Brahmamudi October 6th Episode: రుద్రాణి ట్రాప్‌లో ధాన్యలక్ష్మీ.. విడాకులపై రాజ్‌కి క్లాస్‌ పీకిన సీతారామయ్య

Photo Courtesy: JioHotstar

సుభాష్ వాళ్ల ఫ్రెండ్ రాజ్ ప్రవర్తన గురించి చెప్పడంతో కొడుకుపై అతనికి కోపం కట్టలు తెంచుకుంటుంది. మీ ఇద్దరు గొడవలు పడి దుగ్గిరాల వారి ఇంటి పరువును నడిబజారులో పడేస్తున్నారని రాజ్‌పై సీరియస్ అవుతాడు సుభాష్. ఈ కుటుంబాన్ని ఎక్కడో నిలబెట్టిన వాడే, పరువు తీస్తున్నాడని రగిలిపోతాడు. భర్తగా నాకున్న హక్కుతో అడుగుతున్నాను.. నువ్వు బిడ్డను తీసేస్తావా? లేదా? అని కావ్యని ఫైనల్‌ ఛాన్స్ ఇస్తాడు రాజ్. అక్కడి వరకు వస్తే నాకు బిడ్డే కావాలని, మీకు విడాకులైనా ఇచ్చి దూరంగా వెళ్లిపోతానని కావ్య తేల్చిచెబుతుంది. ఆ మాటలతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.

మనం ఏం చేయకుండానే కావ్య, రాజ్‌లు విడిపోతున్నారని ఈ గొడవని ఇలాగే పెంచి ఈ ఇంటిని ముక్కలు చేసి ఆస్తిని దక్కించుకోవాలని రుద్రాణి, రాహుల్ ప్లాన్ చేస్తారు. ఇంట్లో జరుగుతున్న గొడవలు, కావ్య- రాజ్ విడాకుల వరకు వెళ్లడం గురించి ఆలోచిస్తున్న సుభాష్‌కి గుండెపోటు వస్తుంది. సమయానికి అపర్ణ దగ్గరే ఉండటంతో అతనిని కాపాడుకుంటుంది. అక్కకి నిజం చెప్పకపోవడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదని, అక్కా- బావ విడిపోయే పరిస్థితికి మనమే కారణం అయ్యామని కళ్యాణ్‌ దగ్గర అప్పూ బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్ 844లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 6th 2025 Episode 844 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి కావ్యతో మాట్లాడటానికి వస్తుంది అప్పూ. తాను విడాకుల పేరుతో నాటకం ఆడుతున్నట్లు చెబితే అప్పూ ద్వారా కవిగారికి, అక్కడి నుంచి రాజ్ గారికి తెలుస్తుందని భయపడి చెప్పకుండా మనసులోనే దాచుకుంటుంది కావ్య. ఇన్ని రోజులు బావగారి ప్రేమ కోసం ఆరాటపడ్డావ్.. బావగారిని నీ సొంతం చేసుకోవడం కోసం కష్టపడ్డావ్, ఇంతకాలం బావే ప్రాణంగా బతికిన నువ్వు ఇప్పుడు ఏకంగా ఆయనతో బంధమే వద్దు అంటున్నావ్ అని నిలదీస్తుంది అప్పూ. మనం వెళ్లే దారిలో ముళ్లు ఉంటే వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలి కానీ దారి మార్చుకోకూడదని నువ్వే చెబుతావ్ కదా అని గుర్తుచేస్తుంది. ఎందుకని ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నావ్.. ఇది కరెక్ట్ కాదని అంటుంది అప్పూ.

మరి ఆయన చేస్తున్నది కరెక్టేనా? ఇన్నిరోజులు బిడ్డా బిడ్డా అని మురిసిపోయి.. ఈరోజు ఆ బిడ్డే వద్దు అంటున్నారని బాధపడుతుంది కావ్య. దానికి కారణం ఏంటో చెప్పకుండా ఆ బిడ్డను తీయించేసుకోమని చెబుతున్నారని, నేను ఒప్పుకోకపోయేసరికి నాకు అబద్ధం చెప్పి హాస్పిటల్‌లో అబార్షన్ చేయించాలని అనుకున్నారని, నా బిడ్డను చంపేయాలని చూశారని దీనికి నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావని నిలదీస్తుంది కావ్య. అమ్మగా ఆయుష్సు పోయమంటే పోయగలను కానీ.. వాడికి ఆయుష్సు లేకుండా ఎలా చేయగలనని అంటుంది.

నువ్వు కూడా కడుపుతో ఉన్నావ్.. నువ్వు కూడా తల్లివి అవుతావ్ కదా? నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావ్? నిన్నటి వరకు నీ కడుపులో బిడ్డని ప్రాణంగా చూసుకున్న కవిగారు సడెన్‌గా వచ్చేసి కారణం చెప్పకుండా ఆ ప్రాణాన్ని చిదిమేయ్ అంటే నువ్వేం చేస్తావని నిలదీస్తుంది కావ్య. దీనికే నువ్వు ఏడుస్తుంటే.. నన్ను మీ బావగారు బిడ్డను చంపుకో, చంపుకో అంటుంటే నాకేలా ఉంటుందో ఊహించమని అంటుంది కావ్య. మన ఇద్దరి ప్రేమకు ఈ బిడ్డ అడ్డు అంటున్నారని.. అందుకే పేగు బంధాన్ని వదులుకోలేక తాళి బంధాన్ని వద్దు అనుకుంటున్నానని చెబుతుంది కావ్య. ఆయన ఆ బిడ్డను ఎందుకు వద్దు అంటున్నారో కారణం చెప్పకపోతే.. నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేనని తేల్చేస్తుంది కావ్య. నీ ప్రాణం కోసం బావ ఆరాటపడుతుంటే ఆయనతో బంధాన్ని తెంపుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావని బాధపడుతుంది అప్పూ. అక్కాచెల్లెళ్లు మాట్లాడుకోవడాన్ని చూసిన రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తోంది.

తాతయ్య దగ్గరికి వచ్చిన రాజ్‌ని నువ్వు ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావని మండిపడతాడు సీతారామయ్య. నీ కారణంగా ఇంట్లో అందరూ బాధపడుతున్నారని, ఇంతమందిని బాధపెట్టి నువ్వేం సాధించాలని అనుకుంటున్నావని నిలదీస్తాడు పెద్దాయన. నువ్వేందుకు బిడ్డను వద్దు అంటున్నావో కారణం తెలియదు, కానీ దాని కారణంగా మన దుగ్గిరాల ఇంటి పరువు రోడ్డున పడుతోందని బాధపడతాడు సీతారామయ్య. నలుగురికి మంచి చెప్పిన మనం.. నీ వల్ల నలుగురితో చెప్పించుకోవాల్సి వస్తోందని అంటాడు. కావ్య గురించి ఆలోచించు.. నీకోసం ఎంతో చేసిందని, ఎన్నో గడ్డు పరిస్ధితుల్ని ఎదుర్కొంది, ఎన్నో అవమానాలు సహించిందని గుర్తుచేస్తాడు సీతారామయ్య.

ఏ రోజూ నీ గురించి మాట తూలని కావ్య చేత.. ఎందుకు విడాకులు ఇచ్చేస్తాను అనే వరకు తెచ్చుకుంటున్నావని ప్రశ్నిస్తాడు తాతయ్య. అసలు కారణం ఏంటో చెప్పకుండా బిడ్డను తీయించేయమంటే ఏ తల్లయినా ఒప్పుకోదని చెబుతాడు. నీ కారణం నీ దగ్గరే పెట్టుకో.. కానీ కావ్యకి విడాకులిస్తే మాత్రం జీవితంలో చాలా కోల్పోతావని, మనల్ని ఇష్టపడేవాళ్లు మనపక్కన ఉన్నంత వరకు మనకు వాళ్ల విలువ తెలియదని హెచ్చరిస్తాడు సీతారామయ్య. అక్క మాటలతో ఏడుస్తున్న అప్పూ దగ్గరికి ధాన్యలక్ష్మీ వస్తుంది. అందరూ డిన్నర్ చేస్తుంటే నువ్వు మాత్రం రూమ్‌లో ఒంటరిగా ఏం చేస్తున్నావని అడుగుతుంది. నాకు ఆకలిగా లేదని తర్వాత తింటానని అంటుంది అప్పూ.

మీ అక్క గురించి ఆలోచిస్తూ తినాలని అనుకోవడం లేదా? మీ అక్క గురించి ఆలోచించు, కానీ నీ కడుపులోని బిడ్డని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది ధాన్యం. ఇలాంటి టైంలో ఫుడ్ తీసుకోకపోతే బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, నీకు ఆకలి లేకపోయినా బిడ్డ కోసమైనా తినమని చెప్పి వెళ్లిపోతుంది. భోజనాల దగ్గర అప్పూ గురించి అడుగుతుంది అపర్ణ. ఆకలిగా లేదని తర్వాత తింటానని చెప్పిందని అంటుంది ధాన్యం. ఆకలిగా లేదంటే నువ్వు ఊపుకుంటూ వచ్చేస్తావా? బుజ్జగించో, భయపెట్టో తీసుకురావాలని చీవాట్లు పెడుతుంది ఇందిర. మనసుకు బాధగా ఉన్న వాళ్లకి అన్నం సహించదని అంటుంది రుద్రాణి. వికారం పుట్టి అన్నం తినను అని చెప్పలేదు, మనసు బరువెక్కి తినను అని చెప్పిందని అంటుంది రుద్రాణి.

అప్పుకు ఏమైంది, ఇప్పుడు తన మనసును ఎవరు బాధపెట్టారని ఇందిర ప్రశ్నిస్తుంది. అప్పూని బాధపెట్టింది ఎవరో కాదు కావ్యేనని రుద్రాణి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అక్క విడాకులు ఇస్తానని గొడవ చేసేసరికి చెల్లిగా తట్టుకోలేకపోయిందని, కావ్య మనసు మారేలా చేద్దామని ఆశపడి అప్పూ వెళ్లిందని, కానీ ఈ అక్క అప్పూని తిట్టి పంపించేసిందని చెబుతుంది రుద్రాణి. కావ్య అలాంటి మనిషి కాదని అపర్ణ అనగా.. దాంతో కావ్యని అడగ్గా నిజమేనని ఆమె ఒప్పుకుంటుంది. మీరిద్దరూ గొడవలు పడుతూ నా కోడల్ని బాధపెట్టాలని చూస్తున్నావా? రెండ్రోజుల నుంచి అప్పూ కనీసం జ్యూస్ కూడా తాగడం లేదని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. నీకంటే రాజ్ బిడ్డ వద్దు అంటున్నాడని, అలాగని నా కోడలికి కూడా ఏదైనా ప్రాబ్లమ్ రావాలని చూస్తున్నావా? అని ధాన్యం ఫైర్ అవుతుంది. ఆ మాటలతో కావ్య బాధపడి భోజనం చేయకుండా వెళ్లిపోతూ అప్పూకి భోజనం తీసుకెళ్లమని చెబుతుంది.

కావ్య చెప్పినట్లుగానే అప్పూకి భోజనం తీసుకెళ్తాడు కళ్యాణ్. నీ కోసం కాకపోయినా, మన బిడ్డ కోసమైనా తినమని చెబుతాడు. ఇంట్లో అందరూ అక్క విడాకుల గురించే ఆలోచిస్తున్నారు కానీ తన అసలు ప్రాబ్లమ్ గురించి ఎవ్వరికీ తెలియదని అంటుంది అప్పూ. రోజులు గడిచేకొద్ది అక్క ప్రాబ్లమ్ ఎక్కడ క్రిటికల్‌గా మారుతుందోనని చాలా భయంగా ఉందని చెబుతుంది. అక్క విడాకుల దాకా వెళ్లిపోయిందని, ఆమె నా మాట వినడం లేదని బాధపడుతుంది అప్పూ. ఇందిర, అపర్ణలు బాధపడుతుండగా కావ్య వచ్చి ఎందుకలా బాధపడుతున్నారని అడుగుతుంది. నీ విడాకుల నాటకంతో ఈ ఇంట్లో ఏం జరుగుతుందోనని భయమేస్తుందని అంటుంది అపర్ణ. ఇంతలో రాజ్ వచ్చి భోజనం పెట్టమని అడగ్గా అపర్ణ, ఇందిరలు పెట్టరు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X