Puneeth Rajkumar death: దేవుడనే వాడుంటే.. జవాబు చెప్పాల్సిందే.. RGV ఎమోషనల్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే.. సాధారణంగా ఎమోషనల్ అయినట్టు కనిపించరు. ఆయనకు చావు, పుట్టుక అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ తనకు సన్నిహితంగా, హృదయానికి చేరువైన వ్యక్తులు మరణిస్తే ఆయన తట్టుకోలేరనే విషయం పలు సందర్భాల్లో స్పష్టంగా కనిపించింది. గతంలో శ్రీదేవి, అలాగే రంగీలా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తన కజిన్ మరణించిన సమయంలో కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం నేపథ్యంలో సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు.
కన్నడ సినీ పరిశ్రమలో లెజెండరీ రాజ్‌కుమార్ ఫ్యామిలీతో వర్మకు మంచి అనుబంధం ఉంది. రాజ్‌కుమార్‌ను వీరప్పన్ కిడ్నాప్ చేసిన విషయం ఆధారంగా కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాను వర్మ తెరకెక్కించారు. అందులో స్వర్గీయ రాజ్‌కుమార్ తనయుడు శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో కనిపించారు. అలా ఎమోషనల్ బాండింగ్ ఉన్న ఫ్యామిలీలోని పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణ వార్తతో వర్మ కలత చెందారు. ఆయన వరుస ట్వీట్లు చూస్తూ..

పునీత్ రాజ్‌కుమార్ మరణించారంటే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన మరణం ఓ పీడకల అయితే బాగుంటుందనిపిస్తున్నది. ఆయన మరణం తర్వాత పరిస్థితి చూస్తుంటే.. సన్నిహితులు ఎవరు? ప్రియమైన వారు ఎవరనే విషయాన్ని కూడా ఊహించడం కష్టమవుతున్నది అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
పునీత్ రాజ్‌కుమార్ మరణం లాంటి విషాద సంఘటనను చూస్తే ఓ కష్టమైనప్పటికీ ఓ జీర్ణించుకోలేనటువంటి నిజం తెలిసింది. రెగ్యులర్‌గా వర్కవుట్లు చేసినా.. ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నా చావు అనేది తప్పదని తెలిసింది. నేను ఎవరిని చంపుతున్నాను? ఎందుకు చంపుతున్నాను అంటూ చావు తనకు తాను సమాధానం చెప్పుకోదు. అసలు దేవుడు అనే వాడు ఉంటే ఇలాంటి ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి అని వర్మ మరో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆదివారం (అక్టోబర్ 31వ తేదీన) బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతిమ యాత్ర 3.30 గంటలకు ప్రారంభమై 5 గంటలకు అక్కడికి చేరుకొంటుంది అని ప్రభుత్వ అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications











