Brahmamudi September 29th Episode: కావ్య బిడ్డను చంపేందుకు రాజ్ సాహసం.. నిజం రాబట్టేలా కళావతి ప్లాన్
Photo Courtesy: JioHotstar
రాజ్ గురించి కావ్య తప్పుగా అనుకోవడంతో అపర్ణ వచ్చి.. వాడు నీ ప్రాణాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెబుతుంది. నువ్వు మాకు కావాలని.. రాజ్‌ని, నీ బిడ్డని, మా అందరినీ వదిలేసి వెళ్లిపోతావా అంటూ కావ్యని అబార్షన్ చేయించుకోమ్మని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బతిమలాడతారు. మీరేం చెప్పినా సరే నా బిడ్డను చంపుకోవడానికి నేను ఒప్పుకోను, వాడు నాకు కావాలంటూ కావ్య స్పృహ తప్పిపడిపోతుంది. నిజం చెబితే జరగబోయేది ఇదేనని తలచుకుని రాజ్ ఉలిక్కిపడతాడు, ఎప్పటికీ ఈ నిజం చెప్పకూడదని అనుకుంటాడు.
రాజ్ అబార్షన్ నిర్ణయం గురించి ఇంట్లో వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉండగా.. రాజ్ మనసు మార్చడానికి ట్రై చేద్దామని, అవసరమైతే వాడి కాళ్లు పట్టుకుంటానని రాహుల్ చెబుతాడు. ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ వస్తాడు. ఏదో పీకుతాను అన్నావుగా వెళ్లి రాజ్‌తో మాట్లాడమని రాహుల్‌ని రెచ్చగొడుతుంది స్వప్న. దాంతో చెప్పినట్లుగానే కావ్య అబార్షన్ నిర్ణయం మార్చుకోమని రాజ్‌తో మాట్లాడతాడు రాహుల్. నేను తీసుకున్న నిర్ణయం నుంచి తప్పుకోనని తేల్చిచెబుతాడు రాజ్. చివరికి నీకు బిడ్డ కావాలా? నేను కావాలా తేల్చుకోవాలని కావ్యని అడగ్గా.. నాకు మీ కన్నా నా బిడ్డే ముఖ్యమని కావ్య చెప్పడంతో రాజ్ కోపంతో ఊగిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్ 838లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అబార్షన్ చేయించుకుంటావా? లేదా? అని కావ్య - రాజ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. మీ నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు.. నా నిర్ణయం నేను తీసుకుంటానని చెబుతుంది కావ్య. నాకు మీకన్నా నా బిడ్డే ముఖ్యమని తేల్చి చెబుతుంది. నా బిడ్డ కోసం మిమ్మల్నే కాదు.. ఆ దేవుడిని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నానని అంటుంది కావ్య. దాంతో రాజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వీడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడంటే వీడు చెప్పేది ఏది నాకు నమ్మబుద్ధి కావడం లేదు.. ఏదో బలమైన కారణం ఉందని అంటుంది అపర్ణ. ఇలాంటి కొడుకు మన కడుపున పుట్టాలని రాసి ఉన్నప్పుడు మనం మాత్రం చేయగలిగింది ఏంటీ అని అపర్ణని ప్రశ్నిస్తాడు సుభాష్.
జరిగిన గొడవతో రాజ్‌ను బయటికి తీసుకెళ్లి మాట్లాడతాడు కళ్యాణ్. ఇప్పటి వరకు జరిగింది చాలు, అందరినీ బాధపెట్టి.. నువ్వు బాధపడాల్సింది ఏం లేదని, ఇకనైనా వదినతో పాటు ఇంట్లో వాళ్లందరికీ నిజం చెప్పమని అంటాడు కళ్యాణ్. చెప్పేస్తే మీ వదిన ఊరుకుంటుందా? తన కడుపులో పెరుగుతున్న బిడ్డను వద్దు అనుకుంటుందా? కారణం చెప్పకపోతేనే అలా మాట్లాడిన కళావతి.. తన కడుపులోని బిడ్డ కారణంగానే తను చనిపోతుందని తెలిస్తే ఇంకేలా రియాక్ట్ అవుతుంది. నా ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డకు ప్రాణం పోసి తీరతానని అంటాడు రాజ్. కానీ వదినకు ఎన్ని రోజులు నిజం చెప్పకుండా దాస్తావని కళ్యాణ్ నిలదీస్తాడు.
నిజం ఎలాగైనా బయటికి వస్తుందని, అప్పటి వరకు ఎందుకు? కనీసం ఇంట్లో వాళ్లయినా నిన్ను అపార్ధం చేసుకోకుండా ఉంటారని చెబుతాడు కళ్యాణ్. నిజం చెప్పకపోతే కళావతిని ఎలాగోలా కాపాడుకోగలను, కానీ నిజం చెబితే తనను కాపాడలేనని అంటాడు రాజ్. బిడ్డను వదిన ఎక్కువ రోజులు క్యారీ చేయకూడదు.. త్వరగా తీసేయాలని డాక్టర్ చెప్పారు కదా అని కళ్యాణ్ గుర్తుచేస్తాడు. వదినని చూస్తే అస్సలు ఊరుకునేలా లేదని, మరి ఏం చేయాలని అడుగుతాడు. దానికి నేను ఆల్రెడీ ప్లాన్ చేశానని చెప్పి మెడికల్ షాపుకి తీసుకెళ్తాడు రాజ్.
మనం చాలా రిస్క్ చేస్తున్నామని, ఈ విషయం కనుక పోలీసులకు తెలిసిందంటే మనల్ని తీసుకెళ్లి జైలులో వేస్తారని భయపడతాడు కళ్యాణ్. చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయడం నేరమని, వదినకి తెలియకుండా అబార్షన్ టాబ్లెట్స్ ఇవ్వడం మోసం అవుతుందని అంటాడు కళ్యాణ్. వదినకి తెలిసిందంటే మనల్ని జీవితంలో క్షమించదని అంటాడు. తను నన్ను ఎలా చూసినా పర్లేదని, మీ వదిన ప్రాణాలతో ఉంటే అదే చాలని చెబుతాడు రాజ్. అన్నయ్య చెప్పినట్లు చేయలేక టెన్షన్ టెన్షన్‌గా మెడికల్ షాపుకి వెళ్తాడు కళ్యాణ్.
గొడవ తర్వాత కావ్యతో ఇందిర, అపర్ణలు మాట్లాడతారు. తాళి బంధానికి విలువ ఇచ్చే నువ్వు.. భర్త మాట కోసం నీ కడుపులోని బిడ్డను ఎక్కడ తీసేస్తావోనని భయపడ్డానని, కానీ వాడి బెండ్ తీసేలా మాట్లాడావని మెచ్చుకుంటుంది అపర్ణ. నా ఫుల్ సపోర్ట్ నీకేనని ఎక్కడా తగ్గొద్దని చెబుతుంది. అలా మాట్లాడతావేంటీ అని ఇందిర ప్రశ్నించగా.. కొడుకుగా వాడు తప్పు చేస్తే క్షమిస్తానని, కానీ ఇంకో తల్లికి అన్యాయం చేస్తానంటే మాత్రం అస్సలు క్షమించనని తేల్చేస్తుంది అపర్ణ. భర్త అయినంత మాత్రాన వాడికి అన్ని హక్కులు ఉంటాయా? భార్యగా దీనికి ఏ హక్కులు ఉండవా? అని నిలదీస్తుంది అపర్ణ. వాడేం చేసినా గంగిరెద్దులా తలాడించాలా? అని మండిపడుతుంది.
నిన్నటి వరకు కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసి ఎంతో మురిసిపోయాడని, కావ్యని అడుగు కూడా కింద పెట్టకుండా అన్ని పనులూ వాడే చేశాడని, అంతలా ప్రేమించి కేర్ తీసుకున్న వాడు .. సడెన్‌గా నాకు ఆ బిడ్డ వద్దు అంటే ఎలా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఎంతసేపు ఓ మూర్ఖుడిలా ఆలోచిస్తున్నాడు కానీ, ఓ తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నాడా? అని ప్రశ్నిస్తుంది. మనం ఇంట్లో పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతేనే తట్టుకోలేమని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపుతుంటే ఎలా తట్టుకుంటుందని అడుగుతుంది అపర్ణ. వాడు ఈ విషయంలో ఏం చేసినా సరే, నువ్వు మాత్రం నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దని కావ్యకి చెబుతుంది.
తల్లిగా ఆ బిడ్డ మీద పూర్తి హక్కులు నీకే ఉంటాయని.. తల్లిగా, భార్యగా ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది ఇందిర. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా కడుపులోని బిడ్డ గురించి కాదని, ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలని చెబుతుంది కావ్య. ఆయనేంటో, ఆయన మనస్తత్వం ఏంటో ఇంట్లో అందరికీ తెలుసని.. ఆయనది చీమకి కూడా హాని చేసే వ్యక్తిత్వం కాదని.. అలాంటి తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంటుందని కావ్య అనుమానిస్తుంది. ఆ కారణం ఏంటీ? అనేది ఎలా తెలుసుకుంటావని అడుగుతుంది ఇందిర.
రాజ్ చెప్పిన మెడికల్ షాపుకు వెళ్లిన కళ్యాణ్... డాక్టర్ సుధాకర్ గారు పంపించారని చెప్పి ట్యాబ్లెట్స్ అడుగుతాడు. ఇవి అబార్షన్ ట్యాబ్లెట్స్ అని ఇలా ఎవరికి పడితే, వాళ్లకి ఇవ్వడం కుదరదని చెబుతాడు షాపు అతను. ఫేక్ ప్రిస్క్రిప్షన్‌తో కొంతమంది మెడిసిన్స్ తీసుకెళ్తున్నారని అంటాడు. డాక్టర్ సుధాకర్ గారికి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పడంతో కళ్యాణ్ వణికిపోతాడు. వెంటనే ఫోన్ మాట్లాడకుండా ఆపాలని చూస్తాడు కళ్యాణ్. నీ ఫోన్ నుంచి కాదు, నా ఫోన్ నుంచి మాట్లాడమని రాజ్‌కి కాల్ చేసి డాక్టర్‌లా మాట్లాడిస్తాడు కళ్యాణ్. నిజంగానే డాక్టర్ గారు చెప్పారని అబార్షన్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు షాప్ ఓనర్.
అయితే మీ గొంతు మారిపోయిందని, మీరు నిజంగానే డాక్టర్ సుధాకర్ గారు కాదా? అని ఓనర్‌కి అనుమానం వస్తుంది. దాంతో రాజ్ సీరియస్ అవుతాడు. ఎలాగోలా ట్యాబ్లెట్స్ దొరకడంతో వాటిని రాజ్‌కి ఇస్తాడు కళ్యాణ్. వదినకి తెలియకుండా టాబ్లెబ్స్ ఇవ్వమని చెబుతాడు రాజ్.. తెలిసిందంటే మనిద్దరం జీవితాంతం శత్రువుల్లాగే మిగిలిపోతామని అంటాడు కళ్యాణ్. చెడు చేసి శత్రువు అయితే పర్లేదని, కానీ మంచి చేసి శత్రువులం కావొద్దని తమ్ముడు చెప్పడంతో రాజ్ ఎమోషనల్ అవుతాడు.
ఇంట్లో బొమ్మలు, పిల్లల పోస్టర్లు చూసుకుంటూ బాధపడుతుంది కావ్య. రాజ్ గతంలో ఇచ్చిన పోస్టర్‌లని బాబు కావాలని, కూతురు కావాలని ఇద్దరు గొడవపడ్డ విషయాలను గుర్తు చేసుకుంటుంది. నా మనవడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఏం చేస్తున్నావని ఇందిర అడగ్గా.. గది మొత్తం బాబు, పాపల పోస్టర్లు అంటిస్తుంది కావ్య.


Click it and Unblock the Notifications










