Prabhas Net Worth: భారీగా పెరిగిన ప్రభాస్ సంపద... రాజ్ సాబ్ ఆస్తులు ఎన్ని వందల కోట్లంటే?
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రభాస్.. తన కష్టం, ప్రతిభతో టాలీవుడ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు ఇండియన్ సినిమాకు ఐకాన్‌గా మారారు. టాలీవుడ్‌లో అందరివాడుగా, మనసున్న మారాజుగా, అభిమానులకు డార్లింగ్‌గా నిలిచారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన కెరీర్, వ్యక్తిగత విశేషాలు, ఆయన ఆస్తులు ఇతర వివరాలు పరిశీలిస్తే..
కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కుమారుడే ప్రభాస్. 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించారు ప్రభాస్. ఆయన పూర్తిపేరు.. ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. చెన్నై డాన్‌బాస్కో, భీమవరం డీఎన్ఆర్ కాలేజీలలో చదువుకున్న ఆయన.. హైదరాబాద్ నలంద కాలేజీలో ఇంటర్.. శ్రీచైతన్య కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. చదువు తర్వాత నటన వైపు వెళ్లాలని ప్రభాస్ భావించడంతో కుటుంబ సభ్యులు ఆయనను సత్యానంద్ వద్దకు పంపారు తల్లీదండ్రులు. ఆయన దగ్గర నటనలో ఓనమాలు దిద్దిన డార్లింగ్.. అన్ని రకాలుగా సిద్ధమయ్యారు.

2002లో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ ప్రోత్సాహంతో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతితో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్‌తో లవర్ బాయ్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. చక్రం, పూర్ణమి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న దశలో మిర్చితో కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రభాస్ కెరీర్‌ను బాహుబలి తర్వాత .. బాహుబలికి ముందు అని అంటారు విశ్లేషకులు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ తర్వాత ఆయన క్రేజ్ ఆకాశాన్ని తాకింది.
బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని, ఎంతో మంది సూపర్‌స్టార్లను పక్కకునెట్టి ప్రభాస్ సినిమాలు వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో ఎవ్వరూ అందుకోని రేంజ్‌కి వెళ్లిపోయారు ప్రభాస్. వందల కోట్ల బడ్జెట్‌తో, పాన్ ఇండియా భాషల్లో ఆయన సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. వరుసగా 5 సినిమాలు విడుదలైన తొలిరోజే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టాయి. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ హీరో ప్రభాస్. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరో ప్రభాసే. మిస్టర్ కూల్‌గా, వివాదాలకు దూరంగా ఉంటూ అందరి చేత డార్లింగ్ అనిపించుకున్నారు.
పాన్ ఇండియా స్టార్‌గా ఎవరెస్ట్ స్థాయిలో ఉన్నప్పటికీ తనను ఇంతటి వాడిగా చేసిన సమాజానికి ఎంతో కొంత సేవ చేయడంలో ముందున్నారు. హైదరాబాద్‌లో 1650 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని దాని అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తన స్వగ్రామం మొగల్తూరు అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. కరోనా వైరస్, కేరళ వరదలు, విజయవాడ వరదలు ఇలా ఏ ఇబ్బంది వచ్చినా తాను ఉన్నానంటూ ముందు నిలుస్తున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజ్ సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలలో నటిస్తున్నారు ప్రభాస్.
నటుడిగా ప్రభాస్ సినీ ప్రస్థానం మొదలై 23 ఏళ్లు కావొస్తోంది. ఇన్నేళ్ల కెరీర్‌లో డార్లింగ్ ఎంత సంపాదించాడు? ఆయన సంపద ఎంత? అనేది ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభాస్‌కి హైదరాబాద్, ముంబై, చెన్నై, భీమవరం, మొగల్తూరులలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లో రూ. 70 కోట్ల విలువైన భవనం.. అలాగే ముంబైలో ఇటీవల 15 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రభాస్‌కు ఆస్తులున్నాయి. ఇటలీలోని లగ్జరీ భవంతి విలువ రూ. కోట్లలో ఉంటుందని అంచనా .
ఇక కార్లంటే ఎంతో ఇష్టపడే ప్రభాస్ గ్యారేజీలో రూ. 7 కోట్ల విలువ లంబోర్ఘిని, రూ. 2 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ.2 కోట్ల విలువైనప మెర్సిడెస్ బెంజ్, రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ఉన్నాయి. సినిమాకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ తన సంపాదనను పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని బట్టి ప్రభాస్ ఆస్తుల విలువ రూ. 300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయన జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











