Mega Star Chiranjeevi: పద్మ అవార్డ్స్, గిన్నిస్ రికార్డ్స్ .. చిరంజీవి ఎన్ని పురస్కారాలు అందుకున్నారో తెలుసా?
తెలుగు సినీ వినీలాకాశంలో మకుటం లేని మహారాజులా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి చేరుకున్న ఆయన కొన్ని తరాలను ప్రభావితం చేశారు. ప్రతిభ, కష్టం, తెలివితేటలు ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరని నిరూపించారు చిరంజీవి. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎందరో హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లు వెండితెరపై అడుగుపెట్టారు. దాదాపు 46 ఏళ్లుగా తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ప్రయాణంలో చిరంజీవిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో అందుకున్న అవార్డులు, రివార్డులను ఒకసారి పరిశీలిస్తే..
ఖైదీతో తిరుగులేని క్రేజ్
1955 ఆగస్ట్ 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవిలకు జన్మించారు చిరంజీవి. ఆయన పూర్తి పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. ఆయనకు తమ్ముళ్లు నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. దిగ్గజ సినీనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను 1980లో వివాహం చేసుకున్నారు చిరు. ఈ దంపతులకు సుస్మిత, రామ్ చరణ్ తేజ్, శ్రీజ సంతానం. పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి వెండితెరపై అడుగుపెట్టగా.. ప్రాణం ఖరీదు మూవీ తొలుత రిలీజైంది. 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాటి నుంచి నేటి వరకు ఆయన ప్రస్థానం అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 155 చిత్రాల్లో నటించిన చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. 46 ఏళ్ల కెరీర్‌లో ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. వాటిని పరిశీలిస్తే..

చిరంజీవిని వరించిన పురస్కారాలు
భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం చిరంజీవిని సత్కరించింది. స్వయంకృషి, ఆపద్భబాంధవుడు, ఇంద్ర సినిమాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు చిరంజీవి. అలాగే తెలుగు సినిమాకు అందించిన సేవలకు గాను 2016లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డ్‌ను అందుకున్నారు మెగాస్టార్. కెరీర్‌లో 9 సార్లు ఫిలింఫేర్ అవార్డుల్ని అందుకున్నారు చిరంజీవి. 2006లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2002లో ఇఫ్ఫీ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, 2024లో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ను చిరంజీవి అందుకున్నారు. ఇవి కాకుండా ఐఫా ఉత్సవం, సైమా అవార్డ్స్, సంతోషం అవార్డ్స్, జీ సినీ అవార్డ్స్ ఆయనను వరించాయి.
గిన్నిస్ బుక్‌లో స్థానం
ఇకపోతే.. మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయే అవార్డ్ ఒకటుంది.. అదే గిన్నిస్ బుక్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలని అనుకుంటారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన గౌరవం చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చి గౌరవించింది. 156 చిత్రాల్లో, 537 పాటలలో 24 వేల స్టెప్పులు వేసినందుకు గాను చిరంజీవికి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కింది. 2024 సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ అవార్డ్‌ను అందజేశారు.
అత్యధిక ట్యాక్స్ చెల్లింపుకు అవార్డ్
వీటితో పాటు 1999-2000 ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచిన చిరంజీవిని కేంద్ర ఆర్ధిక శాఖ సమ్మాన్ అనే పురస్కారంతో సత్కరించింది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు చిరంజీవి. కోటి రూపాయలకు పైగా పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు మెగాస్టార్. అలా చిరంజీవి కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన ప్రతిష్టను మరింత పెంచాయి.


Click it and Unblock the Notifications











