విజయ్ - వంశీ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఆ సెంటిమెంట్ తో ఫైనల్?
సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమా చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికైతే అధికారిక ప్రకటన ఏమి వెలువడలేదు గానీ విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22వ తేదీన ఈ సినిమా ప్రకటన ఉండే అవకాశం ఉందని అంటున్నారు..
దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ప్రచారాలు కూడా మొదలైపోయాయి.. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి తాజాగా ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఈ సినిమా దర్శక నిర్మాతలు ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా ప్రకటన రోజే ఈ విషయం కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ భామ ఇప్పటికే విజయ్ తో రెండు సార్లు కలిసి నటించింది.. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలవడంతో వీరిద్దరి కాంబినేషన్ మీద నమ్మకం ఉండటంతో దర్శక నిర్మాతలు ఆమెను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.. వీరిద్దరూ ముందు బైరవ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత సర్కార్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రజనీకాంత్ నయనతార జంటగా నటిస్తున్న అన్నాత్తే సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ భామకు అటు తెలుగు ఇటు తమిళ భాషల్లో అభిమానులు ఉండడంతో మార్కెట్ పరంగా కూడా కలిసి వస్తుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











