Virata Parvam గత జన్మలో అలా పుట్టి ఉంటానేమో.. ఆ భయానక పరిస్థితులు చూసి.. సాయిపల్లవి ఎమోషనల్ ఇంటర్వ్యూ
లేడి పవర్ స్టార్ సాయిపల్లవి, రానా దగ్గుబాటి జంటగా నీది నాది ఒకే కథ ఫేమ్ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం విరాటపర్వం. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో మాట్లాడుతూ..

సరళకు అన్యాయం జరిగిందనే విషయం..
సరళకు చాలా అన్యాయం జరిగిందనే విషయం తెలుసుకొన్న తర్వాత ఆ పాత్ర వెంట ప్రయాణించాను. ఆమెకు ఏం జరిగిందనే విషయాలను కొన్ని కారణాల వల్ల పూర్తిగా చూపించలేకపోయాం. ఒక కథను ఎలా అప్రోచ్ అవుతామో అలానే పాత్రను చేయాలని అనుకొన్నాను. వాస్తవ పాత్ర అనుకొంటే ఆ పాత్రను చేయడం కష్టం. నేను ఒక వెన్నెల అమ్మాయిగా నటిస్తున్నాననే భావనతో ఆ పాత్రలో నటించాను. మనకు తెలియని అంశంతో రూపొందిన సినిమాలో నటిస్తేనే ఒక ఛాలెంజ్ ఉంటుంది అని సాయిపల్లవి అన్నారు.

రానా నటిస్తున్నారనే విషయం తెలిసి..
దర్శకుడు వేణు ఊడుగుల ముందుగా సుధాకర్ చెరుకూరికి కథ చెప్పారు. తనకు నచ్చడంతో మిగితా పాత్రల గురించి చర్చించారు. ఈ క్రమంలో రానాకు స్క్రిప్ట్ ఇవ్వడం.. ఆయన చదవడంతో ఈ ప్రాజెక్టులోకి ఆయన వచ్చారు. ఆ తర్వాతే నాకు రానా ఈ సినిమాలో రవన్న నటిస్తున్నట్టు తెలిసింది. రానా నటిస్తున్నారని చెప్పగానే.. ఆ పాత్రకు ఆయన హైట్.. ఆయన స్టేచర్ సరిపోతుందనే ఫీలింగ్ కలిగింది. ఈ పాత్రను, సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాడని భావించాను. రానా రావడం వల్ల స్క్రిప్టులో ఉన్న బలమైన అంశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లడానికి అవకాశం లభించింది. స్క్రిప్ట్ విన్నప్పుడు ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావు ఉంటారని అనుకోలేదు అని సాయిపల్లవి చెప్పారు.

రెగ్యులర్, రొటీన్ పాత్రలు చేయడం..
నటిగా డిఫరెంట్ రోల్స్ చేయాలని అనుకొంటాను. రెగ్యులర్, రొటీన్ పాత్రలు చేస్తే.. ఒకే ప్రశ్నాపత్రానికి మళ్లీ మళ్లీ జవాబులు రాసినట్టు అనిపిస్తుంది. ఒక ఉద్వేగమైన పాత్రను పోషించడమే ఛాలెంజ్. ఈ రోజు షూటింగ్‌కు వచ్చాం. కొత్త విషయాన్ని నేర్చుకొన్నాం. నటించేటప్పుడు గుండెను పిండేసే బాధ ఉంటే.. నటిగా అంతకంటే ఏముంటుంది అని సాయిపల్లవి అన్నారు.

అలాంటి పరిస్థితులుంటే డిస్ కనెక్ట్
స్క్రిప్టులో కథను చూడటం వేరు.. ఒకసారి అడవి వాతావరణం, సెట్లోకి వెళ్లిన తర్వాత ఊహించని విధంగా ఉంది. నేను షూటింగులో ఉన్నప్పుడు.. మా ఊర్లో ఇలానే ఉంటారు. మా ఊర్లో ఇలానే మాట్లాడుతుంటారు అని అనిపించేది. కొన్నిసార్లు కథ కోసం సెట్ వేస్తే.. మనం ఆ వాతావరణం నుంచి డిస్‌కనెక్ట్ అవుతాం. ఇది నా ఊరు కాదు అనే ఫీలింగ్ కలుగుతుంది. విరాట పర్వం సినిమా షూట్‌లో అలాంటి ఫీలింగ్ కలుగలేదు. విరాట పర్వం లాంటి సినిమా కోసం మేకప్ రాలేదు. కేవలం ముఖం కడుక్కొని వచ్చి నేచురల్‌గా కెమెరా ముందు నిలుచున్నాను అని సాయిపల్లవి తెలిపారు.

నక్సలైట్ ఉద్యమంపై నా అభిప్రాయం..
విరాట పర్వం సినిమా తర్వాత నక్సలైట్ ఉద్యమాలపై గౌరవం పెరిగింది. ఈ సినిమాకు ముందు కొన్ని చోట్ల జరిగిన విషయాలను కేవలం సంఘటనగానే చూశాను. వెన్నెల పాత్ర చేసిన తర్వాత పల్లె ప్రజల జీవిన విధానం తెలిసింది. ఆ సమయంలో ఉన్న నక్సల్ ఉద్యమం గురించి నేను ఇప్పుడు మాట్లడటం సరికాదు. ఎందుకంటే.. ఆ సమయంలో నేను లేను. నాకు తెలియని విషయాలు, వాస్తవ సంఘటనల గురించి ఇప్పుడు మాట్లాడితే వారి ఉద్యమాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఒక అమ్మాయి ఎందుకు వెళ్లి దళంలో కలిసిందనే విషయాన్ని నేను నేర్చుకొన్నాననే తప్ప.. నేను వాస్తవ సంఘటనలతో భాగం కాలేదు. అందుకే వారిపై నాకు ఎలాంటి ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడలేదు అని సాయిపల్లవి చెప్పారు.

గత జన్మలో నేను ఇక్కడే పుట్టి ఉంటానేమో
తెలుగులో నా సినిమా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంతో, సంస్కృతి, భాషతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. నాకు తెలియకుండానే ఈ సంస్కృతిలో భాగమయ్యాను. కట్టుబొట్టు నాకు సహజంగానే అలవాటుపడిపోయాను. వేణుగారు బొట్టు గురించి ఇతర అంశాలు నాకు చెప్పినప్పుడు.. నటించకుండా.. చాలా సహజంగా బిహేవ్ చేశాను. ఇలాంటి విషయాలు తలుచుకొంటే.. గత జన్మలో నేను తెలంగాణ అమ్మాయిగా పుట్టి ఉంటానేమో అనే అనుమానం వస్తుంది. అందుకే ఈ సంస్కృతికి తొందరగా అలవాటు పడి ఉంటాను అని సాయిపల్లవి అన్నారు.


Click it and Unblock the Notifications











