Donky Flight అంటే ఏమిటి? షారుక్ ఖాన్ Dunki కథ అదేనా? గూగుల్‌లో నెటిజన్ల టాప్ సర్చ్!
బాలీవుడ్‌కు సుమారు నాలుగేళ్లు దూరమైన బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలను అంగీకరించడం తెలిసిందే. అట్లీ సినిమాతోపాటు యష్ రాజ్ ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రముఖ దర్శక, నిర్మాత రాజ్ కుమార్ హిరానీతో డంకీ అనే సినిమా చేస్తునాడు. ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని షారుక్, రాజ్ కుమార్ హిరాణి అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సినిమాకు డంకీ అనే టైటిల్ పెట్టడంపై ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది. దాంతో ఈ సినిమా టైటిల్‌కు అసలు అర్ధం ఏమిటనే విషయం గురించి గూగుల్‌లో విపరీతంగా సర్చ్ చేస్తున్నారు. ఇంతకు Dunki అంటే అర్ధం ఏమిటంటే?

షారుక్ ఖాన్ రిజెక్ట్ చేసిన సినిమాలు
గతంలో రాజ్ కుమార్ హిరాణి ఆఫర్లను షారుక్ ఖాన్ తిరస్కరించాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో నటించాలని హిరాణి అడిగితే.. ఏదో కారణంతో నో చెప్పాడు. అయితే ఆ సినిమాను సంజయ్ దత్ చేసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నాడు. ఇక పీకే సినిమాను కూడా ముందు షారుక్‌కే ఆఫర్ వచ్చింది. కానీ షారుక్ తిరస్కరించడంతో ఆ చిత్రం అమీర్ ఖాన్‌కు వెళ్లింది.

హిరాణి, షారుక్ క్రేజీ ప్రాజెక్ట్
ఇక ప్రస్తుతం షారుక్, రాజ్ కుమార్ ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం చేతులు కలిపారు. హిరాణితో కలిసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో తొలిసారి హిరాణి సినిమాతో భాగమయ్యాడు. షారుక్ ఖాన్ హీరోగా నటిస్తుండగా.. తాప్సీ పన్ను హీరోయిన్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు.

హిరాణి ఆఫీసులో షారుక్ అలా..
రాజ్‌కుమార్ హిరాణి ఆఫీస్‌లో షారుక్ ఖాన్.. పీకే, మున్నాభాయ్ ఎంబీబీఎస్, సంజూ సినిమా పోస్టర్లను చూస్తూ నిలబడుతాడు. వెనుక నుంచి రాజ్ కుమార్ హిరాణి వచ్చి.. ఏం చూస్తున్నావు.. షారుక్ అంటే.. పీకేలో అమీర్, మున్నాభాయ్‌లో సంజయ్ దత్, సంజూలో రణబీర్ కపూర్ ఐకానిక్ క్యారెక్టర్లు చేశారు. వాటిని చూస్తూ నిలుచున్నాను.. అలాంటి క్యారెక్టర్ తలపించే సినిమా కథ నా కోసం ఏదైనా మీ వద్ద ఉందా? అంటే.. అలాంటి స్క్రిప్ట్ నా వద్ద ఉందంటూ.. హిరాణి సమాధానం ఇచ్చాడు. దాంతో కామెడీ ఉందా? ఎమోషన్స్ ఉన్నాయా? నా తరహా రొమాన్స్ ఉందా అంటూ హిరాణిపై షారుక్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అయితే ఆ సినిమా పేరు డంకీ అంటూ హిరాణి జవాబిస్తాడు. డాంకీనా? అంటూ అదోలా షారుక్ ముఖం పెడుతాడు. డాంకీ కాదు.. డంకీ అంటూ నచ్చజెబుతాడు. అయితే డంకీ.. ఏం సినిమానో అర్ధం కావడం లేదు.. కానీ ఏదో ఒకటి చేసేయ్ అనుకొంటూ షారుక్ వెళ్లిపోతాడు. ఈ వీడియో డంకీ టైటిల్ లుక్.. అలాగే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం విశేషం.

డాంకీ ఫ్లయిట్ అంశంతో హిరాణి
ఇక రాజ్ కుమార్ హిరాణి విషయానికి వస్తే.. తన సినిమాల్లో సామాజిక రుగ్మతలను, సామాజిక సందేశాలతో చిత్రాలు నిర్మించడం తెలిసిందే. డంకీ సినిమా విషయానికి వస్తే.. సమాజంలోని డాంకీ ఫ్లయిట్ అనే అంశాన్ని తీసుకొని సోషల్ డ్రామాగా డంకీని రూపొందిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే డాంకీ ఫ్లయిట్ అనే విషయం ఏమిటని అందరిలో ఓ రకమైన ఆసక్తిని పెంచింది.
Donkey Flight అంటే ఏమిటి?
అయితే డాంకీ ఫ్లయిట్ అంటే.. పరాయి దేశంలోకి అక్రమంగా దొడ్డిదారిన వలసదారులు ప్రవేశించే పద్దతిని Donkey Flight అంటారు. చట్టబద్దంగా ఏదైనా దేశంలోకి ప్రవేశించిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఎలాగైనా సదరు దేశంలోకి వెళ్లాలనే పట్టుదలతో పలు దేశాల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతూ.. చిట్టచివరకు తాము కోరుకొన్న దేశంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని డాంకీ ఫ్లయిట్ అంటారు. అయితే అక్రమ వలసదారుడిగా పరాయిదేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించే పాత్రలో షారుక్ ఖాన్ నటించబోతున్నాడనేది స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











