తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. పెళ్లయిన నాలుగేళ్లకు గుడ్‌న్యూస్
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ జంట గుడ్‌న్యూస్ చెప్పింది. పెళ్లయిన దాదాపు నాలుగేళ్ల తర్వాత తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించింది. కత్రినా గర్బం దాల్చినట్లుగా గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై భార్యాభర్తలిద్దరూ స్పందించలేదు. తాజాగా సెప్టెంబర్ 23వ తేదీన తాను తల్లిని కాబోతున్నట్లుగా కత్రినా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల ప్రేమ కథ కూడా సినిమాల్లో మాదిరిగానే జరిగింది. నిజానికి వీరిద్దరూ కనీసం ఒకే సినిమాలో కలిసి నటించలేదు. అయినప్పటికీ కత్రినా, విక్కీల మధ్య ప్రేమ చిగురించింది. తొలుత కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఓ షోలో విక్కీ కౌశల్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. అతనితో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను చెప్పింది కత్రినా కైఫ్.
అప్పటికి హీరోగా నిలదొక్కుకుంటున్న విక్కీ లాంటి నటుడితో సూపర్‌స్టార్ రేంజ్‌లో ఉన్న కత్రినా కలిసి నటించాలని అనుకోవడం బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఓ అవార్డ్ కార్యక్రమంలో తొలిసారిగా కత్రినా - విక్కీ కౌశల్‌లు కలుసుకున్నారు. ఆ సమయంలోనే కత్రినాతో పెళ్లి ప్రపోజల్ పెట్టాడట విక్కీ. అనంతరం ఇద్దరూ కలిసి సీక్రెట్‌గా పార్టీలకు వెళ్లడం, అవార్డ్ ఫంక్షన్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరగడం వంటి చర్యలతో కత్రినా, విక్కీ మధ్య ఏదో జరుగుతుందని బాలీవుడ్ మీడియాకి డౌట్ వచ్చింది.
అందరూ వీరి రిలేషన్‌పై వస్తున్న వార్తలను కొట్టేయగా.. ఊహాగానాలను నిజం చేస్తూ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌లు తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు బాంబు పేల్చారు. 2021 డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు మూడు రోజుల పాటు రాజస్థాన్‌లోని ఓ లగ్జరీ ప్యాలెస్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. అయితే పెళ్లయి దాదాపు నాలుగేళ్లు కావొస్తున్నా విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఎప్పుడు శుభవార్త చెబుతారని కుటుంబ సభ్యులు, సినీవర్గాలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కత్రినా కైఫ్ గర్భం దాల్చారంటూ పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా రెండ్రోజుల క్రితం ఆమె నిర్వహించిన ఫోటో షూట్ అనేక అనుమానాలకు తావిచ్చింది. అందులో కత్రినా కైఫ్ పొట్ట భాగం ముందుకు రావడంతో బేబీ బంప్‌తో ఫోటోషూట్ నిర్వహిస్తున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీటికి తెరదించుతూ కత్రినా - విక్కీ కౌశల్‌లు తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా ప్రకటించారు. తమ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైందని ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో కత్రినా కైఫ్ బేబీ బంప్‌ను విక్కీ చేతులతో తాకుతూ మురిసిపోతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విక్కీ కౌశల్. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ స్టార్ హీరోలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమాలో విక్కీ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











