Brahmamudi September 22nd Episode: రాజ్‌కి మూసుకుపోయిన దారులు.. కొడుకు మాటలతో సుభాష్ కంటతడి
Photo Courtesy: JioHotstar
కావ్యని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవడానికి అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి కళ్యాణ్‌ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రాజ్. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని.. కావ్యకి వెంటనే అబార్షన్ చేయకపోతే కష్టమని డాక్టర్ చెప్పడంతో రాజ్ రగిలిపోతాడు. మీరేమైనా దేవుడా? కనీసం ట్రై చేస్తానని కూడా చెప్పకుండా నా భార్య చనిపోతుందని అంటారా అంటూ గొడవ చేస్తూ టేబుల్ మీదున్న సామాన్లను విసిరికొడతాడు. నా భార్యను నేనే కాపాడుకుంటానని చెప్పి బయటికి వచ్చేస్తాడు. డాక్టర్‌కి కళ్యాణ్ సారీ చెప్పి అన్నయ్యని కారు దగ్గరికి తీసుకొచ్చేస్తాడు.
నీ ఫ్రెండ్స్ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కదా? వాళ్లకి ఫోన్ చేసి విషయం చెప్పు.. కావాలంటే మన ఆస్తి మొత్తం ఇచ్చేద్దామని, అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తానని చెబుతాడు రాజ్. నీ కన్నా ముందే నేను అన్ని ప్రయత్నాలు చేశానని మన చేతుల్లో ఏం లేదని కళ్యాణ్ బాధపడతాడు. దాంతో రాజ్ తనకి తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేసి పరిస్థితి వివరించగా.. అతను రిపోర్ట్స్ చూసి కావ్యని, బిడ్డని కాపాడటం చాలా కష్టమని అంటాడు. ఉదయాన్నే స్వప్న దగ్గరికి వెళ్లిన రాహుల్.. నేను మూటలు మూసి డబ్బులు సంపాదించానని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. ఆఫీస్ నుంచి మేనేజర్ ఎంత ఫోన్ చేసినా రాజ్ లిఫ్ట్ చేయకపోవడంతో సుభాష్ నిలదీస్తాడు. కోట్లలో నష్టం వచ్చినా, కంపెనీని మూసినా పర్లేదని, నేను ఆఫీస్‌కి వెళ్లనని తండ్రి మీద సీరియస్ అవుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ 832లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఆఫీస్‌కి తాను వెళ్లనని తేల్చిచెబుతాడు రాజ్. నేను గతం మరిచిపోయినప్పుడు మేనేజ్ చేశారు కదా? ఇప్పుడు నాకు వెళ్లే ఉద్దేశం లేదు, నేను వెళ్లనని తేల్చిచెబుతాడు రాజ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? వందల కోట్ల ప్రాజెక్ట్ అని సుభాష్ అంటాడు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు.. మీకు డబ్బు పిచ్చి పట్టిందని రాజ్ రగిలిపోతాడు. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇప్పటికే వేల కోట్లు సంపాదించారు కదా? ఇంకా సరిపోలేదా? అని నిలదీస్తాడు రాజ్. ఇంక ఎన్నాళ్లు డబ్బు కోసం బతుకుతారు? ఈ భూమ్మీద పుట్టినందుకు కొద్దిరోజులైనా మన అనుకున్న వాళ్లకోసం బతకాలని క్లాస్ పీకుతాడు రాజ్. డబ్బులు లేకపోతే బతకలేమా? అన్నానికి బదులు డబ్బులు తింటామా? డబ్బు సంపాదించకపోతే చచ్చిపోతామా? అని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు.
నాన్న మీద ఈగ కూడా వాలనివ్వని రాజ్.. ఇన్నేసి మాటలు అనేసి వెళ్తున్నాడని రుద్రాణికి అనుమానం వస్తుంది. ఈ అవకాశాన్ని కూడా వాడుకుందామని అనుకుంటుంది రుద్రాణి. రాజ్ ఎందుకు హార్ష్‌గా మాట్లాడి వెళ్లాడు, ఆఫీస్‌కి వెళ్లమన్నందుకే ఇంతగా రియాక్ట్ కావాలా? అని నిలదీస్తుంది రుద్రాణి. పెళ్లాం కడుపుతో ఉంది, కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి, నేను వెళ్లను అంటే సరిపోయేది కదా.. అన్నయ్యని ఇంతలా బాధపెట్టాలా? అంటుంది రుద్రాణి. నువ్వేం బాధపడొద్దని, పెళ్లాం వస్తే అంతేనని చెబుతుంది. ఛాన్స్ దొరికితే చాలు, పుల్లలు పెట్టడానికి దూరిపోతావని రుద్రాణి మీద ఇందిర కోప్పడుతుంది.
రాజ్ కోపంలో ఉండి ఏదో మాట్లాడి ఉంటాడని నువ్వేం బాధపడొద్దని చెబుతుంది ఇందిర. అయినప్పటికీ సుభాష్ బాధగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కావ్య మనసు నొచ్చుకుంటుంది. ఆయనకి ఏమైంది? ఎందుకలా మాట్లాడారు? అని కళ్యాణ్‌ని అడుగుతుంది కళావతి. నాకేం తెలియదని ఇద్దరం కలిసి పని మీద వెళ్లొచ్చామని.. దారిలో వస్తుంటే ఓ ఫోన్ వచ్చిందని, ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి అన్నయ్య ఇలా అయిపోయాడని చెబుతాడు కళ్యాణ్. వాడి కోపానికి కారణమేంటో తెలుసుకోమ్మని కావ్యకి చెబుతుంది ఇందిర.
కావ్య పరిస్ధితి గురించి డాక్టర్‌తో మాట్లాడతాడు రాజ్. రిపోర్ట్స్ చూసిన తర్వాత కావ్య తన బిడ్డను మోయడానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉందని అదే ఇంక్యూబెటర్ అని చెబుతుంది డాక్టర్. మీకు బిడ్డ కావాలంటే అదొక్కటే దారి అని, అది కూడా చాలా రిస్క్‌తో కూడుకున్నదని చెబుతుంది. ఇద్దరూ సేఫ్‌గా ఉంటారంటే ఎంత రిస్క్ అయినా, ఎంత ఖర్చు అయినా పర్లేదని చెబుతాడు డాక్టర్. కానీ అలా చేసినప్పటికీ బేబీ ప్రాణాలతో ఉంటుందని చెప్పలేమని అంటుంది. బిడ్డను ఏడో నెల వరకు తల్లి కడుపులోనే పెంచాలని, ఆ తర్వాత సీజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసి ఇంక్యూబెటర్‌లో పెంచాలని చెబుతుంది డాక్టర్. ఫిఫ్టి ఫిఫ్టీ ఛాన్సులు మాత్రమే ఉన్నాయని, ఒక్కోసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పడంతో రాజ్ సీరియస్‌గా ఫోన్ పెట్టేస్తాడు.
ఇంతలో పక్కనే కావ్య ఉండటంతో రాజ్ టెన్షన్ పడతాడు. నాకు అంతా తెలిసిపోయింది, కవిగారు మొత్తం చెప్పేశారని అంటుంది కావ్య. మీరు ఏదో ఒక సమస్యతో నలిగిపోతున్నారని, అది వెంటాడి వేధిస్తోందని, ఫోన్ వచ్చిన ప్రతిసారి కోపంతో ఊగిపోతున్నారని చెప్పాడని అంటుంది కావ్య. భార్యకు నిజం తెలియకపోవడంతో రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. మీ సమస్య ఏంటో నాకు చెబితే నేను తీర్చలేనా? అని అడుగుతుంది కావ్య. ఏ భార్య అయినా ప్రతి సమస్యలో మీకు తోడుగా ఉండి.. మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుంటూ గెలిపించాలని అనుకుంటుందని చెబుతుంది కళావతి. బాధల్ని పంచుకోలేనంత పరాయి వాళ్లం అయిపోయామా? అని నిలదీస్తుంది.
కావ్యకి నిజం చెప్పలేక రాజ్ బాధపడతాడు. నాకేం చెప్పకపోయినా పర్లేదు కానీ, మావయ్య గారికి మాత్రం మీరు ఖచ్చితంగా సారీ చెప్పాలని అంటుంది కావ్య. ఆయన మీద అకారణంగా కోప్పడి వచ్చేస్తే అయిపోయిందని అనుకున్నారా? ఆయన ఎంత బాధపడి ఉంటారో? ఏనాడూ ఒక్క మాట కూడా అనని మీరు ఇలా ఒక్కసారిగా అన్నేసి మాటలు అంటే ఆయన ఎలా తట్టుకుంటారు? అని నిలదీస్తుంది కావ్య. ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాను, అవన్నీ ఆలోచించలేదని చెబుతాడు రాజ్. నాన్న మనసు ఎంత హర్ట్ అయ్యుంటుందో నేను ఊహించగలను, నేను చేసిన తప్పుకి నాన్నకి క్షమాపణలు చెబుతానని కావ్యని తీసుకుని వెళ్తాడు రాజ్.
జరిగింది తలచుకుంటూ గార్డెన్‌లో ఒంటరిగా బాధపడుతుంటాడు సుభాష్. ఇంతలో అపర్ణ వచ్చి వాడేదో కోపంలో మాట్లాడితే మీరు చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారా అని అడుగుతుంది. నా కొడుకు అన్న మాటలకి నా మనసు గాయపడిందని, అందుకే నా పర్మిషన్ లేకుండా కన్నీరు వచ్చేస్తుందని అంటాడు సుభాష్. పిల్లలే ప్రపంచం అనుకున్న తల్లిదండ్రుల్ని ఆ పిల్లలే నిందిస్తుంటే ఏ పేరెంట్స్‌కైనా బాధ ఉంటుందని అంటాడు సుభాష్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ నన్ను ఒక్కమాట అనలేదు.. కానీ ఈరోజు డబ్బు సంపాదించకపోతే చచ్చిపోతామా అన్నాడు.. అమ్మానాన్న డబ్బు సంపాదించేది పిల్లల ఆనందం కోసమే, వాడికి ఆఫీస్‌కి వెళ్లడం ఇష్టం లేకపోతే నాకు ఆఫీస్ చూసుకోవడం ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అని అంటాడు సుభాష్.
నేను బాధపడుతున్నది నన్ను అన్నాడని కాదు.. దాని వెనుక ఉన్న కారణం గురించి అని చెబుతాడు సుభాష్. మనిషి కోపంలో ఉంటే అలాంటి మాటలు రావని, చెప్పుకోలేనంత బాధలో ఉన్నప్పుడే అలాంటి మాటలు వస్తాయని అంటాడు. వాడి ప్రాబ్లమ్ ఏంటో కనుక్కో తప్పకుండా చెబుతాడని అంటాడు. ఇంతలో రాజ్ వచ్చి ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఉండి మిమ్మల్ని అన్నాను కానీ, మీ మీద నాకు ఏ కోపం లేదని, మీరు నా దేవుడు నేను చేసిన తప్పుకు నన్ను క్షమించమంటూ సుభాష్ కాళ్ల మీద పడబోతాడు రాజ్. మీ బాధ పోయేంత వరకు నన్ను కొట్టమంటాడు, నువ్వు నా ప్రాణమని.. నేను నిన్నెందుకు కొడతానని సుభాష్ చెప్పడంతో తండ్రిని రాజ్ హత్తుకుంటాడు. ముందు నీ మనసులో ఉన్న బాధ ఏంటీ అని అడుగుతాడు సుభాష్. కావ్య కూడా అదేంటో చెప్పమని అడగ్గా.. నేను చెప్పలేనని వెళ్లిపోతాడు రాజ్.
కావ్యను, బిడ్డను కాపాడటానికి రాజ్ డాక్టర్ల చుట్టూ తిరుగుతాడు. ఎక్కడికి వెళ్లినా డాక్టర్లు చేతులెత్తేస్తారు. ఓ హాస్పిటల్ దగ్గరికి రాగా.. ఓ గర్భవతి నాకు అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదని, చూస్తూ చూస్తూ బిడ్డను ఎలా చంపుకోమంటారు అని భర్తతో గొడవ పడుతుంది. అబార్షన్ చేయించుకోవాల్సిందే, ఇప్పుడు నీ ఇష్టాల గురించి ఆలోచిస్తే నాకు కష్టంగా ఉంటుందని భర్త అంటాడు. ఈ మాటలు విన్న రాజ్.. మీ ఆవిడకి కడుపు ఎందుకు చేశావురా అని మండిపడతాడు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, కానీ మా ఆర్ధిక పరిస్ధితి అంత బాలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతాడు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి మేం ప్రయత్నిస్తుంటే, నువ్వు అంత సింపుల్‌గా చెప్పేస్తున్నావని మండిపడతాడు. ఆర్ధిక పరిస్థితి గురించి మీ ఆవిడతో కాపురం చేసేటప్పుడు తెలియలేదా? అని నిలదీస్తాడు రాజ్. పిల్లల గురించి పిల్లలు లేనివాళ్లను అడిగిచూడమని చెబుతాడు. ఒక బిడ్డని కనాలంటే ఎంత కష్టమో తెలుసా? ప్రెగ్నెంట్ అయిన దగ్గరి నుంచి డెలివరి అయ్యే వరకు బిడ్డను మోసే వరకు అల్లాడిపోతుందని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










