Brahmamudi September 27th Episode: బిడ్డే ముఖ్యమన్న కావ్య.. రాజ్‌తో తెగతెంపులకు సిద్ధమైన కళావతి
Photo Courtesy: JioHotstar
అందరి చేత ఇన్ని అవమానాలు పడొద్దని వదిన అబార్షన్ గురించి నిజం చెప్పమని రాజ్‌తో అంటాడు కళ్యాణ్. రాజ్ తీరు గురించి అపర్ణ - సుభాష్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్నటి వరకు బిడ్డే ప్రాణమని అనుకున్న రాజ్ ఎందుకిలా మారిపోయాడా అని బాధపడతారు. ఇంతలో రాజ్ రావడంతో అపర్ణ కోపంతో ఊగిపోతుంది. అసలు ఏమైంది రా నీకు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావని మండిపడుతుంది. దాంతో నేను బిడ్డను చంపకపోతే.. కావ్య చనిపోతుందని రాజ్ జరిగినదంతా చెప్పడంతో సుభాష్, అపర్ణలు షాక్ అవుతారు.
నా బిడ్డ పోయినా పర్లేదని, కళావతిని కాపాడుకోవాలని అబార్షన్ చేయించాలని అనుకున్నానని చెప్పడంతో రాజ్‌ను పట్టుకుని అపర్ణ ఏడుస్తుంది. ఇందిర, కావ్యలు రాజ్ తీరు గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. అపర్ణ వచ్చి అబార్షన్ చేయించుకోకపోతే నువ్వు చనిపోతావని చెబుతుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ బిడ్డకు మాత్రం నేను జన్మనిస్తానని కావ్య తేల్చి చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 27వ తేదీ ఎపిసోడ్ 837లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కడుపులోని బిడ్డను చంపుకోవడం నా వల్ల కాదని కావ్య కంటతడి పెడుతూ స్పృహతప్పి పడిపోతుంది. దాంతో రాజ్ ఉలిక్కిపడతాడు. ఇంట్లో ఎవరికి ఈ నిజాన్ని చెప్పినా వాళ్లు కళావతికి చెప్పేస్తారని భయపడతాడు రాజ్. కడుపులో బిడ్డను మోయడానికే కావ్య ఇష్టపడుతుంది తప్పించి.. ఆ బిడ్డను చంపుకోవడానికి అస్సలు ఒప్పుకోదని, కళావతికి అబార్షన్ అయ్యే వరకు ఈ నిజం బయటకు రాకూడదని అనుకుంటాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని నిర్ణయించుకుంటాడు రాజ్.
రాజ్ తీరుతో ఇంట్లో వాళ్లంతా బాధపడుతుంటారు. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి భోజనం చేయడానికి పిలుస్తుంది. మాకు ఆకలిగా లేదని ఇందిర, అపర్ణలు చెబుతారు. వాడికేదో పిచ్చి పట్టిందని, అందుకే పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడని అపర్ణ రగిలిపోతుంది. నిన్నటి వరకు బిడ్డ పుడుతుందని మురిసిపోయాడని, ఏనాడూ గ్లాస్ మంచినీళ్లు కూడా ఇవ్వని రాజ్.. కావ్య తల్లి కాబోతుందని తెలియగానే దానిని ఇంట్లో పనులు చేయించడం ఆపేయమన్నాడు, కావ్యని కాలు కిందపెట్టనివ్వకుండా చూసుకున్నాడని ఓ తల్లిగా చాలా ఆనందపడ్డానని చెబుతుంది అపర్ణ.
బిడ్డ పుట్టకముందే షాపింగ్‌లు చేస్తుంటే మురిసిపోయా, ఆ బిడ్డ కోసం కావ్య పడిన అవమానాలకు, ఇబ్బందులకు ఫలితం ఇలా దక్కిందని అనుకున్నానని చెబుతుంది. కానీ సడెన్‌గా వాడు ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాలని అనుకుంటాడని అనుకోలేదని, వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, బిడ్డే ఎందుకు వద్దు అనుకుంటున్నాడని బాధపడుతుంది అపర్ణ. మనింటికి ఏదో పీడ పట్టుకుందని, ఏదో ఒక శాంతి చేపిస్తేనే కానీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండవని చెబుతుంది ధాన్యలక్ష్మీ. స్వప్న కూడా ఇదే మాట అంటుంది. ఏదో ఒకటి చేసి రాజ్ మనసు మార్చాలని చెబుతాడు ప్రకాశం.
ఆలోచించినా ఉపయోగం లేదని, వాడి ఒక్కొక్క మాట వింటుంటే గుండెల్లో తూటాలు దిగినట్లుగా అనిపించిందని.. వాడు బిడ్డను వద్దు అనుకోవడానికి కారణం ఏంటో తెలియదని, కానీ వాడు బాగా ఆలోచించాకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఉన్నాడని అంటాడు సుభాష్. అలాగని రాజ్‌ను వదిలేస్తామా అని రాహుల్ ప్రశ్నిస్తాడు. మనమంతా కలిసి మాట్లాడితే రాజ్ మారతాడని అంటాడు. వాడు మారడని రాజ్‌ని కన్నతండ్రే చెబుతున్నాడని, ఇక నువ్వెళ్లి మారుస్తావా? అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. అవసరమైతే రాజ్ కాళ్లను పట్టుకుని ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని నిలదీస్తానని అంటాడు రాహుల్.
పేరెంట్స్ మాటే వినని రాజ్.. నీ మాట వింటాడా? అంటూ రుద్రాని మండిపడుతుంది. కావ్య కడుపులో ఆ బిడ్డ ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకోలేదని, అప్పుడే తన ప్రాణం తీసేయడమేంటీ? అన ప్రశ్నిస్తాడు రాహుల్. ఈ విషయం కనుక మీడియాకు లీకైతే మన ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించారా అని వార్నింగ్ ఇస్తాడు. నేను తప్పు చేసినప్పుడు నన్ను అందరూ నిలదీసి ఎలా మార్చారో, ఇప్పుడు రాజ్‌ను కూడా అలాగే మారుద్దామని అంటాడు రాహుల్. నా బిడ్డ నా ఇష్టమని అంటే ఏం చేస్తావని రుద్రాణి ప్రశ్నిస్తుంది. పుట్టించిన వాడికే చంపే అధికారం ఉందంటే ఈ సృష్టిలో ఏ ప్రాణి బతకదని కావ్య కడుపులో బిడ్డని రాజ్ అడిగి కనలేదని, అలాంటప్పుడు చంపే అధికారం కూడా లేదని అంటాడు. మీ వల్ల కాకపోతే రాజ్‌ని ఎలాగైనా నేను ఒప్పిస్తానని చెబుతాడు రాహుల్.
దాంతో రాహుల్‌కి స్వప్న థ్యాంక్స్ చెబుతుంది. మా చెల్లి విషయంలో మీ అమ్మ ఆలోచించకపోయినా, ఏదో ఒకటి చేయాలని నువ్వు ఆరాటపడుతున్నావని అంటుంది. ఇది దుగ్గిరాల వారింటి సమస్య అని, దీనికి అప్రతిష్ట వచ్చిందంటే మనమంతా ఉన్నా లేనట్లేనని అంటాడు రాహుల్. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తనను రాజ్ ఎలా చూసుకున్నాడో గుర్తుచేసుకుని బాధపడుతుంది కావ్య. ఇంతలో రాజ్ వచ్చి ఇంకా నిద్రపోలేదా అని ప్రశ్నిస్తాడు రాజ్. జైళ్లో ఖైదీకి తెల్లారితే ఉరిశిక్ష అని చెప్పి రాత్రి ప్రశాంతంగా పడుకోమంటే నిద్రపడుతుందా అని నిలదీస్తుంది కావ్య. నా బిడ్డను చంపేస్తానంటే తల్లిగా నాకు నిద్ర ఎలా పడుతుందని అడుగుతుంది కావ్య.
మీ ప్రేమలో పాయిజన్ ఉంది, మీ నటన వెనుక మోసం ఉందని రాజ్‌ని నానామాటలు అంటుంది కావ్య. నా చేత ముందే మాట తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారా అని అడగటంతో అవును అని అంటాడు రాజ్. నువ్వు నన్ను అపార్ధం చేసుకోకుండా నీ దగ్గర మాట తీసుకున్నానని చెబుతాడు. నిన్ను దూరం చేసుకోకూడదని ప్రేమతో ఇదంతా చేశానని అంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి అని చెబుతాడు. కానీ నా బిడ్డ మాత్రం వద్దా అని కావ్య ప్రశ్నిస్తుంది. ఇలాంటి ఎందుకు నిర్ణయం తీసుకున్నారని, ఈ బిడ్డ మీకు ఎందుకు అడ్డంగా మారిందని అడుగుతుంది కావ్య. నువ్వు సమాధానం లేని ప్రశ్న అడిగావ్ చెప్పలేనని రాజ్ వెళ్లిపోతాడు.
ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూర్చొని ఉండగా రాజ్ వచ్చి పేపర్ చదువుకుంటాడు. నువ్వేదో పీకుతానని అన్నావ్ కదా.. వెళ్లి రాజ్‌ని అడుగు అని రాహుల్‌ను రెచ్చగొడుతుంది స్వప్న. దాంతో రాహుల్ వెళ్లి నీ నిర్ణయం ఏంటీ? కావ్యకి సారీ చెబుతావని మేమంతా ఎదురుచూస్తున్నామని అడుగుతాడు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే ఎవ్వరూ నమ్మడం లేదని, నేను కూడా గతంలో ఎన్నో తప్పులు చేశానని చెబుతాడు. ఎదుటివాళ్లు తప్పు చేస్తేనే భరించలేని నువ్వు ఇంత పెద్ద దారుణానికి ఎలా సిద్ధపడ్డావ్, జరిగిందేదో జరిగింది కావ్యకి సారీ చెప్పమని అంటాడు రాహుల్.
నా జీవితంలో ప్రాబ్లమ్ ఉంది.. దానికి నిన్ను సలహా ఏమైనా అడిగానా? నేను ఏం చేస్తున్నానో నాకు ఒక క్లారిటీ ఉందని, ఎవరి సలహా అక్కర్లేదని తేల్చిచెబుతాడు రాజ్. కానీ నీ జీవితం ఈ ఇల్లు, ఇంట్లో మనుషులతో ముడిపడి ఉందని.. నీ భార్యకు ఇలా నరకం చూపించకూడదని అంటుంది అపర్ణ. ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో, ఆ పిచ్చిదానిని బాధపెట్టొద్దని అంటుంది ఇందిర. ఇప్పటి వరకు నేను, కళావతి సంతోషంగా ఉన్నదే లేదని.. ఒకొరినొకరం పూర్తిగా అర్ధం చేసుకుని ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నామని చెబుతాడు రాజ్.
నేను తనతో కలిసి కొన్నాళ్లు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నానని, తనతో కలిసి బయట తిరగాలని ఆశపడుతున్నానని.. అందుకే పిల్లలు వద్దు అనుకుంటున్నానని అంటాడు రాజ్. సమస్య అదే అయితే ఆ బిడ్డను మేం చూసుకుంటాం, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగిరండి అని చెబుతుంది అపర్ణ. తల్లి లేకుండా బిడ్డ ఉండగలదా? అందుకే నాకు పిల్లలు వద్దు అని అంటాడు రాజ్. ఏం జరిగినా సరే నా నిర్ణయంలో మార్పు లేదని తేల్చేస్తాడు. అయినా నా చేతుల్లో ఏం లేదని నిర్ణయం తీసుకోవాల్సింది కళావతేనని.. ఏం నిర్ణయం తీసుకున్నావని అడుగుతాడు రాజ్.
మీరు అడిగిన పని నేను చేయను, నన్ను అడగకుండా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని మండిపడుతుంది కావ్య. ఇదే నీ ఆఖరి నిర్ణయమైతే నీకు నేను కావాలా, నీ కడుపులోని బిడ్డ కావాలా? అని నువ్వే తేల్చుకో అంటాడు రాజ్. రెండు కావాలని తెలివిగా సమాధానం చెప్పొద్దని, కొన్నిసార్లు జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందేనని చెబుతాడు రాజ్. కళావతినే జీవితం అనుకున్నానని అలాంటిది నేను తీసుకోబోయేది ఎంత ముఖ్యమైన నిర్ణయమో మీకు అర్ధం కావడం లేదా? అని రాజ్ ప్రశ్నిస్తాడు. నువ్వు ఆనందంగా ఉండటం కోసం నీ బిడ్డను చంపుకోవడం ముఖ్యమా అని అపర్ణ నిలదీస్తుంది. నాకు మీకన్నా నా బిడ్డే ముఖ్యమని కావ్య తేల్చిచెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










