పవన్ కల్యాణ్ అసలైన హీరో.. పవర్ స్టార్ డిఫరెంట్.. ఇండియన్ సినిమాకు హైదరాబాద్ రాజధాని.. రానా ఎమోషనల్ స్పీచ్
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా రాగా, మంత్రి శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్‌తోపాటు రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్, సప్తగిరి, దర్శకుడు సాగర్ కే చంద్ర, ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ అసలైన హీరో
మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అట.. నేను ఎవరో తెలుసా అంటూ సినిమాలోని డైలాగ్‌తో స్పీచ్ మొదలుపెట్టారు. నేను పంజా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాను. కానీ రెండు గంటల ట్రాఫిక్ జామ్ తర్వాత వేదిక వద్దకు వచ్చాను. ఈ సినిమాతో చాలా మంది మేధావులను కలిశాను. నటుడిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి హీరోగా ఎలా కావాలని తెలుసుకోలేకపోయాను. డైరెక్టర్లందరూ తమ అవసరాలకు నటనను రాబట్టుకొన్నారు. యాక్టర్ అయ్యాను కానీ.. హీరో కావాలని ఆలోచిస్తున్నప్పుడు నా కళ్ల ముందుకు వచ్చిన అసలైన హీరో పవన్ కల్యాణ్ అని రానా దగ్గుబాటి అన్నారు.

పవన్ కల్యాణ్ డిఫరెంట్ హీరో
నేను ఇండియాలో చాలా మంది స్టార్స్‌తో పనిచేశాను. కానీ మీరు చాలా డిఫరెంట్ సార్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే.. ఇక నుంచి పవన్ కల్యాణ్ ప్రభావంతో నా సినిమాలు మరోలా ఉంటాయి. మీవద్ద నుంచి చాలా నేర్చుకొన్నాను. అందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలోకి పవన్ కల్యాణ్ రాకముందే నేను వచ్చాను అని రానా అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో మేధావి
భీమ్లా నాయక్ సినిమాకు పనిచేసిన నేపథ్యంలో కలిసిన మరో మేధావి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సినిమాల్లోకి రాకుంటే.. విశ్వంలోకి రాకెట్లను పంపించే వారేమో. అలాంటి వ్యక్తి అయిపోయారే. మీరు లేకుంటే ఈ సినిమా లేదు అని రానా దగ్గుబాటి తన ఆనందాన్ని పంచుకొన్నారు.

నిర్మాతలకు కంగ్రాట్స్
ఇక భీమ్లా నాయక్ సినిమా నిర్మించిన నాగవంశీ, చినబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీరు తీస్తున్న సినిమాలు గొప్పగా ఉన్నాయి. నాగవంశీ డైనమిక్ ఫిల్మ్ మేకర్. డీజె టిల్లు, ఇతర సినిమా సక్సెస్‌కు నా థ్యాంక్స్. ఈ సినిమాలో నిత్యమీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని లాంటి వ్యక్తులతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉంది అని రానా అన్నారు.
Recommended Video

ఇండియన్ సినిమాకు హైదరాబాద్ రాజధాని
తెలుగు సినిమా పరిశ్రమకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం గొప్పది. తెలుగు సినిమాకు అందిస్తున్న సహకారం మాటల్లో చెప్పలేనిది. ఇండియన్ సినిమాకు హైదరాబాద్ రాజధాని అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని రానా దగ్గుబాటి తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











