HBD Samantha: ఇండియాలోనే ఆ రికార్డు కొట్టిన ఏకైక హీరోయిన్.. విడాకులకు కారణం.. సంపాదన ఎంతంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్థానంలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా హవాను చూపించారు. అయితే, అందులో కొందరిని మాత్రమే ప్రేక్షకులు ఆదరించడంతో పాటు తమ వారిగా చేసుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ఒకరు. 'ఏమాయ చేశావే' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరినీ ఫిదా చేసేసిందామె. ఇలా చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుని ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది.
ఇక, నాగ చైతన్యతో విడాకుల తర్వాత మరింత స్పీడు పెంచేసింది. ఈ నేపథ్యంలో సమంత ఈరోజు తన బర్త్‌డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని మధుర ఘట్టాలను గురించి తెలుసుకుందాం!

ఆరంభంలోనే ఫేమస్.. అందరితోనూ
'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది సమంత. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తద్వారా ఎన్నో అవార్డులు దక్కాయి. టాలీవుడ్‌లో ఉన్న స్టార్లు అందరితోనూ సమంత సినిమాలు చేసింది. అందులో నాగ చైతన్యతో నాలుగు, ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు చేసింది. మిగిలిన స్టార్లతోనూ ఒక్కటి రెండు చిత్రాలు చేసింది.

ఇక్కడే కాదు అక్కడా.. KRK మూవీతో
సుదీర్ఘ కాలంగా తెలుగులో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సమంత.. తమిళంలోనూ సత్తా చాటుతోంది. అక్కడ కూడా స్టార్ హీరోలందరితోనూ నటించే అవకాశాలను అందుకుంది. తద్వారా ఇప్పటికే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక, తాజాగా సామ్.. 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఓటీటీ ఎంట్రీ.. సాంగ్‌తో ఫుల్ ఫేమస్
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమంత.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత ఏడాది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. ఇందులో ఆమె చేసిన పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయింది. అలాగే, 'పుష్ప'లో చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఆమెకు మంచి క్రేజ్‌ను తెచ్చి పెట్టింది.

వరుస చిత్రాలు.. హాలీవుడ్‌లో ఎంట్రీ
సమంత ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. అలాగే, BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే 'The arrangements of love'లోనూ నటించబోతుంది. అలాగే, 'యశోద' అనే సినిమాలోనూ భాగమైంది. మరో హిందీ వెబ్ సిరీస్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ముంబైకి మకాం మార్చబోతుంది.

చైతూతో విడాకులు.. కారణం ఏంటి?
కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత.. అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల పాటు అతడితో అన్యోన్యంగా గడిపిన సామ్.. గత ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకుంది. వీళ్లిద్దరి విడాకులకు అసలు కారణం ఏంటి అన్నది మాత్రం ఇప్పటి వరకూ తెలియలేదు. దీంతో ఇది మిస్టరీగానే మారిపోయిన సంగతి తెలిసిందే.

సమంతకు మాత్రమే దక్కిన ఘనత
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇందులో తెలుగు హీరోలంతా ఆమె వెనకే ఉన్నారు. అంతేకాదు, ట్విట్టర్ ఇండియా ఆ మధ్య సమంత ఎమోజీని విడుదల చేసింది. ఇలా గతంలో ఏ హీరోయిన్‌కూ ఎమోజీ దక్కలేదు.

సమంత సంపాదనలో కూడా టాప్
వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న సమంత.. రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ. 3 - 5 కోట్లు వసూలు చేస్తుందట. సౌత్‌లో నయనతార తర్వాత ఎక్కువ చార్జ్ చేసే హీరోయిన్ ఆమె అని అంటున్నారు. అలాగే, యాడ్స్‌కు, సోషల్ మీడియా పోస్టులకూ బాగానే చార్జ్ చేస్తోంది. ఫలితంగా ఆమె బ్రాండ్ వ్యాల్యూను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.
సుదీర్ఘ కాలంగా అన్నింట్లోనూ రాణిస్తూ నెంబర్ వన్‌గా వెలిగిపోతోన్న సమంతకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











