ఎన్టీఆర్ కెరీర్‌పై భారీ దెబ్బ.. వార్ 2 డిజాస్టర్‌తో ముఖం చాటేసిన నిర్మాత
ఎవరు ఔనన్నా కాదన్నా సినీ పరిశ్రమ సక్సెస్ వెంటే పరుగులు తీస్తుంది. ఓడిపోయిన వారికి ఇక్కడ స్థానం లేదు. నెంబర్ గేమ్‌లో అనుక్షణం పరుగులు తీయాల్సిందే.. ఏమాత్రం తేడా వచ్చినా అడ్రస్ గల్లంతే. ఈ విషయం స్టార్లకు కూడా తెలియనిది కాదు. ఎన్నో హిట్లు కొట్టి, రికార్డులు సృష్టించిన సూపర్‌స్టార్లు కూడా ఒక్క ఫ్లాప్ ఇవ్వగానే అడ్రస్ లేకుండా పోయారు. ఇక్కడ పూలు పడిన చోటే.. రాళ్లు పడుతుంటాయి, జేజేలు కొట్టినవారే.. ఎత్తి కిందపడేస్తారు. తాజాగా ఇలాంటి పరిస్ధితేనే ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ వివరాల్లోకి వెళితే..
వరుస విజయాలతో దూకుడు మీద
నందమూరి బ్యాక్‌గ్రౌండ్, తన కష్టంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, లవ్ ఇలా జోనర్‌లోనైనా నటించగలడని.. ఎలాంటి ఎమోషన్ అయినా ఇరగదీయగలనని ఎన్టీఆర్ నిరూపించుకున్నారు. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద నిలకడగా హిట్లు కొడుతున్నారు తారక్. టెంపర్ నుంచి మొదలుపెడితే.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర వరకు వరుసపెట్టి విజయాలు సాధిస్తూ వస్తున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సాధించిన ఎన్టీఆర్.. బాలీవుడ్‌లోనూ ఓ చూపు చూద్దామనే ఉద్దేశంతో చేసిన చిత్రమే వార్ 2.

హృతిక్‌తో స్క్రీన్ షేర్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గతంలో వచ్చిన హిట్ మూవీ వార్ కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. వార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. అశుతోష్ రాణా, అనిల్ కపూర్, దిశిత సెహగల్, వరుణ్ బదోలా, సోని రజ్దాన్ తదితరులు వార్ 2 లో కీలకపాత్రలు పోషించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వార్ 2 చిత్రాన్ని నిర్మించారు.
భారీ డిజాస్టర్ దిశగా వార్ 2
వార్ 2 బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. 13 రోజుల వరకు ఇండియాలో 225 కోట్ల నెట్, 269 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 76 కోట్ల వసూళ్లతో కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 345 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే వార్ 2 ముందు భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. దీంతో వార్ 2 థియేట్రికల్ రన్ ముగిసేనాటికి ఏకంగా 200 కోట్ల రూపాయల గ్రాస్.. 120 కోట్ల రూపాయల షేర్ చొప్పున నష్టాలు మూటకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ బాలీవుడ్ ఆశలపై నీళ్లు
అయితే వార్ 2 ఫెయిల్యూర్ కారణంగా బాలీవుడ్‌లో గట్టిగా జెండా పాతాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆశలు ఆవిరయ్యాయి. వార్ 2 బ్లాక్‌బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఈ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా.. తన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్ పోషించిన ఏజెంట్ విక్రమ్ చలపతి పాత్రను భాగం చేయాలనుకున్నారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్‌కు ఎప్పుడో ఆయన హామీ కూడా ఇచ్చారు. అయితే వార్ 2 ఈ అంచనాలను తప్పింది. దీంతో ఆయన వార్ 3తో పాటు ఆదిత్య చోప్రా నిర్మించాలనుకున్న స్పై మూవీస్ కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
విక్రమ్ చలపతి రోల్‌పై ఆదిత్య చోప్రా కీలక నిర్ణయం
విక్రమ్ చలపతి పాత్ర ఇక ఉండదని నేరుగా ఎన్టీఆర్‌కే ఆదిత్య చోప్రా చెప్పినట్లుగా బాలీవుడ్ టాక్. దీంతో తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ క్రిస్మస్‌కు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఆల్ఫాపై ఆదిత్య చోప్రా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆలియా భట్, శార్వరీలు నటించిన ఈ సినిమా రిజల్ట్ ఆధారంగా తన స్పై యూనివర్స్‌ను కొనసాగించాలా? వద్దా? అన్నది ఆదిత్య చోప్రా నిర్ణయించుకుంటారని బీటౌన్ టాక్. మరి నిజంగానే ఎన్టీఆర్ పోషించిన విక్రమ్ చలపతి పాత్రను పక్కన పెట్టేశారా? ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











