‘ఆ సినిమాకు కష్టం నాది.. జీవిత కోసం రాజశేఖర్ వెన్నుపోటు’
తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్‌మెన్‌గా, పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు డాక్టర్ రాజశేఖర్. తమిళ నటుడే అయినా తన కష్టం, ప్రతిభతో తెలుగునాట స్టార్ హీరోగా ఎదిగారు రాజశేఖర్. పోలీస్ రోల్స్‌తో పాటు యాక్షన్ సినిమాలతో ఒక ఊపు ఊపిన ఆయన టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లకు గట్టి పోటీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన రేసులో వెనుకబడ్డారు. ఆయన హిట్ కొట్టి ఏళ్లు గడుస్తోంది.
టాలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా
ఇక రాజశేఖర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు ఆయన సతీమణి జీవిత. భర్త, పిల్లల కోసం హీరోయిన్ కెరీర్ వదులుకున్న ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరిగా నిలిచారు జీవిత- రాజశేఖర్. జీవిత సలహా, సూచనలు లేకుండా రాజశేఖర్ కాలు కూడా కదపరని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటారు. తమ వారసులుగా శివాత్మిక రాజశేఖర్, శివానీ రాజశేఖర్‌లు ఈ దంపతులు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అలాంటి జీవిత, రాజశేఖర్ దంపతులపై ఓ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి

సింహరాశితో సంచలన విజయం
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకొచ్చారు దర్శకుడు వి.సముద్ర. డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహరాశి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తొలి సినిమాకే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో సముద్రకు అవకాశాలు క్యూకట్టాయి. ఆ తర్వాత శివరామరాజు, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, సూర్యం, మహానంది, విజయదశమి, ఏవడైతే నాకెంటీ, అధినేత, పంచాక్షరి, సేవాకుడు తదితర చిత్రాలను నిర్మించారు. అయితే వీటిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం, కొత్త కుర్రాళ్ల రాకతో వి.సముద్ర వెనుకబడిపోయారు.
సినిమాలకు దూరంగా వి సముద్ర
తెలుగులో వర్కవుట్ కాకపోవడంతో కన్నడంలో చిరంజీవి సర్జాగా హీరోగా రణం చిత్రాన్ని తీశారు. దర్శకుడిగానే కాకుండా రెయిన్ బో సినిమాలో నటుడిగానూ కనిపించారు. అవకాశాలు రాకపోవడంతో వి.సముద్ర సినీ పరిశ్రమకు దూరమయ్యారు. నాలుగేళ్లుగా ఆయన ఖాళీగానే ఉన్నారు. ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు వి సముద్ర.
పరుచూరితో చెప్పించారు
'సింహరాశి 2001లో వస్తే.. ఏవడైతే నాకేంటీ 2007లో వచ్చింది. ఈ కాలంలో రాజశేఖర్ నాతో సినిమాలు చేయాలని కథలు విని నా దగ్గరికి పంపించేవారు. అవి నాకు నచ్చకపోవడంతో చేయనని చెప్పేవాడిని. ఇలా నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఐదు సినిమాలు నా దగ్గరకి పంపించారు. దాంతో నేను చెబితే సముద్ర చేయనని చెప్పే స్థితికి వచ్చాడని రాజశేఖర్ భావించారు. ఆ నాలుగున్నర సంవత్సరాల్లో రాజశేఖర్‌కి ఒక్క సినిమా కూడా ఆడలేదు. నేను చెబితే వినడం లేదని మలయాళ సినిమా లయన్‌ని రీమేక్ చేయాలని పరుచూరి గోపాలకృష్ణ గారితో చెప్పించారు' అని సముద్ర గుర్తుచేసుకున్నారు.
60 శాతం మార్పులకు ఒప్పుకుంటేనే
'ఈ సినిమా ఖచ్చితంగా చేస్తానని, కానీ 60 శాతం మార్పులకు ఒప్పుకుంటేనే చేస్తానని కండీషన్ పెట్టాను. స్టోరీ సిట్టింగ్స్‌లో నేను చెప్పిన మార్పులకు రాజశేఖర్, జీవితగారు కూడా ఓకే చెప్పారు. ఇద్దరూ మంచి తెలివిగల వాళ్లు, మంచి నాలెడ్జ్ ఉంది స్టోరీ డిస్కషన్‌లో బాగా చర్చించేవాళ్లు. నాకు ఏది నచ్చితే అది చాలని రాజశేఖర్ గారికి నా మీద నమ్మకం.. సినిమా స్టార్ట్ చేశాక ఎవడైతే నాకేంటీ ఔట్‌పుట్ ఓ లెవల్‌లో వచ్చింది. ఫైనల్‌కు వచ్చేసరికి ఎవరో పుల్ల పెట్టేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేలా ఉంది, సముద్రను తొలగిస్తే డైరెక్టర్‌గా మన పేరు వేసుకోవచ్చని రాజశేఖర్, జీవితలు నిర్ణయించుకున్నారు' అని సముద్ర తెలిపారు.
రాజశేఖర్ ఓవరాక్టింగ్
'అప్పటి నుంచి రాజశేఖర్ సెట్‌లో ఓవరాక్టింగ్ చేయడం మొదలుపెట్టారు. షాట్, డైలాగ్, సీన్ బాలేదంటూ నన్ను ఇరిటేట్ చేస్తుంటే.. జీవిత గారు ఆయనను కూల్ చస్తున్నట్లు నటించేవారు. దాంతో ఈ సినిమాకు మీ పేరు వేసుకుంటానంటే వేసుకోండి, దాని కోసం ఒక మనిషిని బాధపెట్టొద్దని చెప్పి నేను వెళ్లిపోయా. కొంతమంది పెద్దలు రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో రాజశేఖర్, జీవితలు వెనక్కితగ్గి మళ్లీ నన్ను పిలిపించారు. మళ్లీ ఎలాగోలా పూర్తి చేశాక లాస్ట్‌లో మళ్లీ గొడవ పెట్టుకుని డైరెక్టర్‌గా వాళ్ల పేరు వేసుకున్నారు. డైరెక్టర్‌గా వాళ్లకొక పేరు రావాలి అనే జీవిత, రాజశేఖర్‌లు ఇలా చేశారు. వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ చాలా మంచోళ్లు.. ఇప్పటికీ వాళ్లతో సంబంధాలు బాగానే ఉన్నాయి. నేను బతికినంత కాలం రాజశేఖర్ గారంటే ఆ గౌరవం అలాగే ఉంటుంది' అని సముద్ర వెల్లడించారు.


Click it and Unblock the Notifications











