‘ఏం మిగల్లేదు.. బూడిద కుప్పగా సౌందర్య, చివరి చూపు కోసం పెళ్లిబట్టల్లోనే’
100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమకు హీరోయిన్లుగా ఎందరో వచ్చారు వెళ్లారు. కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారిలో సౌందర్య కూడా ఒకరు. అందం + అభినయం కలగలిసిన అతికొద్దిమంది నటీమణుల్లో సౌందర్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సావిత్రి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమపై అంతటి ప్రభావం చూపారు సౌందర్య. గ్లామర్, సెంటిమెంట్, లేడీ ఓరియెంటెడ్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ అభిమాన నటిగా మారారు.
తెలుగింటి ఆడపడుచుగా
పుట్టింది కర్ణాటకలోనే అయినా తెలుగు ప్రజలు ఆమెను తమ ఇంటి ఆడపడుచుగా, తమ బిడ్డగానే చూసుకున్నారు. 80, 90వ దశకాల్లో ఎంతో మంది అందగత్తెలు, నటనకే భాష్యం చెప్పిన నటీమణులు వచ్చినప్పటికీ వారందరినీ తట్టుకుని నిలబడ్డారు సౌందర్య. 1992లో గంధర్వ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సౌందర్య. ఈ క్రమంలో మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తొలుత చిన్నాచితకా పాత్రలు, సెకండ్ హీరోయిన్ ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్స్‌తో సౌందర్య దూసుకొచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీలలో అందరి అగ్రనటుల సరసన నటించారు.

చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు
పవిత్రబంధం, రాజా, పెళ్లి చేసుకుందాం రా తదితర సినిమాలో సౌందర్య మహిళా ప్రేక్షకులకు ఫేవరెట్‌గా నిలిచారు. తమకు పెళ్లంటూ జరిగితే కాబోయే భార్య సౌందర్యలా ఉండాలని అప్పట్లో కుర్రాళ్లు కలలు కన్నారు. ఎన్నో గొప్ప పాత్రలు పోషించి, మరెంతో భవిష్యత్తు ఉన్న సౌందర్య.. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. 2004లో ఏప్రిల్ 17న బీజేపీ తరపున ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరారు.
సౌందర్య మరణించి 20 ఏళ్లు
అయితే ఛాపర్‌లో సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన కాసేపటికే అది కుప్పకూలింది. ఈ ఘటనలో సౌందర్య సహా కొందరు దుర్మరణం పాలయ్యారు. ఆమె మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. సౌందర్య మరణించి ఇప్పటికీ 21 సంవత్సరాలు గడిచినా ఆమె లేని లోటు కనిపిస్తూనే ఉంది. సౌందర్య తప్పించి మరొకరు వేయలేని పాత్రలు అలాగే మిగిలిపోయాయి. ఆవిడ సమకాలీనులు, ఇండస్ట్రీలోని సౌందర్య మిత్రులు ఇప్పటికీ ఆమె గొప్పదనం గురించి చెబుతూనే ఉంటారు. తాజాగా సీనియర్ నటి, హీరోయిన్ రాశి .. జబర్దస్త్ ఫేమ్ వర్ష నిర్వహించిన కిస్సిక్ టాక్స్‌లో పాల్గొని సౌందర్యతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
అమ్మ వద్దని గొడవ చేసింది
ఈ హీరోయిన్‌తో నాకు పోటీ అనే హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా? అని రాశిని వర్ష ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. 'సౌందర్య స్టాఫ్.. మా స్టాఫ్‌తోటి ఏంటీ మా మేడంని కొట్టేవాళ్లే లేరని అనుకున్నాం, మీ మేడం వచ్చిందే అని మాట్లాడుకున్నారట. ప్రశాంత్ కుటీర్ అనే గెస్ట్‌హౌస్‌లో ఇద్దరం ఎదురెదురు రూమ్స్‌లోనే ఉండేవాళ్లం. ఆవిడకి పెళ్లయి షిఫ్ట్ అయిన తర్వాత ఆమె రూమ్ నేను వాడుకునేదానిని. మేం మంచి ఫ్రెండ్స్.. సౌందర్య కంటే నేను చాలా చిన్నదానిని, అందుకని చిన్నపిల్లని చూసినట్లే చూసేది, మా అన్నయ్యని ఒక బ్రదర్‌ని చూసినట్లు చూసేది. ఆవిడ ఇక లేరు అని తెలిశాక చాలా బాధపడ్డా.. నేను మ్యారేజ్‌కి పిలుద్దామనుకున్న ఒకే ఒక్క వ్యక్తి. పెళ్లి కూతురిని చేసిన నెక్ట్స్ డేనే ఇన్సిడెంట్ జరిగింది.. బెంగళూరులో సంతాప సభ పెట్టారు, అమ్మ వెళ్లొద్దు అన్నారు. పెళ్లికూతురిని చేస్తే బయటికి వెళ్లకూడదని, నేను బెంగళూరు వెళ్లి తనని చూడటానికి కూడా ఏం మిగల్లేదు, బూడిద మాత్రమే. ఆ సంతాప సభకు వెళ్లి ఆమె ఫోటోకి దండేసి, పూలు వేసి కాసేపు కూర్చొని వస్తానని చెప్పి వెళ్లానని' రాశి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











