Kantara: Chapter 1 AP, TG Business: కాంతారా చాప్టర్ 1కు రికార్డ్ బిజినెస్.. రిషబ్ శెట్టి మూవీకి ఎన్ని కోట్లంటే
భారతీయ చిత్ర పరిశ్రమలో నిన్న మొన్నటి వరకు చిన్న పరిశ్రమగా ఉన్న కన్నడ ఇండస్ట్రీ రూపు రేఖల్ని సమూలంగా మార్చేసింది కేజీఎఫ్ ఫ్రాంఛైజీ. శాండిల్‌వుడ్ రేంజ్‌ను పెంచిన సినిమాలుగా నిలిచింది కేజీఎఫ్. దీనిని కంటిన్యూ చేస్తూ కన్నడ పరిశ్రమను మరో మెట్టు పైకి ఎక్కించింది కాంతార. నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం రూ.14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.450 కోట్ల వసూళ్లు సాధించింది. హోంబలే ఫిల్మ్స్‌కు వరుసగా మరో హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ కాదు ప్రీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు మేకర్స్. దీనిలో భాగంగా కాంతార చాప్టర్ 1 పేరుతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు రిషబ్ శెట్టి.
అక్టోబర్ 2న కాంతార 2
2023 నవంబర్‌లో కాంతార ప్రీక్వెల్ అధికారికంగా సెట్స్ మీదకి వెళ్లింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిషభ్ శెట్టి, జయరాంలు కీలకపాత్రలు పోషిస్తుండగా.. రుక్మీణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1ను విడుదల చేయనున్నారు. కన్నడంతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాంతార సెట్‌లో మరణాలు
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన నాటి నుంచి వరుస విఘ్నాలు ఎదురకావడంతో పాటు పలువురు యూనిట్ సభ్యులు చనిపోవడంతో ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. తొలుత జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల బృందంతో వెళ్తున్న బస్సు కర్ణాటకలోని ముడూరులో బోల్తాపడింది. ఈ ఘటనలో యూనిట్ సభ్యులంతా ప్రాణాలతో బయటపడినప్పటికీ.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకే గాలివాన, తుఫాన్ కారణంగా షూటింగ్ కోసం వేసిన సెట్ కుప్పకూలింది. అనంతరం కాంతారా చాప్టర్ 1లో భాగమైన కపిల్, రాకేష్ పూజారి, కళాభవన్ విజులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోవడంతో పంజుర్లి దేవత శాపం వల్లే ఇలా జరిగిందని కాంతారా 2 షూటింగ్‌ని నిలిపివేయాలని డిమాండ్స్ వినిపించాయి. అయితే అన్ని విఘ్నాలను దాటుకుంటూ కాంతార చాప్టర్ 1 షూటింగ్ ముగిసినట్లు ఇటీవల మేకర్స్.. ఓ మేకింగ్ వీడియోతో వెల్లడించారు.
రిషభ్ శెట్టికి 100 కోట్ల రెమ్యునరేషన్
ఇక కాంతార 2 కోసం రిషభ్ శెట్టి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా శాండిల్‌వుడ్‌లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం బట్టి రిషభ్ దాదాపు రూ.100 కోట్ల వరకు పారితోషికం కింద అందుకుంటున్నాడట. రూ.50 కోట్లను పారితోషికంగా.. మరో రూ.50 కోట్లు లాభాల్లో వాటా రూపంలో ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోవైపు.. కాంతార చాప్టర్ 1 ఇంకా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా ఓ రేంజ్‌లో ప్రీ బిజినెస్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో కళ్లు చెదిరే ధరకు దక్కించుకుందని టాక్.
కాంతారాకు రికార్డ్ బిజినెస్
ఇక కాంతారను కన్నడిగులతో పాటు తెలుగు ప్రజలు కూడా బాగానే ఆదరించారు. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1పైనా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ ఉన్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. ఇది టాలీవుడ్‌లోని టైర్ 1 హీరోతో సమానమైన బిజినెస్. దీంతో ఓ కన్నడ నటుడు తెలుగు స్టార్ హీరోలను మించిన రేంజ్‌లో బిజినెస్ చేశాడంటూ రిషబ్ శెట్టిని నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











