యంగ్ హీరోయిన్ కు క్రికెటర్ విడాకులు.. ముచ్చటగా మూడోసారి డివోర్స్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ క్రికెట్, ఆట కంటే కూడా తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తున్నాడు. వయసు పైబడటంతో పాటు నిలకడ లేకపోవడంతో ఆయన తరచుగా జట్టులో స్థానం కోల్పోతున్నారు. 42 ఏళ్ల మాలిక్ ఇప్పటికే టెస్ట్, వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపో మాపో టీ 20 కెరీర్‌కు కూడా ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజాగా షోయబ్ మాలిక వైవాహిక జీవితం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ వివరాల్లోకి వెళితే..
టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్
పాకిస్తాన్‌లోని సియాల్ కోట్‌కు చెందిన షోయబ్ మాలిక్ తొలిసారిగా ఓ స్వదేశీ సిరీస్ కోసం 1999లో పాక్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. సక్లయిన్ ముస్తక్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన అతను తన ఆటతీరుతో అదే ఏడాది షార్జాలో జరిగిన కోకాకోలా ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు. 2001లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాలిక్ తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. 35 టెస్టుల్లో 1898 పరుగులు.. 287 వన్డేలలో 7,534 పరుగులు.. 124 టీ 20లలో 2435 పరుగులు చేశాడు. చివరిసారిగా దుబాయ్ వేదికగా 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన మాలిక్ మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించినా మాలిక్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

అయేషా సిద్ధిఖీతో రహస్యంగా పెళ్లి
ఇక కెరీర్ పరంగా పక్కనబెడితే.. వ్యక్తిగత జీవితంలోనూ మాలిక్ తీరు అనేక వివాదాలకు కారణమైంది. హైదరాబాద్‌కే చెందిన అయేసా సిద్ధిఖీని రహస్యంగా పెళ్లాడాడు. ఆ తర్వాత 2010లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మధ్యలో బాలీవుడ్ నటి, మోడల్ సయాలీ భగత్‌తో షోయబ్ మాలిక్ పీకల్లోతు ప్రేమాయణం సాగించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. పెళ్లి వరకు వీరి బంధం వెళ్లగా.. భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాతో షోయబ్ మాలిక్ ఎంగేజ్‌మెంట్ గురించి వార్తలు రావడంతో షోయబ్- సయాలీలు విడిపోయినట్లు చెబుతారు.
సానియా మీర్జాతో పెళ్లి, విడాకులు
సానియా మీర్జాను పెళ్లాడిన అనంతరం కొన్నాళ్లు వీరి బంధం సజావుగానే సాగింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున మాలిక్ ప్రాతినిథ్యం వహించగా.. భారత్ తరపున టెన్నిస్‌లో పలు విజయాలు సాధించారు సానియా మీర్జా. ఇద్దరూ దుబాయ్‌లో కొన్నాళ్లు ఉన్నారు. ఈ దంపతులకు కుమారుడు ఇజాన్ మీర్జా ఉన్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ 14 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ సానియా మీర్జా - షోయబ్ మాలిక్‌లు విడాకులు తీసుకున్నారు. దాంతో నాటి నుంచి సానియా హైదరాబాద్‌లో తన తల్లిదండ్రులతోనే బిడ్డతో కలిసి ఉంటుండగా.. షోయబ్ జట్టులో స్థానం కోసం కిందా మీదా పడుతున్నాడు.
సనా జావేద్‌కు విడాకుల దిశగా
సానియాకు విడాకులు ఇచ్చిన కొద్దిరోజులకు పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లాడి షాకిచ్చాడు. ఆశ్చర్యకరంగా షోయబ్ మాలిక్ మాజీ భార్యలు అయేషా, సానియాలు హైదరాబాద్‌కు చెందిన వారే కాగా.. మూడో భార్య పూర్వీకులది హైదరాబాద్ ప్రాంతం కావడం గమనార్హం. సనా పూర్వీకులు దేశ విభజనకు ముందు కాశ్మీర్‌కు వలస వెళ్లి, భారత్ - పాకిస్తాన్ విభజన సమయంలో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లారు. అనంతరం సనా తల్లిదండ్రులు సౌదీ అరేబియాలో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టారు.
2020లో సినీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌తో తొలుత సనాకు వివాహం జరిగింది. అయితే కొంతకాలానికి అతనితో బంధాన్ని తెంచుకుని మాలిక్‌కు దగ్గరై అతనిని పెళ్లాడింది. నిన్న మొన్నటి వరకు వీరిద్దరి బంధం బాగానే ఉంది.. అయితే కొద్దిరోజుల క్రితం షోయబ్ మాలిక్‌కు పాక్‌లోని టాప్ మోడళ్లు, సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయని వార్తలు రావడం క్రికెట్ వర్గాల్లో దుమారం రేపింది. దీంతో షోయబ్‌పై ప్రజలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సనా- మాలిక్‌లు విడిపోతున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై వీరిద్దరూ ఇంత వరకు స్పందించలేదు.


Click it and Unblock the Notifications











