Coolie North America and Overseas Collection: నార్త్ అమెరికాలో కూలీ కలెక్షన్స్.. రజనీ సరికొత్త చరిత్ర
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో విలన్‌గా నటించగా.. అమీర్‌ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షహర్, శృతిహాసన్ కీలకపాత్రలు పోషించారు. అడ్వాన్స్ బుకింగ్‌లోనే దుమ్మురేపిన కూలీ చిత్రం.. రిలీజ్ రోజున ప్రభంజనం సృష్టించింది. ఒక్కొక్క రికార్డును బద్ధలు కొడుతూ దూసుకెళ్తున్నారు రజనీ. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో కూలీ చిత్రం అరుదైన రికార్డును సాధించింది. ఈ వివరాల్లోకి వెళితే..
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా కూలీ విడుదలైంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి దాదాపు 350 కోట్ల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్‌లకు తోడు రజనీకాంత్ ఛరిష్మాతో కూలీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కూలీ ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఓవర్సీస్‌లోనూ కూలీ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. హంసినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ కూలీ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను 68 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. నార్త్ అమెరికాలో ప్రత్యంగీరా సినిమాస్, యూకేలో లైట్స్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో మాలిక్ స్ట్రీమ్స్ కార్పోరేషన్, మిడిల్ ఈస్ట్‌లో పరాస్ ఫిల్మ్స్ సంస్థలు కూలీని విడుదల చేస్తున్నాయి. మొత్తం రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ మూవీ భారత్ సహా దాదాపు 100కు పైగా దేశాల్లో రిలీజ్ అయ్యింది.
కూలీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర రజనీకాంత్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
నార్త్ అమెరికాలో కూలీ చరిత్ర
నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లోనే దాదాపు 2 మిలియన్ డాలర్లు రాబట్టిన కూలీ ఈ ఘనత సాధించిన తొలి తమిళ చిత్రంగా నిలిచింది. రిలీజ్ తర్వాత ఇదే ఊపును కొనసాగిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు రజనీకాంత్. నార్త్ అమెరికాను కూలీ మేనియా ఊపేస్తోంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 4.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 40 కోట్ల రూపాయలు) రాబట్టింది.
తాజాగా మూడో రోజు కూలీ చిత్రం నార్త్ అమెరికాలో మరో ఘనతను సాధించాడు రజనీకాంత్. మూడో రోజు నాటికి నార్త్ అమెరికాలో 5.4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 45 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు కూలీని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న ప్రత్యంగిరా మూవీస్ తెలిపింది. ఓవర్సీస్‌లోని మిగిలిన దేశాలైన యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, మిడిల్ ఈస్ట్ తదితర దేశాల్లో ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి.. మొత్తంగా ఓవర్సీస్‌లో 110 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాడు కూలీ.


Click it and Unblock the Notifications











