Vijay: నన్ను టార్గెట్ చేయండి.. కార్యకర్తలను కాదు.. కరూర్ తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్
Vijay Karur stampede: తమిళనాడులోని కరూర్‌లో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. కరూర్ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పలువురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ నాలుగు రోజుల తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 30) స్పందించారు. ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
కరూర్ విషాదాన్ని జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని అత్యంత బాధాకరమైన సంఘటనగా అభివర్ణించారు. విజయ్ మాట్లాడుతూ "నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. నా గుండె ముక్కలైంది. మాటలు రావట్లేదు. కరూర్‌ను వెంటనే సందర్శించకపోవడానికి కారణం ప్రమాద స్థలానికి వెళ్లే.. పరిస్థితులు మరింత విషమిస్తాయనే భయం. కానీ త్వరలోనే బాధితులను కలుస్తాను. ఈ దుర్ఘటన వెనుక నిజాలు తప్పకుండా వెలుగులోకి వస్తాయి"అని అన్నారు. అలాగే ఆయన డీఎంకే ప్రభుత్వంపై నేరుగా విమర్శలు గుప్పించారు. "సీఎం సర్, మీకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటే నాపై చేయండి. కానీ నా సహచర నాయకులను వదిలేయండి. నాపై ఏ చర్యైనా తీసుకోవచ్చు, నేను సిద్ధంగా ఉన్నాను" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఘటన ఎలా జరిగింది?
సెప్టెంబర్ 27న కరూర్ సమీపంలోని వేలుసామిపురంలో విజయ్ మీట్ ది పీపుల్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు జరగాల్సిన సభ సుమారు మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైంది. విజయ్ రాత్రి 7 గంటలకు సభాస్థలికి చేరుకునే సరికి, గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనను చూడటానికి ఎగబడ్డారు. జనసమూహం వేదిక వైపు దూసుకెళ్లడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటుచేసుకుంది. కానీ క్రమంగా అది పెద్ద తొక్కిసలాటగా మారింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎంట్రీ పాయింట్ల వద్ద గందరగోళం ఈ విషాదానికి దారి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. మహిళలు, చిన్నారులు కూడా ఈ తొక్కిసలాటలో బలయ్యారు.
ప్రభుత్వం, ప్రతిపక్షం స్పందన
కరూర్ విషాదం తర్వాత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూర్ చేరుకుని సహాయక చర్యలను ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై రిటైర్డ్ జస్టిస్ అరుణ జగదీసన్ ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. "అనవసర వాదనలను వ్యాప్తి చేయకండి. విచారణ నివేదిక కోసం వేచి ఉండండి" అని సీఎం విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) మాత్రం డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. "41 మంది ప్రాణాలు కోల్పోవడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం. సరైన భద్రతా ఏర్పాట్లు ఉంటే ఈ విషాదం జరగేది కాదు" అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం విజయ్ రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











