For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ పరీక్షలో నేను నెగ్గే సురేఖను గెలిచాను: చిరంజీవి

  By Srikanya
  |

  ''పెళ్లికి ముందు మావయ్య నాకు ఒక పరీక్ష పెట్టారు. అందులో నెగ్గడంతోనే సురేఖను నాకు ఇచ్చి పెళ్లి చేశారు''అన్నారు రాజ్యసభ సభ్యులు, ప్రముఖ నటుడు చిరంజీవి. పద్మశ్రీ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కార ప్రదానోత్సవం-2012 కార్యక్రమం సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ '' నన్ను అల్లుణ్ని చేసుకోవడానికి ముందు మామయ్య ఓ పరీక్ష పెట్టారు. 'మనవూరి పాండవులు' షూటింగు పూర్తయి రాజమండ్రి నుంచి చెన్నైకి రైల్లో వెళుతున్నప్పుడు... తనతో తెచ్చుకొన్న మద్యం సీసా మూత తీస్తూ నన్ను ఆహ్వానించారు. 'నేను ఆంజనేయ భక్తుడిని నాకు అలవాటు లేదు'అని చెప్పా. అప్పటి నుంచీ ఆయనకు నాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ పరీక్షలో నేను నెగ్గాను. సురేఖను గెలిచాను అన్నారు.

  అలాగే ఆయన నట వారసుడిగా నేను కొనసాగడం అప్పట్లో నాకెంతో ఆనందాన్నిచ్చేది. మావయ్యతో నాకున్న సాన్నిహిత్యం మరెవరికీ ఉండేది కాదు. మావయ్య పుట్టిన రోజు అక్టోబరు 1న హాస్యం పుట్టినరోజుగా భావిస్తా. ఆయన చేసినన్ని సినిమాలు మరెవ్వరూ చేయలేరేమో అనిపిస్తుంది. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోయేవారు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

  ఇక మామయ్య పేరుతో ఏర్పాటైన పురస్కారం భరణికి ఇవ్వడం సముచితం. అత్యుత్తమమైన ప్రతిభా పాటవాలు ఆయన సొంతం. 'శివ' సినిమాలో తన నటన ఎంతో సహజంగా అనిపించింది. నిజమైన రౌడీలా నటించారు. 'ఇంద్ర'లో నా దళపతిగా నటించారు. ఆ సమయంలో తన వ్యక్తిత్వం గురించి మరింత తెలుసుకొనే అవకాశం కలిగింది. అప్పటి నుంచి భరణిపై మరింత గౌరవం పెరిగింది. ఆయన శివతత్వం చెబుతుంటే వినాల్సిందే. ఆ సమయాన శివుడికి ఓ స్నేహితుడిలా అనిపిస్తారు. ఈ అవార్డుకే వన్నె తెచ్చారు అని చిరంజీవి అన్నారు.

  తనికెళ్ల భరణి మాట్లాడుతూ ''అల్లు రామలింగయ్య పేరిట ఉన్న పురస్కారం దక్కడం పూర్వ జన్మసుకృతం. ఆయన నటించిన సినిమాలకు మాటలు రాసే అవకాశం నాకు దక్కింది. అల్లు రామలింగయ్య కుటుంబంలో అందరితో కలిసి నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. చిరంజీవితో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది'' అన్నారు.

  రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ''తాతగారి పేరు వినిపిస్తే చాలు.. మా ఇంట్లో నవ్వులు పూస్తాయి. ఇంట్లో ఆయన ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉండేవారు. ఇప్పుడు కూడా పైన దేవుడిని నవ్విస్తున్నట్టున్నారు'' అన్నారు. ''సినిమాల్లో ప్రతి పాత్రకూ మధ్య వ్యత్యాసం చూపించాల్సి వచ్చినప్పుడు తాతగారు గుర్తొస్తుంటారు''న్నారు అల్లు అర్జున్‌. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్‌, శాసనసభ్యులు కొత్తపల్లి సుబ్బరాయుడు, కె.కన్నబాబు, ప్రముఖ వైద్యులు డా||గోపీచంద్‌, సినీ ప్రముఖులు అల్లు అరవింద్‌, కె.వెంకటేశ్వరరావు, సారిపల్లి కొండలరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, కొండవలస తదితరులు పాల్గొన్నారు.

  English summary
  ‘Allu Ramalingaiah National Comedian Award’ at a function held in Hyderabad. The event was attended by Megastar Chiranjeevi, Ram Charan, Allu Arjun, Brahmanandam, Allu Aravind and other members of the film industry. A host of political leaders like Ganta Srinivasa Rao, Vatti Vasantha Kumar and others also attended the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X