ఏదో పీకుతానని మాటలు చెప్పొద్దు.... మరోసారి కెలికిన బండ్ల గణేష్
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా ఎదగి, రాజకీయాలను టచ్ చేసి వివాదాలకు కేరాఫ్‌గా మారారు బండ్ల గణేష్. సినిమాలకు, సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్న ఆయన సినిమా ప్రమోషన్స్‌లో, సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు. సినిమా కార్యక్రమాలలోనూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుండటంతో ఆయనను ఫంక్షన్లకు పిలవాలంటేనే భయపడే పరిస్ధితి నెలకొంది. తాజాగా బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
మైక్ అందుకుంటే పూనకాలే
సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పెట్టే ట్వీట్స్‌కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఆయన మాటలు, ట్వీట్లు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సినీరంగానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాలు, ఇతర అంశాలపైనా గణేష్ స్పందిస్తూ ట్వీట్లు చేస్తుంటారు. ఇక సినిమా ఫంక్షన్‌లలో వేదిక మీదకి ఎక్కి మైక్ అందుకుంటే చాలు బండ్ల గణేష్ పూనకం వచ్చినట్లుగా ఊగిపోతారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆయనేం మాట్లాడతారోనని అటెన్షన్‌గా ఉంటారు.

చివరిలో క్రెడిట్ ఆయనకే
కొద్దిరోజుల క్రితం లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్‌మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ పై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. ఇండస్ట్రీలో కష్టపడితేనే నిలబడగలమని.. ప్రతి ఒక్కరూ మెగాస్టార్ బావమరిదిగా, స్టార్ కమెడియన్ కొడుకుగా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టలేరని.. ఇలాంటి అదృష్టం కొందరికే దక్కుతుందని గణేష్ వ్యాఖ్యానించారు. మనమెంత కష్టపడినా చివరిలో క్రెడిట్ వాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. దీంతో అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులు కాస్త ఇబ్బంది పడ్డారు.
బండ్ల వ్యాఖ్యలపై బన్నీ వాసు సీరియస్
ఈ ఎపిసోడ్ ముగిసిన తర్వాత బండ్ల గణేష్ వ్యాఖ్యలపై బన్నీ వాసు స్పందించారు. మా లాంటి వారిని అల్లు అరవింద్ ఎంతో ప్రోత్సహించారని.. మేం ఎంత సాధించినా క్రెడిట్ ఆయనదేనని తేల్చేశారు. దాంతో వివాదం సద్దుమణిగినట్లేనని సినీ జనాలు భావించారు. అయితే తాజాగా బన్నీ వాసు బ్యానర్‌లో మిత్రమండలి సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈవెంట్‌లో వాసు కాస్త దూకుడుగా మాట్లాడారు. తనను కొందరు తొక్కాలని చూస్తున్నారని, తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకోవద్దని.. నా వెంట్రుక కూడా పీకలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. సినిమా బాగుంటేనే జనం చూస్తారని, లేదంటే లేదని వాసు తెలిపారు.
బండ్ల సంచలన ట్వీట్
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బండ్ల గణేష్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు.. మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారని రాసుకొచ్చారు. ఇందులో ఎక్కడా బన్నీ వాసు పేరుని గానీ, మరొకరి పేరును గానీ ప్రస్తావించలేదు. దీంతో బన్నీ వాసుని ఉద్దేశించే బండ్ల గణేష్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వివాదం ఎటువైపు తిరుగుతుందోనని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై బన్నీ వాస్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











