ఆన్ లైన్లో లిక్కర్ కొనబోయిన సీనియర్ నటి.. దిమ్మతిరిగే షాకిచ్చారుగా!
కాదేది కవితకు అనర్హం అని ఒక మహాకవి అన్నట్టు ఎవరూ మోసపోవడానికి అతీతులు కాదని ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు నిరూపిస్తూనే ఉన్నారు. టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వచ్చాక టెక్నాలజీ పేరుతో మోసాలు కూడా ఎక్కువైపోయాయి. తాజాగా అలాంటి మోసం బారినపడిన ఒక సీనియర్ నటి తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాకు ఎక్కింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

మొన్న సురేష్ బాబు
టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వచ్చాక మోసం చేసేవారు, మోసపోయే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు టెక్ మోసగాళ్ల బారిన పడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా సురేష్ బాబు లాంటి నిర్మాతకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పిన మోసగాడి బారిన పడి లక్ష రూపాయలు కోల్పోయిన ఘటన మరువకముందే మరో నటి తాను మోసపోయాను అంటూ వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ నటి
బాలీవుడ్ నటి షబానా అజ్మీ అంటే దాదాపు అందరికీ పరిచయమే. హైదరాబాద్ లోనే పుట్ట పెరిగిన ఆమె తెలుగులో సినిమాలు చేయకపోయినా, ఆమె నటించిన చాలా సినిమాలు తెలుగు వారికి పరిచయమే. తాజాగా ఆమె ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా తాను మోసపోయినట్లుగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. షబానా అజ్మీ ముందుగా ఆన్ లైన్ లో ఆల్కహాల్ ఆర్డర్ చేసింది. గూగుల్ ద్వారా ఆమె సదరు ఫోన్ నెంబర్లు తీసుకుని వారి ద్వారా ఆర్డర్ చేసింది.

వాళ్ళు ఆల్కహాల్ తీసుకు రాలేదు
అయితే ఎంతసేపటికి డెలివరీ కాకపోవడంతో వాకబు చేసిన ఆమెకు మోసపోయాను అనే విషయం అర్థమైంది. దీంతో ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ''నేను మోసపోయాను లిక్కర్ కోసం నేను ముందుగానే డబ్బులు చెల్లించినా, వాళ్ళు ఆల్కహాల్ తీసుకు రాలేదు సరికదా నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తడం లేదని ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండా''లని ఆమె వెల్లడించారు.

ఫిర్యాదు చేశారా ? లేదా
దీంతో కొంత మంది యూజర్లు గూగుల్ లో ప్రదర్శించబడే చాలా ఫోన్ నెంబర్లు ఫ్రాడ్ ఫోన్ నెంబర్లుగా ఉంటాయని ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ఆమెకు సలహాలు ఇచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఆమె సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారా ? లేదా ? అన్న విషయాన్ని మాత్రం ఆమె ప్రస్తావించలేదు.

సినిమాల విషయానికి వస్తే
ఇక 70 ఏళ్ల ఈ నటి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే స్వరా భాస్కర్ అలాగే దివ్య దత్తా నటిస్తున్న లవ్ స్టోరీ 'షీర్ కుర్మా'లో కనిపించనుంది. అలాగే ఆమె గత ఏడాది జనవరిలో ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ వేలో కారు ప్రమాదానికి కూడా గురైంది. ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ వేలో కాలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ట్రాక్ వెనుకభాగంలోకి దూసుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాలేదు.


Click it and Unblock the Notifications











