Renukaswamy Murder Case : దర్శన్‌కి ఊరట, 4 నెలల తర్వాత జనంలోకి ఛాలెంజింగ్ స్టార్
ఛాలెంజింగ్ స్టార్‌గా కర్ణాటక ప్రజలు ముద్దుగా పిలుచుకునే కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప.. రేణుకా స్వామి అనే తన వీరాభిమానినే హత్య చేసి జైలుకెళ్లడం భారతీయ చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టించింది. తనతో సహజీవనం చేస్తోన్న పవిత్ర గౌడ అనే మహిళకు అసభ్య సందేశాలు పంపుతూ వేధిస్తోన్న స్వామిని అతను తన అనుచరులతో కలిసి అత్యంత క్రూరంగా హింసించి హతమార్చాడు. అక్కడితో ఆగకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించాడు. ఈ కేసులో దర్శన్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయగా వీరు ప్రస్తుతం జ్యుడిషీయల్ రిమాండ్‌లో ఉన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు తొలుత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో దర్శన్ ఖైదీగా ఉన్నారు. పలుమార్లు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్ట్‌లో చుక్కెదురైంది . ఈ పరిణామాలతో మా హీరో అసలు బయటకు వస్తారా.. లేదంటే సెంట్రల్ జైలుకే పరిమితం అవుతారా అంటూ దర్శన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జైల్లో దర్శన్‌కు రాచమర్యాదలు లభిస్తున్నాయి. జైలు ఆవరణలో పలువురితో ముచ్చటిస్తూ కాఫీ , సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతోన్న దర్శన్ ఫోటో వైరల్ అయ్యింది.

ఈ పరిణామాలతో మృతుడు రేణుకా స్వామి తండ్రి తీవ్రంగా విలపించారు. తన బిడ్డను దారుణంగా చంపిన వ్యక్తికి జైల్లో సకల సౌకర్యాలు లభిస్తుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే బెంగళూరు జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు అతనిని తరలించింది.
అయితే దర్శన్ విజ్ఞప్తి మేరకు ఆయనకు టీవీ సదుపాయాన్ని కల్పించింది. మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. హత్య సమయంలో దర్శన్ వాడిన దుస్తులు, షూ, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 231 సాక్ష్యాలతో, 3,991 పేజీల ఛార్జీషీటును కోర్టులో దాఖలు చేశారు పోలీసులు. ఈ ఏడాది జూన్ 11 నుంచి దర్శన్ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటున్నారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పలుమార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు దర్శన్ విజ్ఞప్తిని తిరస్కరించింది. హత్య కేసులో సాక్ష్యాధారాలు నాశనం చేసేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించారని, అలాంటిది వీరికి బెయిల్ వస్తే విచారణకు ఆటంకం కలిగిస్తారని పోలీసులు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలపై ఏకీభవించిన న్యాయమూర్తి అందుకు అనుగుణంగా కస్టడీని పొడిగిస్తూ వచ్చారు.
తాజాగా రేణుకా స్వామి కేసులో దర్శన్‌కు ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య చికిత్సల కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దర్శన్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ట్రీట్‌మెంట్ కోసం ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు నాలుగు నెలల తర్వాత దర్శన్ జనంలో అడుగుపెడుతున్నారు. ఈ పరిణామాలతో ఛాలెంజింగ్ స్టార్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











