ఘట్టమనేని వారసుడి లాంచింగ్.. జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు?
తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా, సాహసానికి, మంచితనానికి మారుపేరుగా నిలిచారు నటశేఖర, సూపర్‌స్టార్ కృష్ణ. 5 దశాబ్ధాలకు పైగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. జేమ్స్‌బాండ్‌గా, కౌబాయ్‌గా, అల్లూరి సీతారామరాజుగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు కృష్ణ. అందరు నటుల మాదిరిగానే ఆయన కూడా తన పిల్లలను సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించారు. కృష్ణ ఐదుగురి సంతానంలో పెద్ద కుమారుడు రమేశ్ బాబు, రెండో కుమారుడు మంజుల, చిన్నకుమారుడు మహేశ్ బాబుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
తండ్రి పేరు నిలబెట్టిన మహేశ్ బాబు
వీరిలో రమేశ్ బాబు హీరోగా సక్సెస్ కాలేక ఒకటి , రెండు సినిమాలతోనే కెరీర్‌ను ముగించి నిర్మాతగా స్థిరపడి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత మంజులను హీరోయిన్‌గా తీసుకురావాలని కృష్ణ అనుకున్నప్పటికీ.. అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో తన ఆలోచనను ఆయన విరమించుకున్నారు. అయితే తండ్రి కలను నెరవేర్చారు మహేశ్ బాబు. రాజకుమారుడు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. విభిన్న సినిమాలతో ప్రిన్స్‌గా, సూపర్‌స్టార్‌గా ఎదిగి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు.

ఘట్టమనేని మూడో తరం రెడీ
ఇప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం సిద్ధమైంది. మహేశ్ పిల్లలు గౌతమ్, సితారలు పెరిగి పెద్దయ్యారు.. ఇప్పటికే వీరికి భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మహేశ్ ఎప్పుడెప్పుడు తన పిల్లల్ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం నటుడిగా ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు పిల్లలు ఎంట్రీ ఇవ్వనున్నారు. రమేశ్ కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని, కుమార్తె భారతీలను గ్రాండ్‌గా లాంచ్ చేసే బాధ్యతను మహేశ్ బాబు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
హీరోగా రమేశ్ బాబు కుమారుడు
దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కుతోన్న సినిమాలో భారతీని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే జయకృష్ణను హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే మహేశ్ కథను ఫైనల్ చేసి దర్శకుడిని కూడా ఎంపిక చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణను హీరోగా లాంచ్ చేయనున్నారని ఫిలింనగర్ టాక్. అంతేకాదు.. మహేశ్ బాబును టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత అశ్వినీదత్.. జయకృష్ణను కూడా లాంచ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
జయకృష్ణకు జోడీగా ఆ హీరోయిన్ కూతురు
మరోవైపు.. జయకృష్ణ సరసన హీరోయిన్ ఎవరు? కొత్త వారిని తీసుకుంటారా? లేక సీనియర్ హీరోయిన్‌ని తీసుకుంటారా? అన్న చర్చ నడిచింది. దీనికి చెక్ పెడుతూ అలనాటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తదానీ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టనుందని వార్తలు వస్తున్నాయి. రషా ఇప్పటికే బాలీవుడ్‌లో ఆజాద్ అనే సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ యువతలో భారీ క్రేజ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.. జయకృష్ణ పర్సనాలిటీకి తోడు ఘట్టమనేని బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్లుగా రషా ఉంటుందని భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











