Karthika Deepam 2 October 24th: కార్తీక్, దీపలని ఇరికించిన శౌర్య... సుమిత్ర జాడ కనిపెట్టిన శివన్నారాయణ
Photo Courtesy: JioHotstar
సుమిత్ర అత్తను ఎక్కువ రోజులు ఇక్కడ దాచలేమని ఎలాగైనా తిరిగి ఇంటికి పంపించేయాలని కాంచన, దీపలతో చెబుతాడు కార్తీక్. మేం ఎంతో చెప్పామని, నువ్వు కూడా ఒకసారి చెబితే నీకే తెలుస్తుందని అంటారు కాంచన, దీప. ఇంతలో శివన్నారాయణకి కార్తీక్ ఫోన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదా? అని అడుగుతాడు. నాకేం పర్లేదని దశరథను ఓదార్చలేకపోతున్నానని కంటతడి పెట్టుకుంటాడు శివన్నారాయణ. ఇంతలో శౌర్య వచ్చి నేను అమ్మమ్మ గదిలో పడుకోనా, నానమ్మ గదిలో పడుకోనా అని అడగటంతో శివన్నారాయణకు డౌట్ వస్తుంది.
కార్తీక్‌ను దాటి అందరూ నిన్ను మెచ్చుకోవాలంటే మీ అమ్మ ఎక్కడుందో నువ్వే వెతికి తీసుకురావాలని జ్యోత్స్నకి చెబుతుంది పారిజాతం. నువ్వు ఇప్పటికైనా ఇంటికి వెళ్లాలని సుమిత్రకు చెబుతాడు కార్తీక్. ఇంతలో శివన్నారాయణ అనుకోకుండా కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇంట్లో పెద్దాయనను చూసిన కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 24వ తేదీ 497వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇంట్లో శివన్నారాయణ ప్రత్యక్షం కావడంతో కాంచన, దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. నిజంగా సుమిత్ర దొరుకుతుందా? అని పెద్దాయన అడగ్గా.. దొరుకుతుందని అంటుంది దీప. నా మనవడు కూడా ఇలాగే నమ్మకంగా చెప్పాడని ఈసారి నువ్వు చెబుతున్నావ్, ఇల్లు వదిలిపెట్టి రెండ్రోజులు అవుతున్నా మనిషి ఎక్కడుందో తెలియడం లేదని అంటాడు. కోపంలో సుమిత్రమ్మ గారు వెళ్లిపోయారని ఆ మనిషి మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేదని అనసూయ అంటుంది. మనసు ముక్కలైన మనిషికి బంధాలు గుర్తుకురావని, వాళ్లు మనకి దగ్గరలోనే ఉన్నా కనిపించరని అంటాడు. శివన్నారాయణ మాటలతో కార్తీక్ కంగారు పడతాడు.
సుమిత్ర నాకు ఇక్కడే కనిపించిందని శివన్నారాయణ అనడంతో అంతా షాక్ అవుతారు. మీ అందరి ప్రేమలో నాకు సుమిత్ర కనిపించిందని చెబుతాడు. నిన్న నేను కూడా దీపతో ఇలాగే అన్నానని అంటాడు కార్తీక్. నీకు మీ అత్త అంటే అంత ప్రేమ అని చెబుతాడు శివన్నారాయణ. నేను వచ్చిన పని అయిపోయిందని, చూడాలని వచ్చాను, చూశాను అని చెబుతాడు పెద్దాయన. మీ అమ్మని చూడాలనిపించింది వచ్చాను... రాత్రి కూడా ఫోన్‌లో మాట్లాడినప్పుడు నా ఆరోగ్యం గురించే కంగారు పడిందని అందుకే చూడాలనిపించిందని అంటాడు శివన్నారాయణ. అన్నయ్య ఎలా ఉన్నాడని కాంచన అడగ్గా.. సుమిత్ర లేక కనిపించడం లేదు, దశరథ ఉండి కూడా కనిపించడం లేదని చెబుతాడు పెద్దాయన. నా సుమిత్రతో పాటు వాడు వెళ్లిపోయాడని, నట్టింటిలో దశరథలా ఉండేవాడు వేరే ఎవరో తిరుగుతున్నట్లుగా అనిపిస్తోందని బాధ పడతాడు శివన్నారాయణ. ఎవరైనా మీ అబ్బాయి ఎలా ఉన్నాడని అడిగితే, నాకొక కొడుకు ఉండేవాడు.. వాడిప్పుడు లేడు అని చెప్పాలని అంటాడు శివన్నారాయణ. నీతో కొంచెం మాట్లాడాలని కార్తీక్‌ను బయటికి పిలుస్తాడు.
తాతయ్య కనిపించడం లేదని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. కోడలు పోయిందన్న బెంగతో ఈయన కూడా ఇంట్లో నుంచి పోయుంటాడని అంటుంది జ్యోత్స్న. దాంతో రగిలిపోయిన పారు.. జ్యోత్స్నని లాగిపెట్టి కొట్టాలని అనుకుంటుంది. ఒకవేళ ఇంట్లో నుంచి పోయినా మనం ఏం చేయగలం చెప్పు అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. అతనేమీ సొంత తాత కాదు కదా అని అంటుంది. ఒకవేళ నువ్వు దాసు కూతురివని దాస్ చెప్పకపోయుంటే నీకు నిజం తెలిసేది కాదని, అప్పుడు సొంత తాత, సొంత అమ్మే కదా అంటుంది పారు. సొంతవాళ్లు కాకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదా అని అంటుంది. నాకు మాత్రమే ఉండాలా? వాళ్లకు నా మీద ఉండకూడదా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. వాళ్లకు నీ మీద ప్రేమ ఉండబట్టే.. నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరిస్తున్నారని అంటుంది పారు. నాకైతే ప్రేమ లేదని తేల్చేస్తుంది జ్యోత్స్న.
చిన్నప్పుడు అనవసరంగా నిన్ను మార్చేశానని పారు అనగా.. ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకోలేవని అంటుంది. ఒకవేళ చేసుకుంటే అని పారు ప్రశ్నించడంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. అప్పుడు బిడ్డల్ని మార్చినట్లే ఇప్పుడు మారుస్తానని అంటుంది. నిన్ను నీ తండ్రి దగ్గర పెట్టి, దశరథ కూతురిని తీసుకొస్తానని పారు చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. ఈ ఇంటి వారసురాలు ఎక్కడుందో నీకు తెలుసా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది, నువ్వు కూడా నాలాగే మనిషివి.. మీ తాత మంచానపడితే తెలియకుండానే నా కంట్లో నీళ్లు తిరిగాయని అంటుంది. నిన్ను గుండెల మీద ఆడించిన మీ తాతయ్య, నిన్ను భుజాల మీద మోసిన మీ నాన్న, నీకు చనుబాలు ఇచ్చిన మీ అమ్మ.. వీళ్లంతా చెట్టుకొకరు, పుట్టకొకరు పోతుంటే నీకు బాధగా అనిపించడం లేదా? అని నిలదీస్తుంది. నీ ప్రేమ ఎలా ఉందో చూడాలని ఉందని చెబుతుంది పారు.
అది ఎప్పటికీ జరగదని జ్యోత్స్న అనగా.. రేపు నాకు ఏదైనా అయితే ఇలాగే అంటావా? అని పారు ప్రశ్నిస్తుంది. నువ్వు వేరు, వాళ్లు వేరని అంటుంది. నీ సొంత తమ్ముడికి కష్టం వస్తే పట్టించుకోలేదని, నిన్ను పెంచిన తల్లికి కష్టం వస్తే పట్టించుకోలేదు ఇంకేవరిని పట్టించుకుంటావని ప్రశ్నిస్తుంది. అయితే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని జ్యోత్స్న అనడంతో పారు షాక్ అవుతుంది. ముందు తాత ఇంటికి వస్తే.. అప్పుడు చూద్దామని వెళ్లిపోతుంది. నీ కూతురికి నిజం చెప్పి తప్పు చేశావ్, ఇదొక యంత్రంలా తయారైందని అనుకుంటుంది పారిజాతం.
నిలబడటానికి నాకు ఓపిక ఉంది, కానీ ఎదురుచూడటానికి నా గుండెకు బలం లేదని కార్తీక్‌తో అంటాడు శివన్నారాయణ. సింహాల్ని ఓడించే యోధులు కూడా కన్నపిల్లల ముందు చిన్న పిల్లలు అయిపోతారని అంటాడు. ఒకప్పుడు నా కూతురి గురించి, ఇప్పుడు నా కొడుకు గురించి బాధపడుతున్నానని చెబుతాడు. నాకు ఎవరి మీదా అనుమానం రాదు.. వచ్చిందంటే అది ఎంతో కొంత నిజమే అయి ఉంటుందని అంటాడు శివన్నారాయణ. సుమిత్ర ఎక్కడుందో నాకు తెలుసని నా అనుమానం అంటాడు. అత్త ఎక్కడుందో తెలిస్తే నేనే ఇంటికి తీసుకొస్తానని చెబుతాడు కార్తీక్. ఇంతలో శౌర్య రావడంతో నువ్వు వస్తావని నాకు ముందే తెలుసని, నిన్న జో వచ్చి దాగుడుమూతలు ఆడిందని చెప్పడంతో కార్తీక్, దీప షాక్ అవుతారు.
జో ఎవరితో దాగుడుమూతలు ఆడుతుందని శివన్నారాయణ ప్రశ్నించడంతో పాప కంగారు పడుతుంది. దాంతో శివన్నారాయణ చాక్లెట్స్ తీసుకొచ్చి.. ఇంట్లో ఎవరెవరికీ ఇస్తావని అడుగుతాడు. ఒక చాక్లెట్ మిగిలిపోయిందని అది అమ్మమ్మకి ఇవ్వాలని అంటుంది శౌర్య. నువ్వెళ్లి ఈ చాక్లెట్ మీ అమ్మమ్మకి ఇవ్వాలని చెబుతాడు. దాంతో సుమిత్ర ఎక్కడుందో నిజం చెప్పమంటూ కార్తీక్ మీదకి చెయ్యి ఎత్తుతాడు శివన్నారాయణ. సుమిత్ర కోసం నా కొడుకు తిండి, తిప్పలు మానేసి మతిలేనివాడిలా ఇంట్లో పడి ఏడుస్తుంటే.. నువ్వు నా కోడల్ని నీ ఇంట్లోనే పెట్టుకుని ఎందుకురా మమ్మల్ని వెర్రి వాళ్లని చేశావని ప్రశ్నిస్తాడు.
నన్ను తాత అని పిలవొద్దని మండిపడతాడు శివన్నారాయణ. నమ్మిన ప్రతిసారి మీరు నమ్మకద్రోహం చేస్తున్నారని ఫైర్ అవుతాడు. నువ్వు నా కళ్ల ముందే కర్టెన్ మూసేశావ్.. ఆ మంచం మీద ఉన్న మనిషిని నేను చూడలేదు అనుకున్నావా అని అంటాడు శివన్నారాయణ. నా ప్రాణాలు పోతే దానికి మీరే కారణమని అంటాడు. కూతురు లేదు, మనవడు లేడు నాకెవ్వరూ లేరని రగిలిపోతాడు. నేను మీ అందరినీ వదిలేసుకున్నాను.. కానీ మీరంతా నా కుటుంబం కోసం నిలబడిన విధానాన్ని చూసి మనసు మార్చుకున్నానని చెబుతాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










