Raavu Balasaraswathi Devi Death: తెలుగు సినిమా తొలి గాయని రావు బాలసరస్వతి దేవి కన్నుమూత
తెలుగు సినిమా తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి కన్నుమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో అక్టోబర్ 15వ తేదీన కన్నుమూశారు. ఆరేళ్ల చిరుప్రాయం నుంచే పాటలు పాడటం ప్రారంభించిన బాలసరస్వతి తన 90 ఏళ్ల కెరీర్‌లో 2000కు పైగా పాటలు పాడారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.

రావు బాలసరస్వతి ప్రస్థానం:
28 ఆగస్ట్ 1928న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించారు రావు బాలసరస్వతి దేవి. ఆమె అసలు పేరు సరస్వతి దేవి. అల్లతూరు సుబ్బయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకున్న ఆరేళ్ల వయసులోనే తన మాస్టర్ సహకారంతో గ్రామ్‌ఫోన్‌లో తన గాత్రాన్ని తొలిసారిగా సవరించింది. బాల్యంలోనే పాటలు పాడటంతో ఆమె పేరు కాస్తా బాల సరస్వతి దేవి అయ్యింది. బాలనటిగా గంగ అనే పేరుతో సీ. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన సతీ అనసూయ, భక్త ధ్రువ చిత్రాలలో నటించింది.
ఆమె ప్రతిభను గమనించిన దర్శకుడు కే.సుబ్రహ్మణ్యం తమిళ చిత్రాలలో నటించాలని ఆహ్వానించారు. దీంతో భక్త కుచేల, బాలయోగిని, తిరునీలకంఠార్, తుకారం తదితర చిత్రాలలో నటించారు. 1940లో గూడవల్ల రామబ్రహ్మం దర్శకత్వంలో వచ్చిన ఇల్లాలు చిత్రంలో ఎస్ రాజేశ్వరరావుకు జంటగా నటించారు. 1943లో వచ్చిన భాగ్యలక్ష్మీ చిత్రంలో తొలిసారిగా తిన్నే మీద సిన్నోడా పాట పాడారు రావు బాలసరస్వతి. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి నేపథ్య గానం.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తొలి తరం సంగీత దర్శకుల నుంచి ఆ తర్వాత వచ్చిన అందరు మ్యూజిక్ డైరెక్టర్లు, నేపథ్య గాయకులతో రావు బాలసరస్వతి కలిసి పనిచేశారు. 1980లో చివరి సారిగా సంఘం చెక్కిన శిల్పాలు చిత్రంలో పోయి రావే అమ్మ పోయి రావమ్మ అనే పాటను పాడారు. ఈ చిత్రానికి రమేశ్ నాయుడు సంగీత దర్శకత్వం వహించారు. 1935లో సతీ అనసూయలో బాలనటిగా కనిపించిన బాలసరస్వతి... 1948లో చివరిసారిగా బీఎన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన బిల్హణ చిత్రంలో నటించారు. తాను నటిని కావడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించారు బాలసరస్వతి.
అనంతరం నేపథ్య గాయనీగా స్థిరపడాలని అనుకున్నారు. అయితే వివాహం తర్వాత పాటకు కూడా ఆమె దూరమయ్యారు. చాలా ఏళ్లు మైసూరులోనే ఉన్న బాలసరస్వతి దేవి.. 1974లో తన భర్త మరణం తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చి అక్కడే స్థిరపడ్డారు. దీంతో నేపథ్య గాయనీగా తిరిగి రీ ఎంట్రీ కొన్ని పాటలు పాడారు. అయితే నేపథ్య గాయనీగా తన జీవితం పరిపూర్ణం కాలేదని... మధ్య మధ్యలో పడుతూ లేస్తూ సాగిందని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ జన్మంటూ ఉంటే గాయనీగానే పుడతానన్న బాలసరస్వతి దేవి.. పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించి 97 ఏళ్ల వయసులో తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆమె మరణంతో తెలుగు సినీ చరిత్రలో, సంగీత చరిత్రలో ఓ ఆధ్యాయం ముగిసినట్లయ్యింది. తెలుగు సినిమా పుట్టుక నుంచి శిఖరాగ్రాన్ని తాకిన ప్రతి అపూర్వ ఘట్టానికి సాక్షిగా ఉన్న ఓ దిగ్గజం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.


Click it and Unblock the Notifications











