ఓజీ టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ వార్నింగ్.. పోలీస్ శాఖ రంగంలోకి..!
సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ నటన, సుజీత్ టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. అమలాపురం టూ అమెరికా వరకు ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ఓజీ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అయితే ఈ సినిమా టికెట్ ధరలపై వివాదం నెలకొనగా.. తెలంగాణ హైకోర్ట్ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఓజీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు.

ఓజీపై భారీ అంచనాలు
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న రెండో సినిమా కావడం, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓజీ టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు అవకాశం కల్పిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఓజీ బెనిఫిట్ షో వేసుకోవడానికి, టికెట్ ధరను 1000 రూపాయల వరకు వసూలు చేసుకోవడానికి అనుమతించింది. సినిమా రిలీజైన నాటి నుంచి 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై 125 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. అలాగే మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్ ధరపై 150 రూపాయలు పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది.
ఓజీ టికెట్ ధరల పెంపునకు ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఓకే
తెలంగాణలో సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. నైజాంలో ఓజీ ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఓజీ టికెట్ ధరను పెంచుకోవడానికి అనుమతించింది. ఓజీ రిలీజైన తర్వాత 10 రోజుల పాటు తెలంగాణలో ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్‌లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 150 రూపాయలను అదనంగా పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టికెట్ ధరలపై కోర్టుకెక్కిన న్యాయవాది
అయితే తెలంగాణలో ఓజీ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ బర్ల మల్లేశ్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం టికెట్ ధరల పెంపును జీవోను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింగిల్ జడ్జి తీర్పును చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ హైకోర్టులో అప్పీల్ చేయడంతో దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. మరోసారి పిటిషన్‌ను విచారించాలని సింగిల్ జడ్జిని కోరింది. దీనిపై స్పందించిన సింగిల్ జడ్జి.. ఓజీ చిత్ర టికెట్ ధరల పెంపునకు సంబంధించి ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అలాగే విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేశారు.
కోర్ట్ ఆదేశాలు ధిక్కరణ
అయితే కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువరించినా కొన్ని ఏరియాలలో టికెట్ ధరలు భారీగా ఉన్నట్లుగా ప్రభుతం దృష్టికి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ ధరలను తక్షణమే తగ్గించాలని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను ఆదేశించింది. రాష్ట్రంలో ఓజీ సినిమా థియేటర్‌లలో టికెట్ ధరలపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను తెలంగాణ సర్కార్ ఆదేశించింది. తమ ఆదేశాలను ధిక్కరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు పోలీస్ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.


Click it and Unblock the Notifications











