HBD Pawan Kalyan: కళ్యాణ్ బాబు నుంచి ఓజెస్ గంభీరగా.. పవన్ కళ్యాణ్ గురించి ఈ విషయాలు తెలుసా?
పవన్ కళ్యాణ్.. ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన తన నటన, స్టైల్, మేనరిజంతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా కంటే ఓ వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ను ప్రజలు ఇష్టపడతారు. విలక్షణ వ్యక్తిత్వం, కొండనైనా ఢీకొట్టే తత్త్వం, ఎదుటి వ్యక్తికి సాయం చేసే మంచి మనసు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అన్న చాటు తమ్ముడిగా కెరీర్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధినేతగా ఎదిగారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన ప్రస్థానాన్ని, జీవితంలోని కీలక విషయాలను ప్రస్తావిస్తే..
చిన్నప్పుడు పేదరికం
కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న గుంటూరు జిల్లా బాపట్లలో మూడో కుమారుడిగా జన్మించారు పవన్ కళ్యాణ్. ఆయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. తండ్రి ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేది. ఈ ప్రభావం పవన్ కళ్యాణ్‌పై బలంగా పడింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని యాసలు , మాండలీకాలు, సంస్కృతులు, ప్రజల జీవన విధానాలను పవన్ కళ్యాణ్ చాలా దగ్గరి నుంచి గమనిస్తుండేవారు. చిన్నప్పుడు పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ తను హీరోగా నిలదొక్కుకుని కుబేరుడిగా మారారు. తన సంపాదనను పేదల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం వెచ్చిస్తున్నారు.

డిఫరెంట్ స్టైల్‌తో పవర్ స్టార్‌గా
1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. అప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు వెండితెరను దున్నేస్తుండగా.. చిన్నాచితకా హీరోలు అనేకం. ఇంతమందిలో నెగ్గుకురావాలంటే తనకంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో సిద్ధహస్తుడు కావడంతో తన సినిమాలలో వాటిని ప్రదర్శించి యువతను ఆకట్టుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. ఓ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శించే క్రమంలో కళ్యాణ్ బాబుకు పవన్ అనే అవార్డ్ లభించడంతో తన పేరును పవన్ కళ్యాణ్‌గా మార్చుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి
తమ్ముడు, బద్రి, ఖుషి, గుడుంబా శంకర్, హరిహర వీరమల్లు సినిమాలకు స్టంట్ కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. అలాగే స్వయంగా తన అన్నయ్య చిరంజీవి నటించిన డాడీ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. 2003లో జానీ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ, పవన్ మేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. గుడుంబా శంకర్‌కు స్క్రీన్ ప్లే రైటర్‌గా, సర్దార్ గబ్బర్ సింగ్‌కు రైటర్‌గా పనిచేశారు. తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, పంజాబ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలలో పలు పాటలు పాడారు.
నిర్మాతగా పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మాతగా మారి సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగా సినిమాలు నిర్మించారు. ప్రముఖ శీతల పానీయాల కంపెనీ పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తొలి సౌత్ స్టార్‌గా నిలిచారు పవన్. 1997లో నందినిని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2001లో తన సహనటి రేణు దేశాయ్‌తో ప్రేమలో పడి 2009లో ఆమెను పెళ్లాడారు. వీరికి కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య ఉన్నారు. అనివార్య కారణాలతో పవన్, రేణు దేశాయ్ విడిపోయారు. అనంతరం రష్యా యువతి అన్నా లెజ్‌నోవాను వివాహం చేసుకోగా.. వీరికి అంజనా పవనోవా అనే కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు.

ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి
తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న ఆయన.. 2008లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన పవన్ కళ్యాణ్.. అందులో యువరాజ్యం అధినేతగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో పవన్ నొచ్చుకున్నారు. తర్వాత తన నమ్మిన సిద్ధాంతాలు, భావజలానికి అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి పోరాటం మొదలుపెట్టారు. 2014 ఏపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కూటమి నుంచి బయటికొచ్చి ఒంటరిగా పోటీ చేసి గాజువాక, భీమవరంలలో ఓడిపోయారు. ఆ తర్వాత 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో తిరిగి జట్టుకట్టి కూటమి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. పదేళ్ల పోరాటం తర్వాత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టి, నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగానూ బాధ్యతలు చేపట్టారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు
డిప్యూటీ సీఎంగా, జనసేన పార్టీ అధినేతగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో నటించారు. ఇప్పటికే వీరమల్లు రిలీజ్ కాగా.. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాల్లో తన స్థానం, తన క్రేజ్ చెక్కుచెదరలేదని పవన్ కళ్యాణ్ నిరూపించారు. తనకు ఎంతో ఇష్టమైన శాఖలకు మంత్రిగా సేవలందిస్తూ.. ప్రభుత్వంలో భాగస్వామిగా సమాజాన్ని మార్చాలని ప్రయత్నిస్తోన్న పవన్ కళ్యాణ్ జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించారు.


Click it and Unblock the Notifications











