ఆచార్య మూవీకి శాటిలైట్ షాక్.. కాజల్ అగర్వాల్‌ను సాకుగా చూపి.. అలాంటి దెబ్బ!
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని నమోదు చేసుకొన్నది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడం చాలా మందికి తలనొప్పులు తీసుకొచ్చింది. ఈ సినిమా రిలీజై రెండు నెలలు దాటినా ,వివాదాల తీరు మాత్రం తగ్గలేదు. ఇంకా ఈ సినిమాను పలు వివాదాలను వెంటాడుతూనే ఉన్నాయి. తాజా మీడియా రిపోర్టుల ప్రకారం.. ఆచార్య శాటిలైట్ బిజినెస్ విషయంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్ పెట్టిన పేచీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. అయితే ఆచార్యకు టెలివిజన్ ఛానెల్ మధ్య చోటు చేసుకొన్న వివాదం ఏమిటంటే?

చిరంజీవి కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా
రాంచరణ్, చిరంజీవి కాంబినేషన్ ఆచార్య వస్తుందనే విషయం అభిమానుల్లో భారీ అంచనాలు నింపింది. అయితే ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండటంతో ఆచార్య చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే కాకుండా ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. డిస్టిబ్యూటర్లను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది.

చిరంజీవి, కొరటాల శివ అలాంటి ప్రయత్నం
ఆచార్య చిత్రంతో తీవ్ర కష్టాల్లో పడిన డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లను దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి ఆదుకొనే ప్రయత్నం చేయడంతో ఇండస్ట్రీలో హర్షం వ్యక్తమైంది. కొరటాల, చిరు తమ రెమ్యునరేషన్లను తిరిగి ఇచ్చేసి.. వారికి కలిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇంకా ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.

టెలివిజన్ ఛానెల్ అలాంటి మెలిక
ఆచార్య సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకొన్న ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ తాజాగా సరికొత్త మెలిక పెట్టినట్టు ఇండస్ట్రీలోను, మీడియాలోను ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించి టాక్ బాగా లేకపోవడం వల్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి సంస్థలు ముందుకు రావడం లేదని, దాంతో సదరు టెలివిజన్ ఛానెల్ కొనుగోలు చేసిన మొత్తంలో సగం వరకు కోత పెట్టేందుకు సిద్దమైనట్టు సమాచారం.

కాజల్ అగర్వాల్ మరోసారి వివాదంలోకి
అయితే ఆచార్య సినిమా శాటిలైట్ బిజినెస్ సమయంలో కాజల్ అగర్వాల్ కూడా ఓ హీరోయిన్‌గా ఉంది. దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా 15 కోట్ల రేంజ్‌లో జరిగింది. రిలీజ్‌కు ముందు జరిగిన మార్పులు, చేర్పుల కారణంగా కాజల్ పాత్రను ఎత్తివేయడం తెలిసిందే. అయితే అప్పుడు కాజల్ ఉంది.. ఇప్పుడు ఆమె లేదు అనే పాయింట్ ఎత్తి చూపుతున్నట్టు సమాచారం.

సగానికి సగం తగ్గించేస్తాం
అయితే అగ్రిమెంట్ సమయంలో ఉన్న అంశాలకు, ఆ తర్వాత ఉన్న విషయాలకు చాలా తేడా ఉంది. కాబట్టి 15 కోట్ల కాకుండా తాము 7.5 కోట్లు మాత్రమే చెల్లిస్తామని సదరు ఛానెల్ మెలికపెట్టినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఒకవేళ ఆ మొత్తం ఇష్టం లేకపోతే సినిమా శాటిలైట్ బిజినెస్ అగ్రిమెంట్‌ను వెనుక్కి తీసుకొందాం అనే ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చినట్టు తెలిసింది.

కాజల్ అగర్వాల్ వ్యాల్యూ ఆ రేంజా?
అయితే ఆచార్య సినిమా పరిస్థితిని చూసి సదరు ఛానెల్ అడ్వాంటేజ్ తీసుకొంటున్నది. కాజల్ అగర్వాల్‌ను సాకుగా చూపి 7.5 కోట్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిజినెస్‌లో కాజల్ అగర్వాల్ వ్యాల్యూ అంత మొత్తమా అంటూ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నారు. అయితే ఈ వివాదంపై అటు యూనిట్ గానీ.. ఛానెల్ నిర్వాహకులు గానీ.. గుంభనంగా వ్యవహరించడంతో అసలేం జరుగుతున్నదనే ప్రశ్నగా మారింది.


Click it and Unblock the Notifications











