బిగ్‌బాస్ విజేత ఇంటిపై కాల్పులు.. 24 రౌండ్స్ విచక్షణరహితంగా ఎటాక్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, బిగ్‌బాస్ ఓటీటీ (హిందీ) సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హర్యానాలోని గురుగ్రామ్‌లోని అతని ఇంటి వద్దకు మోటార్ బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఎల్విష్ ఇంటిపై విరుచుకుపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఈ దాడి జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దాడికి ముందు రెక్కీ
తొలుత దుండగులు ఎల్విష్ ఇంటి వద్ద గడిపి.. ఆ వెంటనే కాల్పులకు తెగబడ్డారు. అగంతకులు కాల్చిన బుల్లెట్లు మొదటి అంతస్తు వరకు చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. గాఢ నిద్రలో ఉన్న స్థానికులు కాల్పుల శబ్ధంతో ఉలిక్కిపడి లేచారు. నగరంలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది ఎవరి పని? ఎల్విష్‌కు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విజేతగా
ఎల్విష్ తొలుత యూట్యూబర్‌గా ఫేమస్.. ఈ క్రమంలో 2023లో బిగ్‌బాస్ హిందీ ఓటీటీలో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నాడు. తన వ్యక్తిత్వం, మైండ్ గేమ్, ఆటతీరుతో విజేతగా నిలిచాడు. యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూనే.. మ్యూజిక్ ఆల్బమ్స్‌లో, సినిమాలలో అవకాశం దక్కించుకున్నాడు ఎల్విష్. అయితే గతేడాది ఇతనిని పోలీసులు అరెస్ట్ చేయడం హర్యానాతో పాటు బుల్లితెర వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రేవ్ పార్టీలో పాము విషయం సరఫరా చేశాడనే అభియోగాలపై అతనిని అదుపులోకి తీసుకుని 9 పాములతో పాటు 20 ఎంఎల్ పరిమాణంలో పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివాదాల్లో ఎల్విష్
ఇదే కాదు.. అనేక వివాదాల్లో ఎల్విష్ పేరు వినిపించింది. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తూ, జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే కాశీ విశ్వనాథ టెంపుల్ కాంప్లెక్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఫోటోలు, వీడియోలు తీసినందుకు గాను ఎల్విష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కొద్దిరోజుల క్రితం జైపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తిని కొట్టిన ఘటన వైరల్ కావడంతో పోలీసులు ఎల్విష్‌పై కేసు నమోదు చేశారు.
ఆమె నా ఫ్రెండ్
ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ కూడా ప్రాణాలు కోల్పోయారు. 5 రోజుల క్రితం పెళ్లయి భార్య హిమాన్షి నర్వాల్‌తో పహల్గాం వెళ్లారు వినయ్. ఉగ్రవాదులు తన కళ్ల ముందే భర్తను కాల్చిచంపడంతో వినయ్ మృతదేహం వద్ద హిమాన్షి రోదిస్తున్న ఫోటోలు, వీడియోలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ హిమాన్షి కాలేజీలో తనకు క్లాస్‌మేట్ అని చెప్పాడు ఎల్విష్. హన్సరాజ్ కాలేజీలో తాను, హిమాన్షి చదువుకున్నామని.. ఉగ్రదాడి ఘటనతో నేను షాక్‌లోనే ఉన్నానని ఎల్విష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











