగా దాని ముందు బిల్డప్ ఇచ్చానని, ఆకలి దంచేస్తోందని బాధపడతాడు రాజ్. ఆ వెంటనే కృష్ణమూర్తి వచ్చి.. మీరు ఆకలికి తట్టుకోలేరని, ఎవ్వరూ చూడకుండా మీకోసం భోజనం తీసుకొచ్చానని చెబుతాడు. దాంతో రాజ్ అన్నం తినేస్తాడు. నా కూతురి కోసం ఇంతలా కష్టపడుతున్నారు, అంతలా ప్రేమిస్తున్న మీరు.. ఆ నిజం ఏంటో? ఎందుకు చెప్పలేకపోతున్నారా? అని చూస్తున్నానని అంటాడు కృష్ణమూర్తి. చెప్పలేనిది కాబట్టే చెప్పలేకపోతున్నానని చెబుతాడు రాజ్.
రాజ్ భోజనం చేయడం చూసిన కావ్య బాధపడతుండగా కనకం వచ్చి మాట్లాడుతుంది. కోటలో రాజులా ఉండాల్సిన ఆయన.. ఇలా రాత్రి పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అంటుంది కావ్య. భర్తను మార్చుకోవాలంటే గట్టిగా నిలబడాలని .. ఒక్కరాత్రికే ఐస్‌లా కరిగిపోయి కన్నీరు పెట్టుకుంటే అల్లుడుగారిని మార్చుకోలేమని వార్నింగ్ ఇస్తుంది కనకం. ఆయన మారకపోయినా పర్లేదని, బిడ్డ పుట్టే వరకు నన్ను ఇలాగే వదిలేసి ఇంటికి వెళ్లిపోయినా చాలని అంటుంది కావ్య. నా కళ్లముందే ఉంటూ బయట కష్టపడుతుంటే నేను చూడలేనని బాధపడుతుంది కావ్య. ఇప్పుడు అల్లుడుగారిని ఇంట్లోకి తీసుకురావాలి? అంతే కదా? అని అడుగుతుంది కనకం. ఆ విషయం నేను చూసుకుంటానని కూతురికి హామీ ఇస్తుంది కనకం.
నిద్రపోకుండా బాధపడుతున్న అపర్ణ దగ్గరికి ఇందిర, అప్పూలు వచ్చి అడుగుతారు. కొడుకు నిరాహారదీక్షలు చేస్తుంటే నాకు నిద్ర ఎలా పడుతుందని అపర్ణ బాధపడుతుంది. అంత టెన్షన్ పడే బదులు అన్నయ్యకి కాల్ చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు కళ్యాణ్. వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదని అంటుంది అపర్ణ. దాంతో మా అమ్మకి కాల్ చేయమని అప్పూ చెబుతుంది. ఇంతలో కనకం నుంచి అపర్ణకి కాల్ వస్తుంది. అల్లుడుగారు నిరాహారదీక్షను గట్టిగా చేస్తున్నారని.. కానీ నా కూతురు మాత్రం ఐస్ ముక్కలా కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటోందని చెబుతుంది కనకం. కావ్య అల్లుడుగారిని మార్చుకునే లోపే... ఇదే ఎక్కడ ఆయన మాట విని అబార్షన్ చేయించుకుంటుందో అనిపిస్తుందని అంటుంది.
ఏదో ఒకటి చేసి వాడి మనసు మార్చు.. దాని కడుపులోని బిడ్డను కాపాడమని అడుగుతుంది అపర్ణ. దీపావళి పండుగ కాబట్టి మీరు, అమ్మ ఇక్కడికి వచ్చేయమని చెబుతుంది కనకం. అయితే మేం కూడా వస్తామని అప్పూ, కళ్యాణ్ చెప్పడంతో ఇందిర సరేనని అంటుంది. వీరి మాటల్ని విన్న రుద్రాణి మనం కూడా మీ అత్తారింటికి దీపావళికి వెళ్దామని రాహుల్‌తో చెబుతుంది. పిలవని పేరంటానికి వెళ్దామని అంటావేంటీ? అని అడుగుతాడు రాహుల్. కావ్యకి అబార్షన్ చేయించడానికి రాజ్ రెండుసార్లు చీటింగ్ చేశాడు, ముచ్చటగా మూడోసారి కూడా చీట్ చేశాడంటే ఇక కావ్య జీవితంలో రాజ్‌ని క్షమించదని, అప్పుడు ఈ ఆస్తికి ఇంకెవ్వరూ అడ్డు ఉండరని చెబుతుంది రుద్రాణి.
కావ్యకి అబార్షన్ అయ్యేలా మనమే ప్లాన్ చేసి ఆ నిందని రాజ్ మీద పడేలా చేసి దానిని నిజం చేయాలని ప్లాన్ చేస్తుంది రుద్రాణి. ఆల్రెడీ రెండుసార్లు తనకి అబార్షన్ అయ్యేలా చేశాడు కాబట్టి.. ఇది కూడా తనే చేశాడని కావ్య బలంగా నమ్ముతుందని, శాశ్వతంగా వాళ్లిద్దరి మధ్య తెగతెంపులు జరుగుతాయని చెబుతుంది రుద్రాణి. ఇంతకీ ప్లాన్ ఏంటీ అని రాహుల్ అడగ్గా... మొత్తం చెబుతుంది రుద్రాణి. బయట చలికి తట్టుకోలేకపోతున్న రాజ్‌కి కావ్య వచ్చి దుప్పటి కప్పుతుంది. ఏసీ గదిలో మహారాజులా పడుకోవాల్సిన మీకు.. ఇలాంటి కర్మ ఎందుకు? అని బాధపడుతుంది కావ్య. మన బిడ్డ విషయంలో ఎందుకిలా మొండిగా ఉంటున్నారు? ప్రతి విషయం నాతో వచ్చి చెప్పుకునేవాళ్లు కదా? ఈ విషయాన్ని మాత్రం మీ గుండెలోనే ఎందుకు దాచుకున్నారు? దానిని తెలుసుకునే అర్హత కూడా లేదా? అని బాధపడుతుంది. మన బిడ్డ పుట్టడం ఖాయం, మన ముగ్గురం కలిసి సంతోషంగా జీవిస్తామనడం కూడా ఖాయమని అంటుంది.
ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కనకం ఇంటికి వస్తుంది. వారితో పాటు రోహిణి కొడుకు స్వరాజ్ కూడా వచ్చి మీరు చేసే పనిలో నేను కూడా హెల్ప్ చేస్తానని అంటాడు. నేరుగా వెళ్లి రాజ్ దుప్పట్లో దూరతాడు. దాంతో భయపడ్డ రాజ్.. నువ్వేంటీ? ఇక్కడ అని అడుగుతాడు. నేనే కాదు.. టోటల్ ఫ్యామిలీ మొత్తం వచ్చేశామని చెబుతాడు. కుటుంబం మొత్తాన్ని చూసిన రాజ్... అందరూ తిరునాళ్లకు వచ్చినట్లు కట్టకట్టుకుని వచ్చేశారని అడుగుతాడు. ఈరోజు దీపావళి పండుగ జరుపుకోవడానికి వచ్చామని అపర్ణ చెబుతుంది. ఆ పండుగ ఏదో మనింట్లోనే జరుపుకోవచ్చు కదా అని అంటాడు రాజ్. లక్ష్మీదేవి లాంటి నా కోడలు ఇక్కడ ఉంటే నేనెందుకు అక్కడ జరుపుకుంటానని చెబుతుంది అపర్ణ.
ఇంతలో కావ్య అందంగా రెడీ అయి బయటికి వస్తుంది. భర్తను ఇలా కష్టపెట్టి సాధించాలనుకునే భార్యని లక్ష్మీ దేవి అనరని, బ్రహ్మరాక్షసి అంటారని మండిపడతాడు రాజ్. అలాగైతే భార్యలకి నిజాలు చెప్పకుండా అబార్షన్ చేయించాలనుకునే వారిని ఏమంటారు అంటూ మండిపడుతుంది కావ్య. రాత్రంతా దీని వల్ల నాకు నిద్రలేదని చెబుతాడు రాజ్. అంత కష్టపడలేనప్పుడు నిజం చెప్పొచ్చు కదా అంటుంది కావ్య. రాజ్‌కి అసలు రోడ్డు మీద పడుకోవాల్సిన ఖర్మ ఏంటీ? అని అడుగుతుంది రుద్రాణి. అర్జెంట్‌గా ఇంటికి వెళ్లిపోదామని చెబుతుంది రుద్రాణి. నా మనవడు కార్యసాధనలో ఉన్నాడు.. కావ్యను తీసుకునే వెళ్తాడని అంటుంది ఇందిర. కావ్యని తీసుకెళ్లడం అంత ఈజీ కాదని చెబుతుంది కళావతి. ఇంట్లోకి వచ్చి స్నానం చేయమనండి చూద్దామని అంటుంది కావ్య. పండుగలో పార్టిసిపేట్ చేస్తాను.. సాయంత్రానికి మీ మనవరాలిని ఇంటికి కూడా తీసుకొస్తానని అంటాడు రాజ్. సాయంత్రానికల్లా అది మన దారిలోకి వస్తుందా? అని ఇందిరని అడుగుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










