Karthika Deepam 2 September 29th: జ్యోత్స్న ప్లాన్ తిప్పికొట్టిన శ్రీధర్.. కుప్పకూలిన దీప, షాక్‌లో సుమిత్ర
దశరథ్ - దీప మాటలను విన్న సుమిత్ర బాధపడుతూ కిందకి వచ్చేస్తుంది. ఆమె వెనకాలే జ్యోత్స్న కూడా వెళ్లి.. మీ ఇద్దరి మధ్య చిచ్చుపెడుతున్న ఆ దీపను క్షమించి వదిలేస్తావా అని మండిపడుతుంది. దీపను జీవితంలో క్షమించనని, కానీ ఇప్పుడు మీ నాన్నతో ఆమె అన్న మాటల్లో ఎలాంటి తప్పు లేదని చెబుతుంది. సీఈవోగా కంపెనీని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలా? అన్నది ఆలోచించమని కూతురికి క్లాస్ పీకుతుంది సుమిత్ర. ఎన్ని ప్లాన్లు వేసినా దీపను ఇరికించడం కుదరకపోవడంతో జ్యోత్స్న రగిలిపోతుంది.
జాబ్ లేకపోవడంతో అత్తారింట్లో కాశీకి అవమానాలు ఎదురవుతుంటాయి. స్వప్నతో పాటు ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా అల్లుడు ఖాళీ అంట కదా అని కాశీని ఎగతాళి చేస్తారు. దాంతో అల్లుడిగారి మర్యాదల్లో ఎలాంటి తేడాలు లేకుండా చూడమని కావేరిపై కోప్పడతాడు శ్రీధర్. నీ మనవడికి జాబ్ ఇప్పించాలని అనుకుంటున్నానని, నెలకి లక్ష రూపాయలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నానని పారుతో కాశీ గురించి చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు చాలా సంతోషిస్తుంది. వాడు నీ సొంత తమ్ముడు.. కాస్త గౌరవించడం నేర్చుకోమ్మని చెబుతుంది పారు. ఇంతలో ఆ మాటలు విన్న కార్తీక్.. కాశీ నీ సొంత తమ్ముడా అని జ్యోత్స్నను అడుగుతాడు. ఆమె ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మరి సెప్టెంబర్ 29వ తేదీ 475 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

కార్తీక్, దీపాలు కిచెన్‌లో వంట చేస్తూ మాట్లాడుకుంటారు. మీ అమ్మని నాన్నని కలిపేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నావని అంటాడు కార్తీక్. ఇద్దరూ ఎంత మంచివాళ్లో, అంత మొండివాళ్లని అంటుంది దీప. అమ్మకి నేనంటే ఎలాగూ పడదు కాబట్టి అటువైపు వెళ్లే ప్రయత్నం చేయలేదని, నాన్న అంటే నన్ను అర్ధం చేసుకున్నారు కాబట్టి ఆయన దగ్గరికే వెళ్లానని చెబుతుంది దీప. ఇలాంటి సలహాలు ఇవ్వొద్దని చాలా పద్ధతిగా చెప్పారు, అలాగని అమ్మ మీద కోపం ఉందా అంటే అది కోపం కాదు, సరిదిద్దడం అని చెప్పారని అంటుంది దీప. ప్రేమించే భర్తకు భార్య గురించి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని తెలుసుకున్నానని చెబుతుంది. భర్త పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేని భార్య.. అతని దృష్టిలో చాలా కింది స్థాయికి పడిపోతుందని చెబుతుంది దీప.
ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. మీరిద్దరూ మాట్లాడుకోవడం చిన్న మరదలు చూసిందని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. దాని గురించి మా ఇద్దరికీ చిన్నపాటి పంచాయతీ కూడా జరిగిందని చెప్పడంతో నువ్వు గట్టిగానే ఇచ్చుంటావుగా అని దీప సెటైర్లు వేస్తుంది. ఎంత మంచివాళ్లయినా చెప్పుడు మాటలు వింటే మారిపోతారని.. జ్యోత్స్న మాటలు విని మా అమ్మ తన సొంత ఆలోచనల్ని చెడగొట్టుకుందని బాధపడుతుంది దీప. చివరికి మా నాన్న దృష్టిలో పెద్ద దోషిగా నిలబడిందని, కలుపుదామంటే మా అమ్మ నాన్న ఇద్దరూ మొండివాళ్లేనని చెబుతుంది దీప. ఈ మాటలన్నీ జ్యోత్స్న, పారులు వినడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.
మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది.. ఆవిడ గురించి ఏం తెలియదు అన్నావుగా అని పారు ప్రశ్నిస్తుంది. ఈ అనాథను కన్న అభాగ్యురాలు ఎవరో తెలియదు కదా అని అంటుంది. తెలియకుండానే అమ్మనాన్నల గురించి మాట్లాడుతుందా? అని జ్యోత్స్న మండిపడుతుంది. సుమిత్ర, దశరథ్‌ల గురించి నిజం తెలియనంత వరకు మనం సేఫ్ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కారు రెడీ చేశావా? బయటికి వెళ్దామా? అని కార్తీక్‌ను తీసుకుని వెళ్లిపోతుంది.
అల్లుడుగారు మనింట్లో ఉండటానికి ఇబ్బంది పడుతున్నారేమోనని శ్రీధర్‌తో చెబుతుంది కావేరి. ఇక్కడైతే నీ కూతురు ఇవ్వకపోయినా, కనీసం నువ్వయినా కాఫీ ఇవ్వొచ్చని చెబుతాడు శ్రీధర్. అదే వేరే ఇంట్లో పెడితే వాళ్లిద్దరూ విడిపోవడానికి ఎన్నాళ్లో పట్టదని అంటాడు. ఇంతలో పారు, జ్యోత్స్నలు అక్కడికి వస్తారు. మీరెంటీ మా ఇంటికి వచ్చారని శ్రీధర్ అడగ్గా.. మనమంతా ఒకటే కూటమి కదా అని అంటుంది పారు. మీ కూటమిలో నాకు సభ్యత్వం వద్దని తేల్చేస్తాడు శ్రీధర్. ఈ ఇంట్లో వాళ్లు మర్యాదలు మరిచిపోయినట్లు ఉన్నారని జ్యోత్స్న సీరియస్ అవ్వగా.. వచ్చిన వాళ్లని బట్టే మర్యాదలు ఉంటాయని స్వప్న మండిపడుతుంది.
నేను నా మనవడి కోసం వచ్చానని పారు చెప్పడంతో స్వప్న ఆమెపై సెటైర్లు వేస్తుంది. వాడు నీకు మొగుడు కాకముందే నాకు మనవడిని పారు అనగా.. ఆరోజు స్టేషన్‌లో ఉన్నాడని ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి విడిపించారు అంటూ మండిపడుతుంది స్వప్న. నీ భర్త నెల రోజులు జైళ్లో ఉన్నాడా? నువ్వు ఫోన్ చేసి అడిగితే నేను కాదు అన్నానా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నీ కూతురు ఇలా తయారైంది ఏంటీ అని పారు అడగ్గా.. నా కూతురు ఈ మధ్య అన్నీ నిజాలే మాట్లాడుతోందని శ్రీధర్ కూడా సెటైర్లు వేస్తాడు.
ఇంతలో కాశీ వచ్చి మీరిద్దరూ ఎందుకొచ్చారని అడుగుతాడు. నా మనవడు ఎలా ఉన్నాడో చూసుకుందామని వచ్చానని, సరిగా తినడం లేదా? ఎలా చిక్కిపోయావో చూడు అని అంటుంది పారు. అల్లుడిని ఇంట్లో ఉంచుకోవడమే కాదు, కడుపునిండా తిండి కూడా పెట్టాలని మండిపడుతుంది. నేను ఇక్కడే బాగానే ఉన్నానని, ఎవ్వరినీ ఏం అనొద్దని.. ఆ ఉద్దేశంతోనే వచ్చుంటే బయల్దేరమని చెబుతాడు కాశీ. పేరు పొగొట్టుకుని, ఉద్యోగం పొగొట్టుకుని, ఉద్యోగం రాక.. మామగారి ఇంట్లో తలదాచుకుంటున్నావని సాయం చేయడానికి ఇంటికి వస్తే ఇదేనా నువ్వు ఇచ్చే మర్యాద అని మండిపడుతుంది జ్యోత్స్న.
నా ప్రయత్నాలేవో నేనే చేసుకుంటానని ఎవరి సాయం వద్దని కాశీ తేల్చేస్తాడు. మా నాన్న కాశీని తక్కువగా చూడటం లేదని స్వప్న అంటుంది. జాబ్ పోయి ఇన్నిరోజులు అవుతుందని, అయినా ఉద్యోగం రాలేదని తెలిసి సాయం చేద్దామని వచ్చానని చెబుతుంది జ్యోత్స్న. మన రెస్టారెంట్‌లో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందని అది చేసుకోమని చెబుతుంది. మా అల్లుడు గారు చదువుకున్న జాబ్‌కి మేనేజర్ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని.. మాకే చాలా బిజినెస్‌లు ఉన్నాయని అంటుంది కావేరి. కొత్తగా పెట్టిన ఐటీ కంపెనీ ఓనర్ నా ఫ్రెండేనని నేను మాట్లాడతానని అంటుంది జ్యోత్స్న. ఇంతలో తన ఫోన్ కారులో మరిచిపోయానని, బయట డ్రైవర్ ఉన్నాడని కొంచెం తీసుకురమ్మని చెప్పవా అని స్వప్నని అడుగుతుంది.
దాంతో స్వప్న వెళ్లి మీ మేడం మొబైల్ తీసుకురమ్మని చెప్పగా.. అక్కడ కార్తీక్ ఉండటం చూసి బాధపడుతుంది. వచ్చింది నువ్వని చెప్పలేదని దాని సంగతి చెబుతానని జ్యోత్స్నకి క్లాస్ పీకుతుంది స్వప్న. నువ్వు మనింటికి వచ్చినప్పుడు బయట ఎందుకు నిలబడ్డావని కార్తీక్‌ని నిలదీస్తుంది. నిన్న జరిగింది నువ్వింకా మరిచిపోలేదా? తండ్రి కొడుకులు అన్నాకా ఒక్కొక్కసారి మాటామాట అనుకుంటామని అంటాడు శ్రీధర్. ఇది నీ ఇళ్లు.. ఈ ఇంట్లోకి ఎప్పుడైనా వచ్చి మీ చిన్నమ్మని ఓ కాఫీ అడిగి తాగే రైట్ నీకుందని చెబుతాడు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని పారిజాతం అడగ్గా.. ఏదో జరిగిందని అంటాడు శ్రీధర్. నా కొడుకు కోసం డ్రైవర్‌గానే కాదు ఏదైనా చేస్తానని చెబుతాడు.
దీప ఇంట్లో పనులు చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోతుంది. అది చూసిన సుమిత్ర కిచెన్‌లోకి వచ్చి ఎంత లేపినా ఆమె లేవదు.. దీంతో వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఆ మాటలు విన్న కార్తీక్ టెన్షన్ పడతాడు. తను రాత్రి నుంచి భోజనం చేయలేదని, అందుకే కళ్లు తిరిగి పడిపోయిందని చెబుతాడు కార్తీక్. ఐటీ కంపెనీ ఓనర్‌తో మాట్లాడి నీకు జాబ్ ఇప్పిస్తానని జ్యోత్స్న చెప్పగా.. నాకు ఎవరి రికమెండేషన్‌లు అక్కర్లేదని తేల్చేస్తాడు కాశీ. ఖర్చులకు డబ్బులు ఇవ్వబోతుండగా శ్రీధర్ వాటిని లాక్కుని, మా అల్లుడి ఖర్చులకు నేను ఇవ్వగలనని క్లాస్ పీకుతాడు.
దీప ముఖం మీద నీళ్లు కొట్టి లేపుతుంది సుమిత్ర. రాత్రి నుంచి భోజనం చేయకుండా ఏం చేద్దామని? ఎవరిని సాధిద్దామని అని అంటూ దీపపై మండిపడుతుంది సుమిత్ర. ముందు ఏమైనా తినాలని చెప్పి ప్లేట్‌లో అన్నం పెడుతుంది. నీకు భోజనం పెట్టేంత మానవత్వం నాకుంది కానీ, తినిపించలేనని అంటుంది సుమిత్ర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










