Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్.. బాలీవుడ్ స్టార్ హీరోతో దిల్ రాజ్ డీల్!
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు మరో భాషలో రీమేక్ చేయడం అనవాయితీ గా వస్తుంది. అలా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి ప్రధాన భాషల్లో సక్సెస్ అయినా సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ అయినా సందర్భాలెన్నో.. అయితే గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత రీమేక్‌ల కంటే డబ్బింగ్ ట్రెండ్ పెరిగింది. ఒకే సినిమాను అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం సాధారణమైంది. అయినప్పటికీ, కొన్ని సినిమాలను లోకల్ కలర్, నేటివిటీ దగ్గర చూపించాలని అలాంటి సినిమాలను రీమేక్ చేస్తుంటారు. అలా.. ఇప్పుడు టాలీవుడ్‌లో రికార్డులు సృష్టించిన ఆ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని బాలీవుడ్‌లో ప్రముఖ హీరో రీమేక్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఈ సినిమా ఏంటీ?
ఆ సినిమా ఏంటో కాదు.. టాలీవుడ్‌లో ఘన విజయాన్ని సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఇప్పుడు బాలీవుడ్ రీమేక్‌గా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. 2025 సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయాలని మేకర్స్ నిర్ణయించారట. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ డిల్ రాజ్ అక్షయ్ కుమార్ ను సంప్రదించినట్టు ఇండస్ట్రీ టాక్.

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను అక్షయ్ కుమార్ తన స్టైల్‌లో రీ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సౌత్‌లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేసి, విజయం సాధించడం అంటే.. అక్షయ్ కుమార్‌కి ఇది ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇప్పటికే అక్షయ్ కుమార్ 'భూల్ భులయ్యా', 'రౌడీ రాథోర్', 'లక్ష్మీ' వంటి సౌత్ రీమేక్‌లతో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ రీమేక్‌కు ఒరిజినల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్వయంగా హిందీలోనూ నిర్మాతగా వ్యవహరించనున్నారట.
ప్రస్తుతం ఆయన బాలీవుడ్ టీమ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే దర్శకుడు మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంలేదని తెలుస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లో నైపుణ్యం ఉన్న కొత్త దర్శకుడిని ఎంపిక చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. బాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక మార్పులు స్క్రిప్ట్‌లో చేయనున్నారని టాక్. హిందీ ప్రేక్షకుల నేటివిటీకి తగిన సన్నివేశాలు, డైలాగులు జోడించాలని భావిస్తున్నారట. అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందని సమాచారం.
'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి ప్యూర్ ఫ్యామిలీ కామెడీ సినిమాను హిందీ ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారో చూడాలి. గతంలో 'రెడీ', 'బాడీగార్డ్' వంటి సౌత్ రీమేక్‌లు బాలీవుడ్‌లో భారీ విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయ్. ఇప్పుడు అక్షయ్ కుమార్ - దిల్ రాజు కాంబినేషన్ అదే మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందా? అన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. 'సంక్రాంతికి వస్తున్నాం' హిందీ రీమేక్ బాలీవుడ్‌లో మరో బిగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందా? లేదా? అన్నది కూడా చర్చనీయంగా మారింది.


Click it and Unblock the Notifications











