War 2 Day 5 Collections: దారుణంగా క్షీణించిన వార్ 2 కలెక్షన్లు.. ఎన్టీఆర్ మూవీ నష్టాల నుంచి బయటపడాలంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందింది. వార్ 2 సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా గత 4 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 5వ రోజు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు రాబడుతుందనే వివరాల్లోకి వెళితే..
టైగర్ ష్రాఫ్, హృతిక్ కాంబినేషన్‌లో వచ్చిన వార్ చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్‌గా రూపొందిన వార్ 2పై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ సినిమాను తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నిర్మాత నాగవంశీ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు. గతంలో దేవర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నాగవంశీ.. ఈ సినిమాకు భారీగా, ఫ్యాన్సీ రేటును చెల్లించి థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకొన్నట్టు సమాచారం. వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సుమారుగా 90 కోట్ల (అదనంగా జీఎస్టీ) కు దక్కించుకొన్నారు. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి 105 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి ) అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నైజాం హక్కులను సుమారుగా 35 కోట్ల రూపాయలు, ఆంధ్రా 20 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 18 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ పరంగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 90 కోట్ల రూపాయల షేర్, 180 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమా పూర్తిగా నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా వసూళ్లు కేవలం ఎన్టీఆర్ స్టామినా మీదే ఓపెనింగ్స్ వచ్చాయి. గత 4 రోజుల్లో ఈ సినిమా నైజాంలో 13 కోట్లు, సీడెడ్‌లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.5 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 3.5 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 2.5 కోట్లు, గుంటూరులో 4.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 3.5 కోట్లు, నెల్లూరులో 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 42 కోట్ల రూపాయల షేర్.. 56 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ప్రతీ సినిమాకు అగ్ని పరీక్షగా మారే తొలి సోమవారం వార్ 2 సినిమాకు కూడా అదే ఫలితాన్ని శాసించేలా ఉంది. ఈ సినిమా ఇండియా వైడ్ సుమారుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం ఇండియా వైడ్ 210 కోట్ల రూపాయల నెట్, 270 కోట్ల గ్రాస్ వసూలు నమోదు చేసే అవకాశం ఉంది.
వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయల గ్రాస్, 300 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమా ఇప్పటి వరకు సుమారుగా 300 కోట్ల గ్రాస్‌కు చేరువైంది. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 300 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











