Aditi Rao Hydari.. అలాంటి పొరపాట్లే కొంప ముంచాయి.. నిరాశతో అదితి రావు హైదరీ
అటు నటనపరంగా, ఇటు గ్లామర్ పరంగా మంచి కథానాయికగా నిరూపించుకుంది అదితీ రావు హైదరీ. బాలీవుడ్‌కే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే తన సాటి కథానాయికలతో పోల్చుకుంటే అదితి ప్రతిభకు తగ్గ విజయాలు దక్కడం లేదనే విశ్లేషణ వినిపిస్తోంది. దీని గురించి తాజాగా ఆమె స్పందించింది. తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడింది. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..

తెలుగు నుంచి అవకాశాలు
దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన సమ్మోహనం సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది అదితి. ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు అదితిని నిరాశపరిచాయి. నాని, సుధీర్ బాబు వి, శర్వానంద్, సిద్ధార్థ్ మహాసముద్రం సినిమాల్లో అదితి నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. అయితే ఆ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో అదితికి అవకాశాలు కరువయ్యాయి.

సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్
సినిమాల్లో కాస్త పద్ధతైన పాత్రల్లో కనిపించే అదితి సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫొటోలతో హల్‌చల్ చేస్తుంటుంది. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులకు అందాల విందు చేస్తుంటుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అదితి క్రమం తప్పకుండా హాట్ ఫొటో సెషన్లలో పాల్గొంటుంది. వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. హాట్ ఫొటోల వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో అదితికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

పెళ్లి.. విడాకులు..
పన్నెండేళ్ల కిందట పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అదితి కొన్ని కారణాలతో భర్తకు విడాకులు ఇచ్చేసి ఒంటరి జీవితం గడుపుతోంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. నటుడు సత్యదీప్ మిశ్రాను 2009లో వివాహం చేసుకున్న అదితి.. 2013లో విడాకులు తీసుకుంది. అయితే విడాకుల అనంతరం కూడా ఇద్దరూ తమ ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకరి ఫొటోలకు మరొకరు కామెంట్లు చేస్తుంటారు.

చాలా తప్పులు చేశాను
నేను చాలా తప్పులు చేశానని అనుకుంటున్నాను. ఆ విషయంలో వంద శాతం నిజం ఉంది. చాలా సార్లు నేను అనుకున్నట్టు జరగలేదు. చాలా చిన్న వయసులోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాకు ఇక్కడ ఎవరి మద్దతూ లేదు. నా వరకు మంచి కథ అనుకుంటేనే సినిమా చేస్తాను. కానీ చివరికి అది ఎలా రూపొందుతుందనేది నా చేతుల్లో లేదు. అది పూర్తిగా నా వైఫల్యం అని చెప్పలేను. అయితే పరాజయాల వల్ల చాలా నేర్చుకున్నాను. నా సినిమాల ఎంపిక గురించి బాధ పడడం లేదని అదితి చెప్పుకొచ్చింది.

నాకు చాలా క్లారిటీ ఉంది
సినిమాల విషయంలో నా వరకు నాకు చాలా క్లారిటీ ఉంది. సినిమాల్లో నటించాలనే నా కలను నేను సాకారం చేసుకోగలిగాను. నన్ను గైడ్ చేసే వారు ఎవరూ ఇక్కడ లేరు. ఏం చేయాలో, ఏది చేయకూడదో నాకు చెప్పేవారు ఎవరూ లేరు. దాంతో నా మనస్సు చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. నాకు నచ్చిన సినిమాల్లోనే నటించాను. ఫలితం గురించి ఆలోచిస్తే చాలా సినిమాలు నాకు కలిసి రాలేదు. అంత మాత్రాన నా నిర్ణయాలు తప్పని అనుకోనని అదితి చెప్పింది.


Click it and Unblock the Notifications











