OG Collection: బెజవాడను కమ్మేసిన ఓజీ తుఫాన్.. ప్రీమియర్ షో కలెక్షన్స్‌లో పవన్ సరికొత్త చరిత్ర
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓజీ మేనియా నెలకొంది. విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ సినిమా అనేక రికార్డుల్ని కొల్లగొడుతోంది. తాజాగా తెలుగు సినిమాకు రాజధాని విజయవాడలో ఓజీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఓజీ బడ్జెట్ ఎంత?
ఓజీలో ప్రియాంక మోహన్ ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త చరిత్ర
పవన్ కళ్యాణ్ లుక్స్, సుజిత్ టేకింగ్, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్ని అంశాలు ఓజీపై అంచనాలను పెంచేస్తున్నాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా దుమ్మురేపుతోంది. యూఎస్ ప్రీమియర్స్, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా కలిపి ఇప్పటికే ఓజీ చిత్రం 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టగా.. తొలి రోజు 100 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్‌లో 3.3 మిలియన్ డాలర్ల వసూలు కాగా.. ఇందులో ఒక్క నార్త్ అమెరికా వాటాయే 2.3 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఇండియాలో ప్రీమియర్స్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 40 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలలో ప్రీమియర్ షో టికెట్ ధర 1000 రూపాయలు కావడంతో అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లలో ఈ ప్రభావం కనిపిస్తోంది.
ఓవర్సీస్‌లో వసూళ్ల ప్రభంజనం
ఇక ఓవర్సీస్‌లో బుకింగ్స్ ఓపెన్ అయినప్పటి నుంచే ఓజీ సంచలనాలు నమోదు చేస్తోంది. నార్త్ అమెరికాతో పాటు యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాలలో ఓజీకి అడ్వాన్స్ బుకింగ్‌తోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రిజిస్టర్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా తొలి రోజు ఓజీ చిత్రం ఓవర్సీస్‌లో 40 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రం 80 కోట్ల రూపాయల షేర్, 160 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టవచ్చని భావిస్తున్నారు.
విజయవాడలో ఓజీ రికార్డ్
ఇదిలాఉండగా.. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం తెలుగు సినిమాకు ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడ నగరంలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సిటీ వ్యాప్తంగా ఉన్న థియేటర్‌లలో బెనిఫిట్, ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. బుధవారం ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే విజయవాడలో ప్రీమియర్స్, బెనిఫిట్ షోల ద్వారా ఓజీకి 1.24 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలాంటి ఘనత సాధించిన తొలి సినిమాగా ఓజీ నిలిచింది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రేంజ్‌ను ఎవ్వరూ అందుకోలేరని కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











