అది నా ఫెయిల్యూరే.. తప్పు ఒప్పేసుకొన్న నిర్మాత నాగవంశీ
సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌తో టాలీవుడ్‌లో బడా నిర్మాతల్లో ఒకరిగా దూసుకెళ్తున్నారు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఏడాదికి ఖచ్చితంగా నాలుగైదు సినిమాలు తమ బ్యానర్‌లో ఉండేలా చూసుకుంటారు. ఇవికాక డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. సినిమాలతో వ్యాపారం అనేది అదృష్టం మీద, ప్రజల మీద ఆదరణ పడి ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా అడ్రస్ గల్లంతే. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఇందులో పెట్టుబడి పెడుతూనే ఉండాలి. లాభాలు వస్తే ఓకే కానీ భారీ నష్టాలు వస్తే తట్టుకోవడం కష్టం.
వార్ 2తో దెబ్బ
ఇటీవల యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌లు నటించిన వార్ 2ని తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ రిలీజ్ చేశారు. ఆంధ్రా, నైజాం హక్కులను ఏకంగా 90 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే వార్ 2 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నాగవంశీ పీకల్లోతు ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయారని, ఇల్లు అమ్ముకుని విదేశాలకు వెళ్లిపోయారంటూ చిత్రసీమలో పుకార్లు హల్‌చల్ చేశాయి.

లోక రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
అంతేకాదు.. సూర్యదేవర నాగవంశీ ఇకపై సినిమాలు నిర్మించరని, సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయరని వదంతులు వినిపించాయి. అయితే వీటన్నింటిని పటాపంచలు చేశారు సూర్యదేవర నాగవంశీ. ఎప్పటిలాగే డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాలు విడుదల చేస్తూ ఇలాంటి ఎదురుదెబ్బలు తనను ఏం చేయలేవని నిరూపించారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించి నిర్మించిన లోక చాప్టర్ 1 : చంద్ర సినిమా హక్కులు దక్కించుకున్న నాగవంశీ.. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.
100 కోట్ల క్లబ్‌లోకి లోక చాప్టర్ 1
డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ హీరోయిన్లుగా నటించారు. సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన హృదయపూర్వం థియేటర్‌లో ఉన్నప్పటికీ లోక కలెక్షన్స్ కుమ్మేస్తోంది. తెలుగులో అనివార్య కారణాలతో ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ చిన్నా, పెద్దా అందరినీ ఆకట్టుకుంటోంది. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. 7 రోజుల వరకు మలయాళంలో 40 కోట్ల రూపాయలు, తెలుగులో 7 కోట్ల రూపాయలు, తమిళంలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 48 కోట్ల రూపాయల వసూళ్లతో 100 కోట్లు సాధించి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించింది.
తప్పు నాదే
తాజాగా.. లోక చాప్టర్ 1 : చంద్ర మూవీ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ ఎమోషనల్ అయ్యారు. దుల్కర్ సల్మాన్ గారు ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇంత పెద్ద సినిమా తీశారు. ఇది మాకు చాలా చెడ్డ పేరు.. లక్కీభాస్కర్ సినిమాలో బ్యాంక్ సెట్ కోసం మేము ఎంత ఖర్చు చేశామో మీకు తెలియదని దుల్కర్‌తో చెప్పారు నాగవంశీ.
లోక చాప్టర్ 1 తెలుగు ఆడియన్స్‌కి అంతగా రీచ్ కాలేదని.. అది మా మిస్టేకే, ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు. అందుకని ఈ సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యేలోపు తెలుగు జనానికి ఓ మంచి సినిమా వచ్చింది, టెక్నికల్‌గా చాలా బాగా తీశారు, అందరూ ఖచ్చితంగా చూడండి అని చెప్పడానికి దుల్కర్ గారిని పిలిచాం. ఈ సినిమా ఖచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుందని, రిలీజ్ అయిపోయిన సినిమా గురించి చెబుతున్నామని తప్పుగా అనుకోవద్దు, ధైర్యంగా థియేటర్లకు వెళ్లండి అని నాగవంశీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











