Major మూవీపై విజయ్ దేవరకొండ రివ్యూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
యువ నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాణ సారథ్యంలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ నటించిన మేజర్ చిత్రం జూన్ 3వ తేదీన రిలీజై ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొంటున్నది. సాధారణ ప్రేక్షకులు, సినీ విమర్శకులు, సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చూసి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో మేజర్ చిత్రాన్ని చూసిన విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్‌లో విజయ్ దేవరకొండ పోస్ట్ పెడుతూ..
మేజర్ చిత్రం ప్యాషన్, లవ్, సిన్సియారిటీతో కూడిన చిత్రం. ఓ గొప్ప యోధుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉంది. నిజమైన స్పూర్తిని నింపే భారతీయ జవాన్. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన హీరో గురించి తెలుసుకోవాలంటే.. తప్పకుండా ఈ సినిమాను చూసి తీరాల్సిందే. గొప్ప వీరుడికి జన్మనిచ్చిన మేజర్ సందీప్ తల్లిదండ్రులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గొప్ప సినిమాను రూపొందించిన చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ అని విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.

ముంబై నగరంపై పాకిస్థాన్ ముష్కరులు జరిపిన 26/11 దాడుల్లో ప్రాణ త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్ ఇటీవల తన భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మేజర్ చిత్రం గత నాలుగు రోజుల్లో విడుదలైన ప్రతీ చోట భారీ కలెక్షన్లను సంపాదిస్తున్నది. ఏపీ, నైజాంలో 21.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 12.59 షేర్ సాధించింది. కర్ణాటకలో 1.35 కోట్లు, హిందీలో 5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 5 గ్రాస్‌తో మొత్తం 21.54 కోట్ల షేర్, 39.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











