దీపిక వివాదంపై స్పందించిన రష్మిక.. ఫ్యామిలీ లైఫ్ కూడా ముఖ్యమే అంటూ..
Rashmika Mandanna- Deepika Padukone: ఇటీవల సినీ ఇండస్ట్రీలో పని గంటలకు సంబంధించిన చర్చ చాలా గట్టిగా సాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె 5 నుంచి 6 గంటల కంటే ఎక్కువ పని చేయనని తేల్చేసిన తరవాత అసలు హీరో, హీరోయిన్లు ఇలాంటి కండీషన్లు ఎందుకు పెడుతున్నారనే చర్చకు మొదలైంది. ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో అనేక వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి. సినిమాల్లో నటించడం కంటే.. షరతులే ఎక్కువ అయిపోతున్నాయా, కోట్లల్లో పారితోషికాలు తీసుకొంటూ మూవీ మేకర్స్ ను బ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ వివాదం నేపథ్యంలో పనిగంటలపై రష్మిక మందన్న కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇటీవల వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టులు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD పార్ట్ 2' నుంచి తప్పించబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ రెండు చిత్రాల్లో హీరో ప్రభాస్ కాగా, దర్శకులు ఇద్దరూ తెలుగు వారే. దీపికా రోజుకు కేవలం 8 గంటలే పని చేస్తానని, అలాగే తన టీమ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని షరతులు పెట్టిందని టాక్ వినిపించింది. ఈ డిమాండ్లు నిర్మాతలకు భారమవడంతో ఆమెను ప్రాజెక్టుల నుంచి తప్పించారని సమాచారం.

ఈ వార్తలపై దీపికా స్పందిస్తూ.. "నేను ఆడదాన్ని కాబట్టే ఈ విషయం పెద్ద సమస్యగా చూపిస్తున్నారు. కానీ చాలా మంది పురుష సూపర్‌స్టార్లు ఏళ్లుగా రోజుకి 8 గంటలే షూటింగ్ చేస్తున్నారు. వారిని ఎవరూ ప్రశ్నించరు. నేను అదే చెబితే మాత్రం వార్త అవుతుంది"అని సమాధానమిచ్చింది. ఆమె ఇంకా "కొంతమంది సీనియర్ నటీమణులు కూడా 8 గంటల షిఫ్ట్‌నే ఫాలో అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇది కొత్త విషయం కాదు. ఆరోగ్యం, పనితనం, సమతుల్యత కోసం ఇది అవసరమే," అని పేర్కొంది. మొత్తంగా, దీపికా తన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై నిలదొక్కుకుని చేసిన వ్యాఖ్యలు కేవలం బాలీవుడ్‌లోనే కాదు.. సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
తాజాగా ఈ వివాదంపై పరోక్షంగా రష్మిక మందన్న కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నేషనల్ క్రష్ రష్మిక తన తాజా సినిమా "ది గర్ల్‌ఫ్రెండ్" ప్రమోషన్లలో బిజీబిజీగా మారింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో వర్క్ అవర్స్, పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్సింగ్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. "ఓవర్ వర్క్ చేయడం అనేది గర్వపడాల్సిన విషయం కాదు. నేను కూడా చాలా సార్లు ఎక్కువగా పని చేస్తాను. కానీ అది సరైన పద్ధతి కాదని నాకు తెలుసు. ఎవరూ అలా చేయకూడదు. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీ ఆరోగ్యం, నిద్ర, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి," అని రష్మిక ఓపెన్ గా చెప్పింది.
"నటీనటులు కూడా మనుషులే కదా! వాళ్లకు కూడా విశ్రాంతి అవసరం ఉంటుంది. ఒకవేళ నాకు కూడా అవకాశం ఇస్తే, నేను కూడా ఆఫీస్ టైమింగ్స్‌లా 9 నుంచి 6 గంటల వరకు మాత్రమే పని చేయాలని అనుకుంటాను. ఎందుకంటే నేను నా కుటుంబంతో సమయం గడపాలి, ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ముఖ్యమే కదా. నాకు సరిపడా నిద్ర కావాలి, నేను రెగ్యులర్‌గా వర్కౌట్ చేయాలి. తర్వాత వయసులో 'ఆరోగ్యంగా ఉండాల్సింది' అని బాధపడకూడదు. అందుకే నేను ఇప్పుడు నుంచే ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నాను," అని రష్మిక వివరించింది.
ఇక వర్క్ అవర్స్ విషయంలో నిర్మాతల పరిస్థితిని కూడా ఆమె అర్థం చేసుకుంది. "ఒక్కోసారి సెట్లో కొన్ని సీన్లు మిగిలిపోతాయి. రేపటి నుండి సెట్ అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. సినిమా అంటే నేనొక్కదాన్నే కాదు, వంద మంది కలిసి చేసే పని. వాళ్లు నా వల్ల ఇబ్బంది పడకూడదు. అందుకే అవసరమైతే కాస్త సర్దుకుపోవాలి. కానీ అది నిరంతరం ఉండకూడదు. విశ్రాంతి కూడా అంతే ముఖ్యం," అని రష్మిక తెలిపింది.
రష్మిక తన భవిష్యత్తు గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నేను ఇంకా తల్లిని కాలేదు. కానీ భవిష్యత్తులో నాకు పిల్లలు పుడతారని నాకు తెలుసు. వాళ్ల కోసం నేను ముందుగానే శ్రద్ధ చూపుతున్నాను. వారిని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచాలని ఉంది. ఆ బాధ్యత నాకుంది. అందుకే నేను ఫిట్‌గా, మానసికంగా బలంగా ఉండాలి. అది నా కెరీర్‌కీ ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఎన్ని సినిమాలు చేయాలో, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలిస్తేనే కెరీర్ దీర్ఘకాలం నిలుస్తుంది" అని ఆమె స్పష్టం చేసింది. రష్మిక వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత అభిమానులు, సినీ వర్గాలు ఆమె మాటలకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











