చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ.. ఇండియాలో తొలి నటుడిగా రికార్డ్
నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ. 14 ఏళ్ల వయసులో తాతమ్మ కల చిత్రంతో సినీరంగ ప్రస్థానం మొదలుపెట్టిన బాలయ్య.. నేటి గతేడాదితో 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. హీరోగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా తెలుగునేలపై చెరగని ముద్ర వేశారు బాలకృష్ణ. తాజాగా ఆయన అరుదైన ఘనత సాధించారు. ఈ వివరాల్లోకి వెళితే..

తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి
నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 10 జూన్ 1960న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం చదువుకున్న బాలయ్య .. 1982లో వసుంధరను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తెలు బ్రాహ్మాణి, తేజస్విని.. కుమారుడు మోక్షజ్ఞ తేజ సంతానం. తొలినాళ్లలో తన తండ్రి దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించారు బాలయ్య. చదువు పూర్తి చేసిన తర్వాత 1984లో సాహసమే జీవితం సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఇక నాటి నుంచి నేటి వరకు ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. పౌరాణిక, చారిత్రక, జానపద, ఫ్యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ ఇలా అన్ని రకాల జోనర్స్‌లో నటించిన అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలయ్య.
100కు పైగా సినిమాలు
ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో తన 110వ చిత్రం అఖండ 2లో నటిస్తున్నారు. అఖండ 2 తర్వాత గోపీచంద్ మలినేనితో తన 111 చిత్రంలో నటించనున్నారు బాలకృష్ణ. ఇక బుల్లితెరపై హోస్ట్‌గానూ బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ చేశారు.
సినిమాలే కాదు రాజకీయాల్లోనూ తండ్రి బాటలోనే నడించారు.
హ్యాట్రిక్ ఎమ్మెల్యే
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అవసరమైనా అందుబాటులో ఉంటున్నారు బాలయ్య. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 2019, 2024లలో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక తన తల్లి పేరిట నెలకొల్పిన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఇక భారతీయ సినిమాకు అందించిన సేవలకు గాను ఈ ఏడాది ఆయనను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఆ వెంటనే కొద్దిరోజులకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వం బాలయ్యను గౌరవించింది.
తొలి భారతీయ నటుడిగా రికార్డ్
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో బాలయ్య మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 50 ఏళ్ల నట జీవితం, ఎమ్మెల్యేగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా చెరగని ముద్ర వేసిన బాలయ్య వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో అడుగుపెట్టారు. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగానూ నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. ఈ మేరకు ఆగస్ట్ 30న జరగనున్న కార్యక్రమంలో బాలయ్యను సత్కరించనున్నారు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటూ బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











