Shilpa Shetty-Raj Kundra: 150 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్.. సెలబ్రిటీ కపుల్ పై ఈడీ ఛార్జిషీట్!
Shilpa Shetty- Raj Kundra:బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. పోర్న్ కంటెంట్ కేసుతో పాటు, ఆర్థిక నేరాలు, వివిధ బిజినెస్ ఫెయిల్యూర్స్ తర్వాత తాజాగా మరోసారి మనీ లాండరింగ్ కేసులో రాజ్ కుంద్రా నిలిచారు. ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అసలేం జరిగింది?
ED దాఖలు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం.. రాజ్ కుంద్రా సుమారు 285 బిట్‌కాయిన్స్ (ప్రస్తుతం విలువ రూ.150.47 కోట్లు) స్వీకరించారు. ఈ బిట్‌కాయిన్స్‌ను క్రిప్టో స్కామ్ మాస్టర్‌మైండ్ అమిత్ భరద్వాజ్ ఇచ్చారని ఈడీ తెలిపింది. ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫార్మ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వీటిని అందుకున్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ విఫలమైందని, అయినప్పటికీ కుంద్రా బిట్‌కాయిన్స్ తన వద్దే ఉంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

అసలు స్కామ్ ఎలా మొదలైంది?
బిట్‌కాయిన్ స్కామ్ మూలాలు 2017-18 మధ్య వెలుగులోకి వచ్చాయి. వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు అమిత్ భరద్వాజ్, ఆయన కుటుంబ సభ్యులు పెట్టుబడిదారులను బిట్‌కాయిన్ ద్వారా భారీ లాభాలు వస్తాయంటూ మోసగించారు. నెలకు 10% వరకు రిటర్న్స్ ఇస్తామని ఆశలు పెట్టారు. కానీ వాస్తవానికి పెట్టుబడిదారుల నుండి వసూలు చేసిన డబ్బును అక్రమంగా వాడి, ఆ బిట్‌కాయిన్స్‌ను అస్పష్టమైన
ఆన్‌లైన్ వాలెట్లలో దాచిపెట్టారు.
రాజ్ కుంద్రా వాదన ఏంటీ ?
ఈ డీల్‌లో తాను కేవలం మధ్యవర్తిగా వ్యవహరించానని రాజ్ కుంద్రా వాదించారు. అయితే, చార్జ్‌షీట్ ప్రకారం అసలు ఒప్పందం కుంద్రా - అమిత్ భరద్వాజ్ (మహేందర్ భరద్వాజ్) మధ్యే జరిగిందని, ఆయన వాదన సరైనది కాదని ఈడీ స్పష్టం చేసింది. 2018 నుంచి ఇప్పటివరకు పలు సార్లు అవకాశాలు ఇచ్చినా, కుంద్రా 285 బిట్‌కాయిన్స్ బదిలీ అయిన వాలెట్ చిరునామాలు ఇవ్వలేదని ఈడీ పేర్కొంది. అలాగే ఆయన సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేసినట్టు భావిస్తోంది.
శిల్పా శెట్టి పేరూ ఎక్కడొచ్చింది?
చార్జ్‌షీట్‌లో మరో కీలక అంశం బయటపడింది. రాజ్ కుంద్రా సంపాదించిన అక్రమ నిధులను చట్టబద్ధమైనవిగా చూపించేందుకు, నటి శిల్పా శెట్టి పేరుతో ఆర్థిక లావాదేవీలు జరిపారని ఈడీ పేర్కొంది. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు లావాదేవీ జరిపి, నిధుల మూలాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. ఇప్పటికే కుంద్రా - శిల్పా దంపతులు ఈడీ నోటీసులపై కోర్టులో స్టే పొందారు. అయితే తాజా చార్జ్‌షీట్ ఈ కేసుకు మరోసారి కీలక మలుపు తిప్పింది. రాజ్ కుంద్రా ఈ భారీ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారు? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అన్నది హాట్ టాపిక్ మారింది.


Click it and Unblock the Notifications











