ఆ స్టార్ కిడ్ సరసన హీరోయిన్‌గా మహేష్ కూతురు.. భారీ ప్లానింగ్‌తో సూపర్‌స్టార్!
దేశంలోని అన్ని ఇండస్ట్రీలలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు తమ వారసులను సినీ పరిశ్రమకు పరిచయం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదో రకంగా తమ వారసుల కెరీర్ నిలబెట్టి తాము రిటైర్ అవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారు. కనీసం లాంచింగ్ ప్యాడ్‌గా తమ పరపతిని ఉపయోగిస్తే.. పిల్లలు తమ ప్రతిభతో నిలదొక్కుకుంటారని భావించేవారు లేకపోలేదు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ.. తన వారసుడిని పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
కొత్త టాలెంట్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన తేజ
చిత్రం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తేజ.. అంతకుముందు కెమెరామెన్‌గా, అసిస్టింట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అత్యంత సన్నిహితుడిగా తేజ గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగా చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాశారు. పెద్ద హీరోలు, భారీ స్టార్ క్యాస్టింగ్‌ను పక్కనపెట్టి కొత్త టాలెంట్‌ను చిత్ర సీమకు పరిచయం చేశారు తేజ. ఆయన స్కూల్ నుంచి ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు.

కుమారుడి కోసం కసరత్తు
చిత్రం, నువ్వునేను, జయం, లక్ష్మీకళ్యాణం, నిజం, నీకు నాకు డాష్ డాష్, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో తేజ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం తన స్పీడ్ కొంచెం తగ్గించినప్పటికీ తేజ మార్క్ అలాగే ఉంది. సరైన హిట్ పడితే తేజ తిరిగి గత వైభవాన్ని పొందడం పెద్ద కష్టం కాదు. భారీ హిట్ కొట్టి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాలని తేజ సైతం కసిగా ఉన్నారు. ఇదే సమయంలో తన కుమారుడు అమితవ్‌ను చిత్రసీమకు పరిచయం చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నారు.
పీరియాడికల్ స్టోరీతో తేజ
దీనికి సంబంధించి రెండేళ్ల క్రితమే తేజ కసరత్తు మొదలుపెట్టేశారు. పీరియాడికల్ ఎపిక్ లవ్‌స్టోరీగా విక్రమాదిత్యను రూపొందిస్తున్నట్లు గతంలోనే ఆయన తెలిపారు. 18వ శతాబ్ధంలో నడిచే ఈ ప్రేమ కథ ద్వారానే కొడుకును లాంచ్ చేయాలని తేజ భావిస్తున్నారు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఆయన గతంలోనే విడుదల చేశారు. అమితవ్ డెబ్యూ మూవీని తేజ ఎట్టి పరిస్ధితుల్లోనూ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే హీరోయిన్ ఎవరు? కొత్త అమ్మాయిని తీసుకుంటారా? లేక ఆల్రెడీ ఉన్న వారినే ఎంపిక చేస్తారా? అంటూ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో అమితవ్ సరసన టాలీవుడ్‌లో ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయి హీరోయిన్‌గా నటించనుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హీరోయిన్‌గా ఆ స్టార్ కిడ్
దిగ్గజ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు కుమార్తె అయిన భారతిని హీరోయిన్‌గా పరియం చేయాలని ఘట్టమనేని ఫ్యామిలీ భావిస్తోందట. ఎందరో హీరోయిన్లను చిత్ర సీమకు పరిచయం చేసి స్టార్లను చేసిన దర్శకుడు తేజ చేతుల మీదుగానే భారతిని హీరోయిన్‌ను చేయాలని సూపర్‌స్టార్ కుటుంబం అనుకుంటుందట. ఇప్పటికే రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణను కూడా హీరోగా పరిచయం చేయాలని ఘట్టమనేని కుటుంబం భావిస్తోంది. తాజాగా భారతి కెరీర్‌ను కూడా గాడిన పెట్టాలని కసరత్తు చేస్తున్నారు. వీరి బాధ్యతను సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన భుజాలపై వేసుకున్నారని.. ఆయన చేతుల మీదుగానే జయకృష్ణ, భారతీలను టాలీవుడ్‌కు పరిచయం చేస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











