»   » జియాఖాన్ సూసైడ్ లెటర్ (తెలుగులో)

జియాఖాన్ సూసైడ్ లెటర్ (తెలుగులో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: గత సోమవారం ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటి జియా ఖాన్, తన బాయ్ ఫ్రెండ్ సూరజ్‌తో సాగించిన ప్రేమ వ్యవహారంలో సమస్యల కారణంగానే ఆ చర్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. జియా ఖాన్ తల్లి రబియా అమిన్ జియా రాసిన ఆరు పేజీల సూసైడ్ లేఖను బయట పెట్టింది. అందులో ఆమె సూరజ్ వల్ల ఎంత టార్చర్ ఎదుర్కొందో స్పష్టమవుతోంది.

ఆ లెటర్ తెలుగు వెర్షన్

''నాకెలా చెప్పాలో తెలియడంలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇక పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. నువ్వు ఇది చదివే సమయానికి నేను చనిపోయి ఉంటాను. లేకపోతే కొనఊపిరితో ఉంటానేమో. నా హృదయం ముక్కలయ్యింది. నీకా విషయం తెలియకపోవచ్చు. నిన్ను ప్రేమించే క్రమంలో నన్ను నేను పోగొట్టుకున్నాను. అయినప్పటికీ నువ్వు నన్ను ప్రతిరోజూ హింసించావు.

ఈ మధ్యకాలంలో నేను వెలుతురు చూడటానికి ఇష్టపడలేదు. ఉదయం మెలకువ రాకూడదని కోరుకుంటూనే మేల్కొన్నా. ఒకానొక సమయంలో నా జీవితాన్ని, నా భవిష్యత్తుని నీలో చూసుకున్నాను. కానీ నా కలలను చెదరగొట్టేశావ్. నేను నాలో ఎప్పుడో చనిపోయాను. నన్ను నేను ఎవరికీ ఇంతగా అంకితం ఇచ్చుకోలేదు. ఎవర్నీ ఇంతగా పట్టించుకోలేదు. కానీ నా ప్రేమను నువ్వు మోసాలు, అబద్ధాల రూపంలో తిరిగి ఇచ్చావ్.

Jiah Khan

నాకు గర్భం వస్తుందేమోనని భయపడ్డాను. అయినా నన్ను నేను నీకు పూర్తిగా ఇచ్చుకున్నాను. ప్రతిరోజూ నువ్వు నాకు కలిగించిన బాధ కొంచెం కొంచెంగా నన్ను కుంగిపోయేలా చేసింది. నా ఆత్మను చంపేసింది. నేను ఏమీ తినలేకపోతున్నాను. నిద్రపోలేకపోతున్నా. అందుకే అన్నింటికీ దూరంగా పారిపోతున్నా. నా కెరీర్ కూడా నాకు అంత గొప్పగా అనిపించలేదు.

నేను నిన్ను తొలిసారి కలిసినప్పుడు ఓ లక్ష్యంతో, క్రమశిక్షణతో ఉన్నాను. ఆ తర్వాత నీతో ప్రేమలో పడ్డాను. విధి మనిద్దర్నీ ఎందుకు దగ్గర చేసిందో నాకు అర్థం కాలేదు. నీ ప్రేమలో నాకు కమిట్‌మెంట్ కనిపించలేదు. రాను రాను నువ్వు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తావనే భయం పట్టుకుంది.

నాకు పనీ నువ్వూ తప్ప వేరే లోకం లేదు. కానీ నీకు పార్టీలు, ఆడవాళ్లు తప్ప వేరే తెలియదు. ఒకవేళ నేనీ ప్రపంచంలోనే ఉంటే నిన్ను అర్థించేదాన్నేమో. నిన్ను మిస్ అయ్యేదాన్నేమో. అందుకే నా పదేళ్ల కెరీర్‌ని, కలలని ముద్దాడి గుడ్‌బై చెప్పేస్తున్నాను. నీకు చెప్పలేదు కానీ నీ గురించి నాకొక మెసేజ్ అందింది. ఆ మెసేజ్ నువ్వు నన్ను మోసం చేస్తున్నావని తెలియజేసింది.

కానీ నేను ఖాతరు చేయలేదు. నిన్నే నమ్మాలనుకున్నాను. కానీ నువ్వు మోసం చేశావ్. నేనెవరితోనూ తిరగలేదు. కార్తీక్‌తో కలిసి నేనెవర్నీ కలవలేదు. నేను నిజాయతీపరురాలిని. నేను ఇచ్చినంతగా నీకు వేరే ఏ మహిళా ఇవ్వలేదు. నేను ప్రేమించినంతగా ప్రేమించలేదు. నా రక్తంతో ఈ విషయాన్ని రాయగలను.

ప్రేమించిన వ్యక్తి భయపెట్టాలనుకుంటే... మోసం చేస్తే... నీకన్నా ఆ అమ్మాయిలు అందంగా ఉన్నారని మొహం మీదే చెబితే.. ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్లాలి. కుటుంబాన్ని కూడా అగౌరవపరిస్తే ఏం చెయ్యాలి? నా సిస్టర్‌ని నువ్వు కలవలేదు. కానీ నీ సోదరి కోసం నేనెన్నో బహుమతులు కొన్నాను. నా ఆత్మను ముక్కలు చేసేశావ్. ఇక శ్వాసించడానికి నాకు కారణం కనిపించడంలేదు. నాక్కావల్సింది ప్రేమ. నీకోసం అన్నీ చేశాను. మనిద్దరికోసం పని చేశాను. కానీ నువ్వు నా భాగస్వామి అవ్వాలనుకోలేదు.

నా భవిష్యత్తు నాశనం అయ్యింది. నా సంతోషం దూరమైంది. ఎప్పుడూ నీకు మంచి జరగాలని కోరుకున్నాను. నీకోసం నా దగ్గరున్న కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టాలనుకున్నాను. నువ్వు నా ప్రేమను గుర్తించలేదు. పైగా నన్ను కొట్టావ్. నేను ఆత్మవిశ్వాసం కోల్పోయాను. నా ప్రతిభ, లక్ష్యం అన్నింట్నీ నాకు దూరం చేశావ్. నా జీవితాన్ని నాశనం చేశావ్. నీకోసం నేను పది రోజులు ఎదురు చూశాను. కానీ నాకోసం నువ్వేమీ చేయలేదు.

నా బర్త్‌డే గిఫ్ట్‌గా గోవా తీసుకెళ్లావ్. ఆ తర్వాత మోసం చేశావ్. అయినా నీతోనే ఉండాలనుకున్నాను. అబార్షన్ చేయించుకుని, మన బిడ్డను చంపేశాను. నేను చాలా చాలా బాధపడ్డాను. అయినప్పటికీ నీ బర్త్‌డే నాడు నిన్ను సాధ్యమైనంతవరకు ఆనందపరచాలనుకున్నాను. ప్రేమికుల దినోత్సవం నాడు నాకు దూరంగా ఉన్నావ్. మనిద్దరి నిశ్చితార్థం గురించి ప్రామిస్ చేశావ్.

కానీ నిలబెట్టుకోలేదు. నీక్కావల్సిందల్లా నాకు దూరంగా ఉండటమే. అమ్మాయిల కోసం, నీ స్వార్థపూరిత ఆలోచనల కోసం నన్ను దూరం చేశావ్. అయినా నాక్కావల్సింది నువ్వు, నా సంతోషం అనుకున్నాను. ఆ రెంటినీ లాగేసుకున్నావ్. స్వార్థం లేకుండా నీకోసం ఖర్చుపెట్టాను. నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించావనుకున్నాను. మన జీవితం గురించి, సక్సెస్ గురించి ఎన్నో కలలు కన్నాను.

నాకన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగానే అనిపించింది. చివరికి నీతో ఉన్నప్పుడు కూడా ఒంటర్ని అనే భావనతోనే బతికా. అంతగా నా జీవితాన్ని దుర్భరం చేశావ్. అందుకే చెదిరిపోయిన కలలతో, వికలమైన మనస్సుతో ప్రపంచాన్ని వదిలేస్తున్నా.ఇక నాకు నిద్రపోవాలనిపిస్తోంది. కానీ ఎప్పటికీ మెలకువ రాకూడదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu